జైపూర్: వచ్చే నెలలో(నవంబర్) జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశంలో రాజకీయ వేడిని పెంచాయి. ప్రధాన పార్టీలన్నీ, అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగిపోయాయి. మిజోరాం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోరు నెలకొని ఉంది. ఈ మూడింటిలో రెండు రాష్ట్రాల్లోనూ( చత్తీస్‌గఢ్, రాజస్థాన్) కాంగ్రెస్ అధికారంలో ఉంది.
200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఒకే విడుతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్‌ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
దేవుడి దయతో తనను నాలుగోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా తనతో చెప్పారని అన్నారు. తాను ఈ సీఎం పదవిని వదిలిపెట్టాలని అనుకుంటున్నాప్పటికీ.. అది అతన్ని విడిచెపెట్టడం లేదని ఆమెతో చెప్పినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తనని విడిచిపెట్టదు కూడా అని చెప్పారు. తనలో ఏదో ఉందని, అందుకే పార్టీ హైకమాండ్ తనను రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మూడుసార్లు ఎంపిక చేసిందని అన్నారు. అయితే..హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆయన అన్నారు.
సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం తనను సీఎం చేయడమేనని చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు గెహ్లాట్ స్పందిస్తూ.. ప్రతిపక్ష బీజేపీ మాత్రమే ఆ విషయంపై చింతిస్తోందని కౌంటర్ వేశారు. తాము పోట్లాడటం లేదని బీజేపీ ఆందోళన చెందుతోందని చురకలంటించారు. అందరి అభిప్రాయాలను పరిశీలించి, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను సచిన్ పైలట్ మద్దతుదారులతో కూడా మాట్లాడుతున్నానని, వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నానన్నారు. నిర్ణయాలు సజావుగా జరుగుతున్నాయని, అందుకే బీజేపీకి టెన్షన్ మొదలైందన్నారు.
చదవండి: కర్ణాటక గాయం బీజేపీకి గుర్తుందా?
ఒకవేళ మంచి ప్రత్యామ్నాయాలు దొరికితే.. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభ్యర్థుల్ని మారుస్తుందని గెహ్లాట్ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవని, తాను క్షమించు, మరచిపో మంత్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు. ఇంతకుముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని పైలట్ చెప్పడంతో.. అతని క్యాంప్‌లోని సభ్యులకూ టికెట్లు లభిస్తాయన్న వార్తలు వస్తున్నాయి.
కాగా గతంలో.. గెహ్లాట్, ఆయన మాజీ డిప్యూటీ పైలట్ నేతృత్వంలోని క్యాంపుల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. 2020లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పైలట్ తన క్యాంప్‌తో కలిసి తిరుగుబాటు చేసినప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలడం నుంచి కాపాడింది. అందుకే.. అవకాశం దొరికినప్పుడల్లా పైలట్‌పై అశోక్ గెహ్లాట్ విరుచుకుపడుతుంటారు. ఇప్పుడు మరోసారి అతనిపై మండిపడుతూ విమర్శలు గుప్పించారు.
మరోవైపు కాంగ్రెస్ రాజస్థాన్ మినహా నాలుగు రాష్ట్రాలకు కనీసం తమ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఒక్కరాజస్థాన్‌ను మాత్రం హోల్డ్‌లో పెట్టింది. అధికార పార్టీ కాంగ్రెస్ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవడం పెద్ద విషయమనే చెప్పాలి. సీఎం అశోక్ గహ్లోత్, రెబల్ ఎమ్మెల్యే సచిన్ పైలట్ మధ్య ఉన్న ఘర్షణ కారణంగా అభ్యర్థుల జాబితాను బహిర్గతం చేయడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment