
స.హ. చట్టంలో ఏ తేడాల్లేవ్...!
గుర్తింపు కార్డులు కోరకుండానే సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ స్పష్టంగా పేర్కొన్నది. అంటే సమాచారం అడిగే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కంటే, కోరిన సమాచారం ఇవ్వతగిందా కాదా అని ఆలోచించాలని ఈ చట్టం వివరిస్తోంది.
విశ్లేషణ
గుర్తింపు కార్డులు కోరకుండానే సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ స్పష్టంగా పేర్కొన్నది. అంటే సమాచారం అడిగే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కంటే, కోరిన సమాచారం ఇవ్వతగిందా కాదా అని ఆలోచించాలని ఈ చట్టం వివరిస్తోంది.
దేవా తాషి టిబెట్ వాడైనా భారతదేశంలో పుట్టినవాడు. న్యాయం ప్రకారం ఏ దేశంలో పుట్టినవాడు ఆ దేశపౌరుడే అవుతాడు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 5, పౌర చట్టం ప్రకారం కూడా పౌరసత్వం పుట్టుకతో వస్తుంది. సెంటర్ ఫర్ టిబెటన్స్‌లో తాషిని ఉద్యోగిగా సెంట్రల్ టిబెటన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ నియమించింది. అందరికీ ఇచ్చే ఉద్యోగ ధ్రువీకరణ పత్రం తనకు ఇవ్వలేదని, పిల్లల చదువు భత్యం, ఎల్‌టీసీ వంటివి తనకు ఇవ్వలేదంటూ ఆ ధ్రువీకరణ ప్రతులు ఇవ్వాలని స.హ. చట్టం కింద అడిగాడు. భారత పౌరుడివి కావు కనుక ఇవ్వం పొమ్మన్నారు సీటీఎస్‌ఏ అధికారులు.
మొదటి అప్పీలులో కూడా తాషికి సమాచారం దొరకలేదు. కమిషన్‌కు రాక తప్పలేదు. తాషి ఈ దేశ పౌరుడు కాడని మీకు ఎందుకు అనుమానం వచ్చింది అనే ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయారు. పోనీ భారత్‌లో పుట్టినాడన్న మాట నమ్మతగింది కాదా అని అడిగితే అదేమీ లేదని, ఆయన భారత్‌లో పుట్టిన విషయంపై ఏ అనుమానమూ లేదని వివరించాడు. మరి సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడిగితే స.హ. చట్టంలో పౌరుడికే ఇవ్వాలని ఉందని, కనుక ఇవ్వలేదని ఆ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులు జవాబు ఇచ్చారు.
ఆర్టికల్ 21 కింద జీవన హక్కులో తెలుసుకునే హక్కు కూడా ఉంది. పౌరుల పరిమితి లేకుండా ఈ హక్కు వ్యక్తులందరికీ వర్తిస్తుంది. విదేశీ వ్యక్తికి కూడా మన దేశంలో జీవించే హక్కు ఉంది. కొన్ని సమంజసమైన పరిమితులు ఉంటాయన్నది సాధారణ అంశమే. కానీ సమాచార హక్కు మాత్రం పౌరులకు మాత్రమే పరిమితమైంది. ఆర్టీఐ మానవ హక్కు. మనుషులందరికీ చెందవలసిన హక్కు. ఆర్టీఐ చట్టంలో పారదర్శకత, జవాబుదారీతనం మనుషులందరి పట్లా ఉండాల్సిందే కానీ వ్యక్తుల పట్ల ఆ బాధ్యత లేదనడానికి వీల్లేదు.
