చదువులపై కర్ర పెత్తనం | Madabhushi Sridhar Article On Education System | Sakshi
Sakshi News home page

చదువులపై కర్ర పెత్తనం

Published Fri, Jan 17 2020 12:16 AM | Last Updated on Fri, Jan 17 2020 12:16 AM

Madabhushi Sridhar Article On Education System - Sakshi

చదువంటే ఏమాత్రం శ్రద్ధ లేని ప్రభుత్వమా మనది? చదువుల శాఖను ఏ విధంగా నిర్వహించారనే ప్రాతిపదికపైన ప్రభుత్వాల పనితీరును నిర్ణయించాలి. విద్యాశాఖను మానవ వనరుల అభివృద్ధి శాఖ అని పేరు మార్చారు. మానవులను అభివృద్ధి చేయాలంటే అందులో ముఖ్యమయిన వనరు చదువు అని అర్థం. మొదటిసారి బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, పీవీ నరసింహారావు ఆ శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు విద్యాశాఖ మంత్రిగా ఆయన సమిష్టి ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించారు. వాజపేయి ప్రభుత్వంలో ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌ జోషి ఆ శాఖను నిర్వహించారు. దురదృష్టమేమంటే, డిగ్రీకి, డిప్లొమాకు తేడా తెలియని టీవీ నటిని ఒకామెను తీసుకొచ్చి మానవ వనరుల శాఖ మంత్రిగా నియమించింది 2014లో బీజేపీ ప్రభుత్వం. కొత్తప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ఆశ్చర్యపోయారు. అప్పుడే అనుమానం మొదలైంది. ఆ శాఖ అనేక చేతులు మారి ప్రస్తుతం రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ చేతికి వచ్చింది. మనీష్‌ వర్మ ఆరోపణల ప్రకారం మంత్రిగారికి బీఏ డిగ్రీ కూడా లేదు. ఈయన ఎంఏ డాక్యుమెంట్ల కాపీలు ఆర్టీఐ కింద కోరితే ఇవ్వడానికి నిరాకరించారు.

మానవవనరుల అభివృద్ధి శాఖ మాజీ మంత్రి స్మృతి ఇరానీ ధారాళంగా మాట్లాడతారు. మరికొందరు బీజేపీ నాయకులకు డిగ్రీలకు అతీతమైన తెలివితేటలున్నాయి. స్మృతి ఇరానీ గారి చదువు వివరాలు ఇవ్వాలని సీఐసీ ఆదేశిస్తే ‘కేజీ వివరాలు కూడా ఇస్తాం తీసుకొమ్మనండి’ అని ప్రకటన చేసిన ఈ మంత్రి గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి చదువు వివరాలు తన వ్యక్తిగత గోప్యత, రహస్య అంశాలనీ, బహిర్గతం చేయరాదని వాదిస్తూ స్టే తెచ్చుకున్నారు. వీరు మన చదువుల భవిష్యత్తు తీర్చిదిద్దే మంత్రులు. చదువుల శాఖకు వీరిని మంత్రులుగా నియమించేవారు మన జాతీయ నాయకులు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్‌ ‘నేచర్‌’ తాజా సంచికలో భారతదేశంలో విశ్వవిద్యాలయాలను రక్షించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందని ఒక సంపాదకీయంలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలమీద ఈ ప్రభుత్వాలకు ద్వేషం. అక్కడ చదువుకున్న విద్యార్థులు ధైర్యంగా పాలకులు చేసే అన్యాయాలను ప్రశ్నించడం వీరికి నచ్చదు.

ఆ విధంగా ప్రశ్నిం చడం వారి అధికార పునాదులు కదిలించి వేస్తుం దని గుండెల్లో దడ. కనుక ఆ విశ్యవిద్యాలయాలను నిధులు ఇవ్వకుండా మాడ్చుతారు. అక్కడ పెట్టే ఖర్చులు రేపటి విద్యావంతమైన చైతన్య సమాజానికి అవసరమైన పెట్టుబడులని అర్థం చేసుకోలేరు. లేదా అర్థం చేసుకున్నారు కనుకనే ఈ సంస్థలను నీరసింపచేస్తున్నారేమో. విశ్వవిద్యాలయాలకు నిధుల తగ్గింపు ఒకవైపు, ఇనుప రాడ్లతో దాడులు మరొకవైపు ఈ సంస్థలను నీరు కారుస్తున్నాయి. 2014–15లో మొత్తం వ్యయంలో 4.14 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిస్తే దాన్ని 2019–20 నాటికి 3.4 శాతానికి తగ్గించారు. 2014–15లో దేశ జీడీపీలో విద్యా వ్యయం 0.53 శాతం అయితే 2019–20 నాటికి దాన్ని 0.45 శాతానికి తగ్గించారు. విద్యారంగాన్ని కాపాడుకోవాలంటే చదువుకోవడాన్ని చదువు‘కొన’డంగా మార్చకుండా చాలా సులువుగా తక్కువ ఖర్చుతో చదువుకునే పరిస్థితులు, సంస్థలు ఏర్పడాలి.

ప్రయివేటు విద్యావ్యాపారులను దొడ్డిదారిన ప్రోత్సహించడం కాదు. ఉపాధి, ఉద్యోగ వనరులను కల్పించాలి. ఈ రెండు మార్గాల ద్వారానే విద్యాలయాల్లో ఆందోళనలు తగ్గుతాయని నేచర్‌ పత్రిక వివరించింది. జామియా, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలలో పోలీసులు వీటిలోకి చొరబడి కనబడిన వారినల్లా చితకబాదారు, శాంతి భద్రతల రక్షణ కోసం. ఇక జేఎన్‌యూలో ముసుగులు ధరించి గూండాలు ఇనుపరాడ్లతో విద్యార్థుల తలలు పగులగొడుతూ ఉంటే, వందల సంఖ్యలో ఉన్న పోలీ సులు అనుమతి లేదనే నెపంతో మౌనంగా ఉండిపోయారు. మూడు సంఘటనల్లో విద్యాలయాలు నెత్తుటి మడుగులైనాయి. బాధితులే అనుమానితులని వారిపైనే కేసులు పెడుతున్నారు. పోలీసుల నిష్క్రియ మీద ఏచర్యలూ లేవు. ఇవన్నీ చదువు పట్ల మనకున్న గౌరవానికీ, సంస్కారానికీ ప్రతీకలు.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement