
న్యాయానికి ‘పిల్’ అందించిన న్యాయమూర్తి
జస్టిస్ ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి (95) న్యాయవ్యవస్థకు విశ్వసనీయతను తీసుకొచ్చిన విశిష్ట మూర్తి. ఈ రాజ్యాంగసంస్థలో ప్రాణరక్షకమైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) వ్యవస్థీకరించిన ఘనత ఆయనదే. ఈ న్యాయవ్యవస్థ క్రియాశీలత వల్లే క్రియారాహిత్యంతో, అశక్తితో, అవినీతితో నిండిన కార్యనిర్వాహక వ్యవస్థను పరీక్షించడం, తనిఖీ చేయడం సాధ్యపడింది. జస్టిస్ భగవతి తీసుకొచ్చిన పిల్ అనే ఔషధంలోనే సమాచార హక్కు (ఆర్టీఐ)కి బీజాలున్నాయి.
ప్రభుత్వోద్యోగ వ్యవస్థలోని జాప్యందారీ విధానాలు, అసమర్థత, అవినీతితో కూడిన నిష్క్రియాతత్వం అనేవి ప్రజలకు హక్కులను, సుపరిపాలనను నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ క్రియా రాహిత్యాన్ని ప్రశ్నించడానికి సగటు మనిషికి అందుబాటులో ఉన్న ఏకైక సాధనంగా న్యాయవ్యవస్థ ఉపయోగపడుతోంది. కానీ న్యాయవ్యవస్థ ఇప్పటికే 3 కోట్లకు పైగా కేసుల భారంతో సతమతమవుతోంది. అధికరణం 32, అధికరణం 226 కింద న్యాయ పరి హారం పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగమే కల్పించినందుకు మనం గర్వపడుతున్నప్పటికీ, కోర్టులకు వెళ్లడానికి ఆటంకంగా ఉన్న ప్రయాణఖర్చులు, న్యాయవాది ఫీజుల కారణంగా పై రెండు గొప్ప అధికరణలను ప్రజలు తక్కువగానే ఉపయోగించుకుంటున్నారు. సమాచార హక్కు ఉనికిలోకి వచ్చేంతవరకు, ఆర్థికంగా శక్తిలేని వారు హక్కులను వదులుకోవలసి వచ్చేది. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, మహానగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షల సంఖ్యలో పేరుకుపోతున్న క్రియారాహిత్యం, అవినీతిలకు వ్యతిరేకంగా చిన్న స్థాయి పీఐఎల్‌లాగా ఆర్టీఐ పనిచేస్తోంది.
1982 ఎస్‌సి 149కి చెందిన ఎస్‌పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ ఏఐఆర్ ఫస్ట్ జడ్జెస్ కేసులో జస్టిస్ భగవతి ఇలా చెప్పారు. ‘‘ఈ దేశ ప్రభుత్వ పాలనాయంత్రాంగానికి చెందిన నిజ మైన వాస్తవాలను తెలుసుకోవడంలో పౌరులకున్న హక్కు ప్రజాస్వామిక రాజ్యం మూలస్తంభాల్లో ఒకటి... ప్రభుత్వ పనితీరులో, ప్రభుత్వ ప్రక్రియల్లో గోప్యతను పాటించినట్లయితే, అది అణచివేతను, అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.. ప్రభుత్వంలో పారదర్శకత అంటే ప్రభుత్వ యంత్రాంగం పని తీరులో పారదర్శకత్వం మాత్రమే అని కాదు. న్యాయ నియామకాలు, బదిలీలతోపాటు న్యాయవ్యవస్థ పని తీరులో కూడా ఇది ప్రతిబింబించాలి. ‘జస్టిస్ భగవతి చేసిన ఈ వ్యాఖ్య రాబోయే కాలాలకు కూడా బహిరంగ వాస్తవంగానే మిగిలి ఉంటోంది.
అత్యవసర పరిస్థితిలో జీవించే, స్వేచ్ఛగా ఉండే ప్రాథమిక హక్కు పౌరులకు ఉండదని తీర్పు చెప్పిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నందుకు జస్టిస్ భగవతి తర్వాత పశ్చాత్తాపం వ్యక్తపర్చారు. ప్రజల జీవించే, స్వేచ్ఛాహక్కును ఎమర్జెన్సీ దూరం చేయలేదని జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా తన చారిత్రక అసమ్మతిని ఈ సందర్భంగానే వెలువరించారు. జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా తీర్పు ప్రస్తుతం రాజ్యాంగ చట్టంగా మారింది. హెచ్‌ఆర్ ఖన్నా ప్రజల వాణిని ప్రతి బింబించారు. ఎమర్జెన్సీని విధించడం అంటే పౌరుల ప్రాథమిక హక్కుకు ముగింపు పలికినట్లు అని అర్థం కాదు. జోక్యం చేసుకునే హక్కు –లోకస్ స్టాండి– ఒక కఠినమైన చట్టం. ఇది హక్కుల కోసం ఆందోళన చేసే హక్కును బాధితులకు తప్ప మరెవ్వరినీ అనుమతించదు. తరగతి గదులకే పరిమితమైన ప్రజా ప్రయోజనాన్ని జస్టిస్ భగవతి కోర్టు గదుల్లోకి తీసుకొచ్చారు. నేడు న్యాయవ్యవస్థ క్రియాశీలంగా ఉంటూ, ప్రజా ప్రయోజన అంశాలను వెలుగులోకి తీసుకువస్తోందంటే, జస్టిస్ భగవతి సృజనాత్మకమైన, మేధో న్యాయ దృక్పథమే కారణం.
ప్రజా ప్రయోజనం, న్యాయవ్యవస్థ క్రియాశీలతపై జస్టిస్ భగవతి భావనే సమాచార హక్కుకు పునాదిగా నిలిచింది. ఎస్పీ గుప్తా కేసులో అద్భుతమైన తీర్పు ద్వారా ఆయన న్యాయమూర్తుల నియామకాల్లోని గోప్యతా విధానాన్ని బట్టబయలు చేశారు. ఆ చిన్న బీజమే నేడు ఆర్టీఐ అనే మహావృక్షంగా పెరిగింది. ప్రజా ప్రయోజనంపై తన భావన న్యాయవ్యవస్థ క్రియాశీలతనే కాదు.. ఆర్టీఐ చట్టంగా పరివర్తన చెందిన పౌరుల క్రియాశీలతను కూడా వేగవంతం చేసింది. కార్యనిర్వాహక ఇనుప తెరల కింద దాచిన సమాచారాన్ని పొందటానికి, బాధితుడా కాదా అనే అంశాన్ని పక్కన బెట్టి ఏ పౌరుడైనా సమాచారం కోసం ప్రశ్నించేలా ప్రోత్సహించడమే ఆర్టీఐ ప్రాథమిక లక్ష్యం.
సమాచార హక్కు ద్వారా ఏ పౌరుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. దావాలో భాగం కాకుండానే ఏ పౌరుడైనా తనకు లేదా ఇతరులకు సంబంధించిన సమస్యపై సమాచారాన్ని ఇప్పుడు కోరవచ్చు. జస్టిస్ భగవతికి మరణం లేదు. పీఐఎల్, ఆర్టీఐ రూపకర్తగా న్యాయవైఖరినే పరివర్తింపజేసి, ప్రభుత్వ ఫైళ్లను పౌరులకు బహిరంగపర్చడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తిగా ఆయన కలకాలం జీవించి ఉంటారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం, పారదర్శకత అనే భావనలకు ప్రాణం పోసిన సుప్రీంకోర్టు 17వ ప్రధాన న్యాయమూర్తిగా చిరస్మరణీయులు. సమాచారం తెలుసుకునే హక్కును తమకు దాఖలు పర్చిన జస్టిస్ పీఎన్ భగవతి పవిత్ర న్యాయాత్మకు దేశంలోని ప్రతి పౌరుడూ జోహార్లర్పించాలి.
- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com