జీఎస్టీపై పోరాటం
జీఎస్టీపై పోరాటం
Published Fri, Jul 7 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
11న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
‘జీఎస్టీ-ప్రజలపై దాని ప్రభావం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం
రాజమహేంద్రవరం సిటీ : సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంలో ప్రజలకు న్యాయం జరిగే వరకూ సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని, దేశంలోని పార్లమెంట్ సభ్యుల సహకారంతో పార్లమెంట్‌లో చర్చిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు, జీఎస్టీ ప్రజలపై దాని ప్రభావం అనే అంశంపై శుక్రవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్ ఆనం రోటరీ హాల్లో సీపీఐ ఆద్వర్యంలో అఖిలపక్షనేతలు, వ్యాపారులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రజల్లో జీఎస్టీ పై తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న విధానాన్ని భారతదేశంలో అమలు చేయడం దారుణమన్నారు. నూతన చట్టం అమలుతో ఇప్పటికే చిరువ్యాపారులు, చేనేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 28 శాతం పన్ను మన దేశంలోనే ఉందని మండిపడ్డారు. సామాన్యప్రజలకు న్యాయం జరిగే వరకూ ïసీపీఐ ఆద్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. జీఎస్టీ విషయమై ఈ నెల 11న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త చట్టం ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. దాన్ని అమల్లోనికి తీసుకువచ్చే అధికారులకు సైతం అవగాహన లేని పరిస్థితి ఉందన్నారు. సీపీఐ తమ పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధానమంత్రితో చర్చ ఏర్పాటు చేస్తే తాను పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.యూపీఏ పాలనలో జీఎస్టీ 18 శాతం ఉండేలా ప్రతిపాదనలు చేస్తే మొదటగా వ్యతిరేకించింది మోడీయేనని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి,కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఏమాత్రం అవగాహాన లేని చట్టాన్ని అమల్లోనికి తీసుకుని వచ్చారన్నారు. వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధంగా అమల్లోనికి వచ్చిన జీఎస్టీ ప్రజలను సైతం ఆర్థికంగా ఇబ్బందిపెట్టే విధంగా తయారైందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ మాట్లాడుతూ వ్యాపారాన్ని వృత్తిగా చూడాలన్నారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ సుబ్బారాయుడు, హోల్‌సేల్ బట్టల వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బొమ్మనరాజ్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకులు మధు, నగర కార్యదర్శి నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement