ఇవ్వాళ నిన్న రెండు పతాక శీర్షికలు పక్కపక్కనే మన ప్రజాస్వామ్య స్వతంత్ర న్యాయ రక్షకభట బాధ్యతల గురించి నమ్మకాలు, అనుమానాలు పెంచేవి. జూలై 22: పైలట్‌కు హైకోర్టులో ఊరట. దాని పక్కవార్త, ఎమ్మెల్యేను హత్య చేసిన 11 మంది పోలీసుల నేరం రుజువు. జూలై 23: హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు స్పీకర్.. విచారణ ఈరోజు. పక్కవార్త: 11 మంది పోలీసులకు హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష. విచిత్రమేమంటే ఈ రెండూ రాజస్తాన్ రాజకుతంత్రాలే.
ఒకవైపు ఊరించే రాజకీయ యుద్ధభేరీలు, ఒకవైపు మెదళ్ల కుదుళ్లను కుదిపిలేపే పోలీసు హత్యలు. ఆవైపు ఒక్కరోజులో ఆకస్మిక అద్భుత న్యాయం. ఈ వైపు మూడున్నర తరాల కాలం పాటు (35ఏళ్లు) నేరం రుజువుకాక రాజ్యమేలిన పోలీసు ఎన్‌కౌంటర్ న్యాయం. ఏ దేశంలో నైనా ఇంత గొప్ప వైవిధ్యం ఉంటుందా? రాజ్యాంగ పాలనకు నిలువెత్తు అద్దాలివి.
రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విఠలాచార్య (పూర్వ అపూర్వ జానపద చిత్ర దర్శకుడు) లెవల్ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ఎడతెగని కత్తి యుద్ధాల్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. కొనుక్కున్న ఎమ్మెల్యేలు సరిపోవడం లేదు. తూకానికి ఇంకా బరువు కావాలంటే గెహ్లోత్ వర్గం సరుకు అయిదుతారల పూటకూళ్ల మందిరంలో రక్షకభటుల రక్షణలో నిలువ చేయబడ్డారు. సచిన్ పైలట్ వారి సరుకు మరొక నక్షత్ర భోజనవసతిశాలలో భద్రంగా భద్రతా దళాల మధ్య సేదతీరుతున్నారు. ఆ విధంగా పోలీసులు మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంటే రాజ్యాంగ న్యాయం చేయడానికి కళ్లకు గంతలు కట్టుకుని చేత కత్తి బట్టుకుని మరోచేత్తో తరాజు పట్టుకుని పామును తొక్కుతూ (ఎక్కడ పడతారో తెలియదు) న్యాయదేవతను రమ్మని వకీళ్లు ఆవాహనచేస్తున్నారు.
అటు గెహ్లాట్ ఇటు పైలట్. ఇరువురూ బరువులే. బలమైన పార్టీలు వారి వెంట ఉన్నాయి. స్పీకర్ ఏదో ఒక నిర్ణయంతీసుకునే దాకా మనకళ్లగంతలు విప్పవద్దురా నాయనా అని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా కత్తి తిప్పుతున్నది రాజస్తాన్ హైకోర్టు. ‘‘స్పీకర్ గారూ నేను ఇంకో రెండు రోజుల తరువాత మీ సంగతి చెబుతాను అందాకా ఏమీచేయకండి ప్లీజ్’’ అని బతిమాలింది. పాతగుర్రాల తబేలా నుంచి గుర్రాలు పారిపోకుండా ఉండాలని కట్లు, ఆ కట్లు తెంపి తరలించుకుపోవడానికి ప్రయత్నాలు. మహాఘనత వహించిన రాజస్తాన్ ఎమ్మె ల్యేలను వారి శిబిరాలనుండి కిడ్నాప్ చేయడానికి చట్టాలు, రాజ్యాంగం, రక్షకభటులు, (సైన్యాన్ని ఒక్కటి వాడడం లేదేమో) అనే రకరకాల పద్మవ్యూహాలను అల్లుతున్న సమయంలో ఒక్కరోజు గడువు ఇచ్చినా బేరసారాల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుందని అందరికీ తెలుసు.
కానీ చేతిలో కత్తి, కళ్లకు గంతలు. కాలికింద పాము. పీత కష్టాలు పీతవి. సుప్రీంకోర్టు వారు కూడా తమ విలువైన సమయాన్ని వాడి రాజస్తాన్‌లో రాజ్యం గాన్ని రక్షించడానికి జూలై 23న ప్రయత్నిస్తామన్నారు. చివరికి గురువారం రాజస్తాన్ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తిరిగీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. నాలుగైదు రోజులనుంచి కరోనాకన్నా గొప్ప కలకలం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంటే అది సచిన్ పైలట్ ఆత్మనిర్భర యజ్ఞమే.
నిజం చెప్పిన బుల్లెట్లు : మరొకవైపు గొంతుచించుకుని అరిచే మీడియా కథనాలు అల్లే కథ 1985 పోలీసు హత్యాకాండ. రాజామాన్‌సింగ్ ఆనాటి భరత్పూర్ రాజు. భరత్పూర్ రాజ్యపతాకాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తుంటే రాజామాన్సింగ్ ఆవేశ పడి ఫిబ్రవరి 20, 1985న రాజస్తాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల సభావేదిక వైపు తన మిలిటరీ వాహనంతో శరవేగంగా దూసుకువచ్చి అక్కడ ఆగిన హెలికాఫ్టర్‌ను ఢీకొన్నాడట. హత్యాప్రయత్నమని కేసుపెట్టారు. మరునాడు ఫిబ్రవరి 21న పోలీసుస్టేషన్‌లో లొంగి పోవడానికి ఠాకూర్ హరిసింగ్, ఠాకూర్ సుమర్ సింగ్‌తో కలిసి వెళ్తున్నారు. పకడ్బందీగా అల్లిన కుట్ర ప్రకారం డిఎస్పీ కాన్ సింగ్ భాటి అతని అనుచర పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ చంపేశారు.
ఆనాడది ఎన్ కౌంటర్. తమపై కాల్పులు జరుపుతూ ఉంటే ఎదురు కాల్పులు జరిపామని పాతకట్టుకథే. మాన్‌సింగ్ వీపులో వెనుకనుంచి దిగబడిన బుల్లెట్లు నిజం చెప్పాయి. కోర్టు నిజం వినిపించుకున్నది. మరునాడు ముఖ్యమంత్రి రాజీ నామా చేయడం 1985నాటి విలువ. 35 ఏళ్లకైనా ఎన్ కౌంటర్ హత్య రుజువుకావడానికి కారణం హత్యకేసు పెట్టడమే. ఇప్పుడు కేసు పెడుతున్నారా? ఇందులోకూడా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో తుది న్యాయం ఎన్నేళ్లకు, ఎవరికి దక్కుతుందో తెలియదు. అయినా ట్రిగ్గర్ నొక్కిన పోలీసు వేళ్లను ఆదేశించిన మెదళ్లు కోర్టులకు దొరుకుతాయా? నక్కలు, తమ జిత్తుల రాజకుట్రలకు వకీళ్లను, కోర్టులను, పోలీసులను వాడుకుంటారనే పాఠం అర్థమవుతున్నదా?
వ్యాసకర్త
మాడభూషి శ్రీధర్
బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment