పీఎంఓలోనూ మందకొడితనమే!
విశ్లేషణ
పాలనాధికారుల అవినీతి వెల్లడించే అధికారిని బతకనిచ్చే రోజులా ఇవి? ఐఎఫ్‌ఎస్ పాసై హరియాణాలో అటవీ శాఖలో పని చేస్తున్న సంజీవ్ చతుర్వేది అనే యువ అధికారి ఆ రాష్ర్టంలో అవినీతిపైన వివరంగా నివేదిక ఇచ్చాడు. సహచరులూ, నాయకులూ కూడా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. దీనిపై చర్యలను అడ్డుకునేందుకు చతుర్వేదిపైనే ఎదురు ఆరోపణలు చేసి పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. నాటి కాంగ్రెస్ అటవీ శాఖ మంత్రి జైరాం రమేశ్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆయన ఇద్దరు ఉన్నతాధికారుల దర్యాప్తు కమిటీని వేశారు. అవినీతిని రూపుమాపేందుకు, చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన సంజీవ్ చతుర్వేదిపైన కావాలని కుట్ర చేసి తప్పుడు క్రిమినల్ కేసు పెట్టారని, ముందు ఈ కేసును తొలగించి, అవినీతిపరులపైన వెంటనే సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కమిటీ సూచించింది.
సంజీవ్ చతుర్వేదిపైన తప్పుడు కేసు తొలగించక తప్పలేదు. హరియాణా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అనుమతించవలసి ఉంటుంది. కానీ వారికి ఇష్టంలేదు. దీనిపైన మరొక న్యాయ అభిప్రాయాన్ని కోరారు, రాష్ట్ర అవినీతిని విచారించే అధికారం కేంద్రా నికి లేదని, కనుక ఆ నివేదిక రాజ్యాంగ వ్యతిరేకమనీ, ఆ నివేదికను పాటించాల్సిన పని లేదని హరియాణా ప్రభుత్వం వాదించింది. దీనికి కేంద్ర నాయకుల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి. రెండు ప్రభుత్వాలు మారాయి. హరియాణాలో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది.
ఈ నేపథ్యంలో సుభాష్ చంద్ర అగర్వాల్ సమాచార హక్కును వినియోగిస్తూ సంజీవ్ చతుర్వేది వ్యవహారంలో చర్యలు ఏం తీసుకున్నారని పర్యావరణ మంత్రిత్వశాఖను ఆర్టీఐ కింద అడిగారు. మొదట ప్రధాని కార్యాలయం ఆయన అడిగిన సమాచారం వ్యక్తిగతమైందని వాదించింది. అయితే మూడో వ్యక్తి అయిన సంజీవ్ చతుర్వేదిని అడిగి అభిప్రాయం తెలుసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించింది. లేదన్నారు. కమిషన్ కార్యాలయం టెలిఫోన్‌లో సంజీవ్‌ను అభి ప్రాయం అడిగితే ఆయన అది తన వ్యక్తిగత సమాచారం కాదని, ఒకవేళ వ్యక్తి గత సమాచారమని అనుకున్నా, దాన్ని వెల్లడించడానికి తమకు అభ్యంతరమేదీ లేదని ప్రజా సమాచార అధికారికి చెప్పారు. ఆ మేరకు అడిగిన ఆ సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.
ఇదివరకు ప్రధాన సమాచార కమిషనర్ శ్రీమతి సుష్మా సింగ్ కూడా ఈ విధంగానే సంజీవ్ చతుర్వేదికి సంబంధించిన వ్యవహారాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఆదేశాలను పునఃసమీక్షిం చాలని పీఎంఓ కోరింది. దాన్ని కమిషన్ తిరస్కరించింది. మళ్లీ అదే డిమాండ్‌తో మరొక పిటిషన్ వేసారు. తాజాగా కమిషన్ ఇచ్చిన ఆదేశాన్ని కూడా పునఃసమీ క్షించాలని కోరారు. ఆ తరువాత మరొక పిటిషన్ వేస్తూ ఇదివరకటి సీఐసీ ఆదేశాన్ని ఇప్పటి సీఐసీ ఆదేశాన్ని కూడా పునఃసమీక్షించాలని కోరారు. దీన్ని సుభాష్ వ్యతిరేకించారు. పునఃసమీక్షించే అధికారాన్ని చట్టం సీఐసీకి ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తా విస్తూ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయరాదని వెంటనే ఈ పిటిషన్లు తిరస్కరించాలని కోరారు.
చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ శ్రీ విజయ్ శర్మ ఈ రెండు పిటిషన్లను తిరస్కరించి అభ్యర్థి కోరిన సమా చారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయాన్ని డిసెంబర్ మూడో తేదీన ఒక ఉత్తర్వు ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయానికి తెలిపారు. సంజీవ్ చతుర్వేది నివేదనల పైన, ఫిర్యాదులైపైన తీసుకున్న చర్యలేమిటి? ఇద్దరు సభ్యుల కమిటీ సిఫార్సు లను అమలు చేశారా? డీఓపీటీ అధికారులు కోరిన న్యాయనిపుణుల అభిప్రాయాన్ని లీక్ చేసిన వారెవరు? దానిపైన ఏచర్య తీసుకున్నారు? అవినీతి అధికారుల మీద సీబీఐ దర్యాప్తు చేయాలన్న సిఫార్సును అమలు చేయడానికి గత రెండు మూడేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయం గానీ హరియాణా ప్రభుత్వం గానీ ఏం చర్యలు తీసుకున్నది? అని సుభాష్‌చంద్ర అగర్వాల్ అడిగారు. పర్యావరణ మంత్రిత్వశాఖను అడిగిన సమా చారం, డీఓపీటీని అడిగిన సమాచారాన్ని వారు ఇచ్చారని, సీఐసీ ఉత్తర్వులను పాటించారని అగర్వాల్ తెలిపారు. కాని ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఇంకా సమాచారం అందలేదని ఫిర్యాదు చేశారు.
ఈ సమాచార అభ్యర్థన రెండో అప్పీలులో చాలా కీలకమైన అంశాలున్నాయన్న సుభాష్ వాదనతో కమి షన్ ఏకీభవించింది. పరిపాలనా పరమైన, రాజ్యాంగ పరమైన అంశాలు ఎన్నో ఇమిడి ఉన్నా యన్నారు. డీఓపీటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కాగితాలో్ల అనేక వివాదాలు వెల్లడైనాయని చెప్పారు. అవినీతిని అంతం చేయడానికి, కొందరి పైన అవి నీతి ఆరోపణలు వచ్చినందున దర్యాప్తు జరిపించడం ద్వారా తాము అవినీతిని సహించబోమని పాలకులు తెలియజే యవలసిన అవసరం ఉందని వాదించారు. ఇద్దరు ప్రధాన కమిషనర్లు, ఒక సమాచార కమిషనర్ ఆదేశించిన మేరకు సుభాష్ కోరిన సమాచారాన్ని పక్షం రోజుల్లో ఇవ్వాలని కమిషన్ ఆదేశాలు జారీచేసింది. (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కేసు ఇఐఇఅఅ2015000525లో సీఐసీ డిసెంబర్ 29, 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్)