విషయం చెప్పకపోతే వివాహం నిలవదు | Madabhushi Sridhar Write About Privacy | Sakshi
Sakshi News home page

విషయం చెప్పకపోతే వివాహం నిలవదు

Published Fri, Jun 22 2018 1:58 AM | Last Updated on Fri, Jun 22 2018 1:58 AM

Madabhushi Sridhar Write About Privacy - Sakshi

ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సమస్య ప్రైవసీ.  అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏ వ్యవహారాల నయినా రికార్డు చేసి జనం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరి రహస్యాలు బయటపడే అవకాశాలు పెరిగాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నపుడు తమ వివరాలు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కొనుగోళ్లు, ఇతర ఒప్పందాలకు ముందు అన్ని విషయాలు వెల్లడించడం చట్టపరమైన బాధ్యత. పూర్తి విషయాలు చెప్పకపోయినా, కొన్ని విషయాలు దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసం చేసినా ఒప్పందాలు చెల్లవు. భాగస్వామ్య ఒప్పందాలు, సేవలు, వస్తువుల కొనుగోళ్ల సంబంధాలు కూడా పరస్పర సమాచార మార్పిడి మీదనే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత విషయాలు అనుకునేవి కూడా ఒక్కోసారి పంచుకోకతప్పదు. 

పెళ్లి, సంతానం, మాతృత్వం, పిల్లలను పెంచడం, వారి చదువులు తదితర అంశాలన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఆ విషయాలు ఇతరులకు అనవసరం. ఒకవేళ అవసరం ఉంటే దేనికో చెప్పాలి. ప్రజా ప్రతినిధులు, ప్రజా సేవ కులు, ప్రజలందరికీ తెలిసిన నేతలు, తారలు, క్రీడా కారుల వ్యక్తిగత జీవన పరిధి మిగతా వారి కన్నా తక్కువ. ప్రాథమిక హక్కే అయినా ప్రైవసీకూడా మినహాయింపులకు లోబడి ఉంటుంది. డాక్టర్‌– పేషెంట్‌ సంబంధం ప్రైవసీని సృష్టిస్తుంది. అది ఒక కాంట్రాక్టు. సమాచారాన్ని డాక్టరు గోప్యంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి దీనికి మినహాయింపు ఉంటుంది. కాబోయే జీవన భాగ స్వామి ఆరోగ్య లేదా రోగనిర్ధారిత సమాచారం భాగస్వామికి తెలియాలి. 

హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహ చట్టాల్లో ఆరోగ్య సమాచార మార్పిడి అవసరమనే నియ మం ఉంది. పెళ్లయిన తరువాత జంటలో ఒకరికి ఎయిడ్స్‌ వంటి జబ్బు లేదా ఏదయినా తీవ్రమైన అంటురోగం ఉందని తేలితే వివాహాన్ని రద్దుచేసుకునే అవకాశం చట్టాలు కల్పిం చాయి. హిందూ వివాహ చట్టం సెక్షన్‌ 13, ముస్లిం వివాహాల రద్దు–1939 చట్టం సెక్షన్‌ 2, పార్సీ వివాహం, విడాకుల చట్టం 1936, ప్రత్యేక వివాహాల చట్టం సెక్షన్‌ 27 ప్రకారం భాగస్వామికి వ్యాప్తిచెందే సుఖ రోగం ఉందనే కారణంపై విడాకులు కోర వచ్చు. తనద్వారా మరొకరికి అంటువ్యాధిని నిర్లక్ష్యంగా వ్యాపించేట్టు చేస్తే, అది నేరమని, దానికి ఆరు నెలల జైలు శిక్ష విధించే వీలుందని భారతీయ శిక్షా స్మృతి సెక్షన్‌ 269 చెబుతోంది. రోగం తెలిసి తెలిసి అంటించేట్టు చేస్తే అందుకు రెండేళ్ల జైలు శిక్షను సెక్షన్‌ 270 నిర్దేశించింది. అంటే ఒక వ్యక్తికి ఎయిడ్స్‌ ఉందని తెలిసి, అతడిని ఒక యువతి తెలియక పెళ్లి చేసు కుంటుంటే చూసి మౌనంగా ఉండడం కూడా ఈ సెక్షన్‌ కింద నేరమే. 

తాను పరీక్షించిన వ్యక్తికి ఎయిడ్స్‌ ఉందని తెలిసి, అతడి ప్రేమికురాలు అడిగినా ఆ విష యం చెప్పని డాక్టర్‌ ఆ తరువాత ఆమెకు ఆ రోగం సోకితే ఈ సెక్షన్‌ కింద ప్రాసిక్యూషన్‌కు గురి కావ లసి వస్తుంది. నేరం రుజు వైతే డాక్టర్‌కు రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు, ఆ విధంగానే ఆరోగ్యకరమైన జీవి తం కొనసాగించే హక్కు కూడా ప్రాథ మిక హక్కే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఈ రెండింటిలో ఏది న్యాయ బద్ధమైందో, నీతివంతమైందో అది గెలు స్తుంది. రోగి అయిన వరుడి వివాహ హక్కుకన్నా వధువు ఆరోగ్యవంతమైన జీవన హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ వలసి వస్తుందని సుప్రీంకోర్టు చరిత్రా త్మక తీర్పు చెప్పింది. 

ప్రతి హక్కు ఒంటరిగా ఉండదు. తగిన బాధ్య తలతో ఉంటుంది. ఒకరి హక్కు మరొకరి బాధ్యతతో ముడిపడి ఉంటుంది. స్నేహబంధమైనా, వ్యాపార సంబంధమైనా, ఉద్యోగ అనుబంధమైనా పూర్తిగా అన్ని విషయాలు తెలియజేస్తేనే నిలుస్తాయి.  కుటుం బంలో, భాగస్వామ్య వ్యాపారాలలో దాపరికం, సోమరితనం, చైతన్యరాహిత్యం వల్ల వ్యక్తులు మోస పోతుంటారు. స్నేహం కారణంగా నమ్మామని, ప్రేమవల్ల నమ్మక తప్పలేదని, భర్త కనుక గుడ్డిగా అతని మాటలు విశ్వసించాననే వివరణలు ఇస్తూ ఉంటే అవి మోసపోవడానికి కారణాలు అవుతాయే కాని, నివారణకు పనికి రావు. స్నేహం, ప్రేమ, వివా హం మొదలైన అన్ని బంధాలు నిజాయితీ అనే పునాది మీద ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో, కాంట్రాక్టు భాగస్వాముల్లో సమాచార హక్కు ఈ విధంగా కీలక మైనదని అర్థం చేసుకోవాలి.

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement