స.హ చట్టం ఎత్తివేసేందుకు కేంద్రం కుట్రలు
– ఫోరం ఫర్ ఆర్‌టీఐ రౌండ్‌టేబుల్ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి
– దేశానికే నష్టం: వైఎస్సార్‌సీపీ నేత కందుల దుర్గేష్
సాక్షి, రాజమహేంద్రవరం: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో తెచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రస్తుత బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ సర్కారు ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. మంగళవారం స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజీలో ఫోరం ఫర్ ఆర్‌టీఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్‌జీవోలు, ఆర్టీఐ కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఫోరం జిల్లా కన్వీనర్ వరదా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల 70 శాతం అవినీతి అంతమవుతుందన్న సమయంలో ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దీన్ని రాజకీయ నేతలు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. స.హ. చట్టానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తమ పార్టీ నేతలతో చర్చించి పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆర్టీఐ లేకపోతే దేశానికే నష్టమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నల్లా రామారావు మాట్లాడుతూ తమ పార్టీ తరఫున చట్ట సవరణకు వ్యతిరేకత తెలియజేస్తామని చెప్పారు. కార్పొరేటర్ కోసూరి చండీ ప్రియ మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ చేసే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పిల్లి నిర్మల, రెడ్డి పార్వతి, పితాని లక్ష్మి కుమారి, ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ కార్యకర్త చేతన్, జనం పత్రిక సంపాదకులు కె.వెంకటరమణ, బీసీ నేత హారిక, తదితరులు పాల్గొన్నారు.