ఆర్టీఐ చట్టం పీఠికలో పౌరుడు అని మాత్రమే పేర్కొన్నారు. సెక్షన్ 3లో పౌరులందరికీ సమాచార హక్కు ఉందని అన్నారు. కనుక ఇది పౌరులకే అనే అవకాశం ఉంది. కానీ ఇతరులెవరికీ లేదనగలమా? 3వ సెక్షన్‌లో హక్కుకు సంబంధించిన ఒక ప్రకటన చేశారు. కానీ సమాచార అధికారుల బాధ్యతలు వివరించే అనేక సెక్షన్లలో వ్యక్తుల పట్ల బాధ్యత ఉన్నట్టు చాలా స్పష్టంగా ఉంది. వ్యక్తి అన్న మాట అనుకోకుండా వచ్చి పడింది కాదు. అనేక సెక్షన్లలో ఆ పదాన్ని వాడారు అంటే ఆర్టీఐ నిర్మాతలు ఈ హక్కును పౌరులు కాని వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వరాదని అనుకోలేదని తేలుతుంది. వ్యక్తుల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు సంబంధించిన సమాచారాన్ని రెండు రోజులలోపు ఇవ్వాలని సెక్షన్ 7 పేర్కొన్నది. సెక్షన్లు 4, 5, 6, 18లలో ఆర్టీఐ చట్టం వ్యక్తులు అన్న మాటను వాడింది. పరిపాలనాపరమైన, అర్థన్యాయపరమైన నిర్ణయాల కారణాలను వ్యక్తులకు తెలియజేయాలి. (4), వ్యక్తులు అడిగే సమాచారం ఇవ్వడానికి గాను అధికారులను నియమించాలి. (5), సమాచారం కావాలనుకున్న వ్యక్తి వ్రాత పూర్వకంగా గానీ ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా గానీ ఇంగ్లిష్ లేదా ఇతర భాషలలో సమాచారం కోరవచ్చు. (6), ఏ వ్యక్తినుంచైనా ఫిర్యాదు స్వీకరించవచ్చు(18). సెక్షన్ 3లో పౌరులందరికీ సమాచార హక్కును ప్రకటించిన చట్టం.. వ్యక్తులడిగే సమాచారాన్ని ఎలా ఇవ్వాలో ఇతర సెక్షన్లలో వివరించింది.
గుర్తింపు కార్డులు కోరకుండానే సమాచారం ఇవ్వాలని చట్టం స్పష్టంగా పేర్కొన్నది. అంటే సమాచారం అడిగే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న కంటే, కోరిన సమాచారం ఇవ్వతగిందా కాదా అని ఆలోచించాలని ఈ చట్టం వివరించిందని అధికారులు గుర్తించాలి. కొందరు ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఇవ్వకపోతే సమాచారాన్ని నిరాకరిస్తున్నారు. ఈ దేశ పౌరుడైనా ఆధార్‌కార్డు లేకపోతే సమాచారం ఇవ్వకూడదని చట్టం చెప్పలేదు.
అయినా అడుగుతున్న వ్యక్తి పౌరుడా కాదా అనే అనుమానం ఎందుకు వచ్చింది? దానికి సహేతుకమైన ఆధారాలున్నాయా? నిరాధారంగా అకారణంగా పౌరు డు కాడని అనుమానించి అడిగిన సమాచారం ఇవ్వదగినదే అయినా ఇవ్వకపోవడం సమాచార హక్కు ఉల్లం ఘనే అవుతుంది. నిజానికి ఈ కేసులో సమాచారం అడిగిన వ్యక్తి పౌరుడు. టిబెటన్ల సహాయం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ ఇది. అందులో నియమితుడైన దేవా తాషికి సంస్థలో వేధింపులు ఎదురైనాయి. అతనికి సమస్యలు సృష్టించారు. ఆర్టీఐ ద్వారా అతను పరిష్కారం కోరుతున్నాడు. సమాచార అధికారి, మొదటి అప్పీలు అధికారి కూడా అతని పై అధికారులే. అతని సమాచార హక్కును కూడా వాడుకోనీయడం లేదని దస్తావేజులు, అధికారుల వాదనలు వివరిస్తున్నాయి. ఎందుకు జరిమానా విధించకూడదో వివరించాలని జారీ చేసిన నోటీసులకు ఇచ్చిన వివరణలు హక్కు ఉల్లంఘనలను ధ్రువీకరిస్తున్నాయి. కనుక కమిషన్ ఈ సంస్థ పీఐఓ పైన 25 వేల రూపాయల జరిమానా విధిం చింది. (దేవా తాషి వర్సెస్ పీఐఓ సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ CIC/ CC/ A-/2014/001933&A కేసులో 22.11.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com)