బిరుదుమీద సహ అస్త్రమా? | opinion on padma awards usages by rti commissioner madabushi shridhar | Sakshi
Sakshi News home page

బిరుదుమీద సహ అస్త్రమా?

Published Fri, Dec 16 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:48 PM

బిరుదుమీద సహ అస్త్రమా?

బిరుదుమీద సహ అస్త్రమా?

విశ్లేషణ
ఒక ప్రశ్నకు, ఒక అభిప్రాయానికి, ఒక విమర్శకు ఆర్టీఐలో మౌలికంగా స్థానం లేదు. ప్రశ్నించే హక్కు.. విమర్శించడానికి, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి హక్కు ఉంది కాని, ఆర్టీఐలో దాన్ని కలపడానికి వీల్లేదు.

పద్మశ్రీ బిరుదు వాడుకోవచ్చా? కేంద్ర విశ్వవిద్యాలయమైన కాశీవిద్యాపీఠం ఉపకులపతిగా పనిచేసిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు లాల్జీసింగ్‌ కేంద్ర హిందూ బాలుర పాఠశాల శంకుస్థాపన ఫలకం మీద పద్మశ్రీని పేర్కొనడంపై విద్యావంతుడైన ఒక ఉద్యోగి ఆర్టీఐ ద్వారా ప్రశ్న వేశాడు.
విద్యావినోద వ్యాపారాలకు పద్మ అవార్డులను వాడుకోకుండా నిరోధించాలని వచ్చిన ఒక పిటిషన్‌పై హైకోర్టు పద్మశ్రీని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించరాదనే ఆదేశాన్నిచ్చింది. అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ గురించి చెప్పుకునే హక్కు ఉందని న్యాయస్థానం అంగీకరించింది. కొందరు అనర్హులు కూడా పైరవీలు చేసి సాధిస్తున్నారని ఆరోపణలు ఉన్నప్పటికీ, నిపుణులకు, సేవాపరులకు, ఉత్తమ కళాకారులకు కూడా పద్మ బిరుదులు వస్తున్నాయనే విషయాన్ని ఎవరూ కాదనలేరు.

ముఖ్యంగా ప్రభుత్వ దస్తావేజుల్లో ఉన్న సమాచారాన్ని బయటకు తెచ్చి ఆ సమాచారం ఆధారంగా సమస్యలను, తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే అవకాశాన్ని ఆర్టీఐ చట్టం కల్పించింది. ప్రజాశ్రేయస్సు, మంచిపనులకు ప్రోత్సాహం ఆర్టీఐ లక్ష్యాలు. రెండింటినీ దుర్వినియోగం చేయకూడదు. సినిమా ఒక వ్యాపారం, విద్యాసంస్థలను నడపడం మరొక వాణిజ్యం. ఈ రెండింటికీ పద్మశ్రీ వాడరాదని కోర్టు మార్గదర్శకత్వం చేసింది. ఒక టీచర్‌కు పద్మశ్రీ వస్తే ఆయన పనిచేసే కళాశాల, విశ్వవిద్యాలయం ఆ బిరుదును పేర్కొనడం వల్ల నష్టం లేదు. అది గర్వకారణం, గౌరవ కారణం కూడా. కాని ఆయన ఒక కోచింగ్‌ సెంటర్‌ పెట్టడం, లేదా కోట్లు సంపాదించే కోచింగ్‌ సెంటర్‌లో పాఠం చెప్పినందుకు ఆయన పేరు మొదట పద్మశ్రీ బిరుదును వాడితే అది దుర్వినియోగమే అవుతుంది.

పద్మశ్రీ బిరుదు ఎందుకు ఇచ్చారని, లేదా పద్మశ్రీ బిరుదుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న దస్తావేజులను ఇవ్వాలని సంబంధిత అధికారిని సమాచారం కోరడం లేదు. ఆ బిరుదును ఎందుకు వాడారని ఒక యూనివర్సిటీని అడుగుతున్నారు. ఇటువంటి వివరణలు కోరడానికి ఆర్టీఐ వీలు కల్పించడం లేదని తెలుసుకోవాలి.

ఈ ఆర్టీఐ ప్రశ్నవెనుక లాల్జీసింగ్‌ పేరుతో పద్మశ్రీని అసలు వినియోగించుకోకూడదనే ఆక్షేపణ ఉంది. ప్రశ్నించినవారు నిజానికి ఏ సమాచారమూ కోరడం లేదు. ఒక ప్రశ్నకు, ఒక అభిప్రాయానికి, ఒక విమర్శకు ఆర్టీఐలో మౌలికంగా స్థానం లేదు. ప్రశ్నించే హక్కు.. విమర్శించడానికి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి హక్కు ఉంది కాని, ఆర్టీఐలో దాన్ని కలపడానికి వీల్లేదు. అక్కడ సమాచారం మాత్రమే అడగాలి. ఆక్షేపణలకు ఆర్టీఐ కింద పీఐఓ ఏం సమాధానం చెబుతాడు? లాల్జీసింగ్‌ శంకుస్థాపన ఫలకాన్ని నిర్మాణ విభాగం ఏర్పాటు చేసిం దన్న సమాచారం మాత్రం ఇచ్చాడు పీఐఓ.

ఈ చదువుకున్న ఆర్టీఐ అభ్యర్థి కనీసం లాల్జీసింగ్‌ ఎవరు, ఆయనకు ఈ బిరుదు ఎందుకు ఇచ్చారు, ఆయన సాధించిన విజయాలేమిటి? అని తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. లాల్జీసింగ్‌ ఎన్నో శాస్త్రీయ ప్రయోగశాలలను స్థాపించి, వైజ్ఞానికంగా డీఎన్‌ఏ శాస్త్రాన్ని ప్రజాప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు.  జన్యుపరమైన జబ్బులతో పేదలు బాధపడుతుంటే వారి రోగనిర్ధారణ శాస్త్రాన్ని రూపొందించారు. సెల్యులార్‌ మాలిక్యులర్‌ బయాలజీ కేంద్రాన్ని నెలకొల్పి దాని డైరెక్టర్‌గా పనిచేశారు. మన న్యాయస్థానాలలో నేరస్తులను స్పష్టంగా గుర్తించడానికి డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బియాంత్‌ సింగ్‌–రాజీవ్‌ గాంధీ, నైనాసాహ్ని–తండూర్‌ హత్యకేసుల్లో, స్వామి ప్రేమానంద్‌ స్వామి–శ్రద్ధానంద, ప్రియదర్శినీ–మట్టూ హత్యకేసుల్లో కీలకమైన సాక్ష్యాలను డీఎన్‌ఏ పరిజ్ఞానంతో స్పష్టీకరించే అవకాశాలను మనముందుంచిన గొప్ప శాస్త్రజ్ఞుడు లాల్జీ సింగ్‌.

ఈయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అజ్ఞానంతో అడిగేవారు అంతటితో ఆగిపోతే బాగుండేది. దాన్ని సెకండ్‌ అప్పీలుదాకా తేవడం ఆశ్చర్యకరం. పీఐఓ సమాచారం ఇచ్చినా, నాకు తృప్తి కలగలేదు అనే ఒకే ఒక వాక్యంతో ఏ ఫీజూ లేకుండా ఒక కాగితం గీకిపారేసి అదే నా మొదటి అప్పీలు, అదే నా రెండో అప్పీలు అనే తత్వంతో పనికిరాని అప్పీళ్ల వరద పారిస్తున్నారు. పదిరూపాయలతో ఏదిపడితే అది అడిగే అవకాశం ఉంది. అదే ధోరణితో కమిషన్‌ దాకా ప్రయాణించే ఫ్రీ టికెట్‌ కూడా ఉంది. ఎక్కువ లాంఛనాలతో పని లేకుండా చాలా సులువుగా సమాచారం సాధించడానికి ఇచ్చిన అవకాశం ఇది. ఈ అజ్ఞాన ఆర్టీఐ దుర్వినియోగానికి జవాబుగా లాల్జీసింగ్‌ జీవిత సంక్షిప్త చరిత్రను పంపాలని సీఐసీ ఆదేశించింది. (ప్రమీల్‌ పాండే వర్సెస్‌ కాశీ విశ్వవిద్యాలయం  CIC/ RM/A-/2014/001789&SA  కేసులో 5.10.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)


(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌ కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement