ఎక్కడి దొరలు అక్కడే గప్‌చుప్‌ | Madabhushi Sridhar Article On Indian Laws | Sakshi
Sakshi News home page

ఎక్కడి దొరలు అక్కడే గప్‌చుప్‌

Published Fri, May 10 2019 1:00 AM | Last Updated on Fri, May 10 2019 1:00 AM

Madabhushi Sridhar Article On Indian Laws - Sakshi

అయినా మన పిచ్చిగాని, తరగతి గదిలో చెప్పిందే కోర్టు హాల్‌లో జరుగుతుందా? ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ మీద చిన్న ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణ చేసినప్పటి నుంచి సహజ న్యాయసూత్రాలు, దర్యాప్తు విధివిధానాలు అని విమర్శలు వచ్చాయి.  మూడు వ్యవస్థల్లో న్యాయవ్యవస్థలో మాత్రమే ఆరోపణ, విచారణ బహిరంగంగా జరుగుతాయి. కోర్టులలో సాక్ష్యాలను ఇరుపక్షాల సమక్షంలో జనం అందరూ చూస్తుండగా వింటారు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌ వారు ఒకరి సాక్షులను మరొకరు క్రాస్‌ చేస్తారు. నిందితుడికి తెలియకుండా అతని  వ్యతిరేక సాక్షులను విచారించకూడదని, నిందితుడిని అరెస్టు చేయడం వెనుక లక్ష్యాలలో ఇది ప్రధానమైందని మేమంతా పాఠాలు చెబుతూ ఉంటాం. వాదాలు, ప్రతివాదాలు, తీర్పులు కూడా అందరిముందే. లైంగిక వేధింపుల ఆరోపణను విచారించడం ప్రాసి క్యూషన్‌ కాదు. డిపార్ట్‌మెంటల్‌ విచారణ వంటిది. దీనికి కూడా నియమాలు ఉన్నాయి. బహిరంగ విచారణ జరపాలని లేకపోయినా రహస్యంగా విచారణ జరపాలని ఎవరూ చెప్పలేదు. మహిళల మర్యాద కాపాడడం కోసం వారిమీద లైంగిక దాడులు, వేధింపుకేసుల విచారణను అందరిలో కాకుండా అవసరమైన వారి సమక్షంలో మాత్రమే నిర్వహిస్తారు.

ఆమె కోర్టులో చిన్న ఉద్యోగిని. కానీ గురి పెట్టింది సామాన్యుడి మీద కాకుండా దేశంలోకెల్లా అత్యున్నత న్యాయమూర్తి పైన. నిజం వారిద్దరికే తెలియాలి. లైంగిక వేధింపుల నిరోధ చట్టం 2013 ప్రకారం ఫిర్యాదును, అందులో భాగాలను పత్రికల్లో ప్రచురించడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా మీడియా వారికి, మూడో వ్యక్తికి ఇవ్వకూడదని ఉంది. రేప్‌ కేసులో తీర్పు రహస్యం కాదు. సాక్ష్యాల విశ్లేషణ కూడా దాచరు. మహిళల మర్యాదను కాపాడడానికి పేరు చెప్పకుండా మిగతా వివరాలు చర్చించే అవకాశం ఉండాలి. కానీ ఈ మర్యాద నియమం రహస్యాల చీకటికి దారితీస్తున్నది. కొన్ని కేసుల్లో నిందితుడికి కూడా ఫిర్యాదు ప్రతి ఇవ్వరు. ఈ కేసులో కూడా ఫిర్యాదు చేసిన మహిళా విభాగంలోని విచారణ కమిటీకి ఇచ్చి  ఊరుకుంటే బయటపడి ఉండేది కాదేమో.

ఆమె వెబ్‌సైట్లకు 22 పేజీల ప్రమాణ పత్రం రూపంలో ఫిర్యాదును ఇచ్చింది. అది అవాస్తవమనీ, కుట్ర అనీ íసీజేఐ  తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్మాసనంలో కూచుని చెప్పారు. ఇది కూడా అందరిలో జరిగింది. తరువాత అన్నీ రహస్యాలే. విచారణ విధివిధానాలు రహస్యం. ఆమె లాయర్‌ కావాలని కోరినా వీల్లేదన్నారు. నాకు భయంగా ఉంది, నేను మీ విచారణలో పాల్గొనలేను అని వెళ్లిపోయింది. ఆమె పరోక్షంలో ఏకపక్షంగా విచారిస్తామన్నారు. సీజేఐ కమిటీ ముందుకు వెళ్లారు, ఏం చెప్పారో, వారు ఏం రాసుకున్నారో రహస్యం. సాక్ష్యాలు చెప్పేవారు ఆమెతో పాటు పనిచేసే చిన్న ఉద్యోగులే. ఆమె భర్త ఉద్యోగం, మరిది ఉద్యోగం కూడా పీకేయ తగిన విగా మారిపోయాయి.

సాక్షులు కూడా చిన్నఉద్యోగులే కనుక భయపడి సాక్ష్యం ఇచ్చారో, అసలు ఇవ్వలేదో, ఇస్తే ఏం ఇచ్చారో తెలియదు. ఓ రోజు సీజేఐ నిర్దోషి అనీ, ఆరోపణలలో పస లేదని ప్రకటించారు. అంటే ఏమిటో వివరించలేదు. మైసూర్‌ నగరంలో ఒక సంఘటనలో కొందరు కర్ణాటక హైకోర్టు జడ్జీలు ఒక రకంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో ఒక కమిటీ ఎవరికైనా ఏ సమాచారమైనా తెలిస్తే చెప్పండి అని జడ్జీల సహచరుల నుంచి సమాచారం సేకరించి అసలేం జరగలేదని తేల్చుకున్నారనీ, సీజేఐ ఆ సమాచారం తన కోసం తెప్పించుకున్నా రనీ, అది దర్యాప్తు కాదని, కనుక ఆ నివేదిక బయటపెట్టలేమని ఆ కేసులో చెప్పారు. ఏమీ జరగలేదని తేలితే దాచాల్సిన అవసరం లేదు. ఏదైనా జరిగితే తదుపరి చర్యలు తీసుకోవడానికి అదేమిటో తెలియాలి. ఈ కేసులో ఇది ఒక స్పష్టమైన ఆరోపణ. సమాచారం సేకరించడం కాదు, ఇది విచారణ. సీజేఐ కోసం కాదు. సీజేఐ పైన. అయినా ఇవ్వరట.

ఫిర్యాది లేకుండా విచారణ న్యాయం కాదు. మన పరువుపోతుంది అని జస్టిస్‌ ధనంజయ చంద్రచూడ్‌ ఒక లేఖ రాశారన్నారు. వారు రాయలేదన్నారు. మిగతా న్యాయమూర్తులంతా సీజేఐని కలిసి మేం మీతో ఉన్నాం భయపడకండి అన్నారట. లేఖ రాశారా, రాస్తే జవాబిచ్చారా అదీ చెప్పరు.  లా కాలేజిలో చదువుకున్న విద్యార్థులు లాయర్లుగా ఎదిగి  కోర్టులో వాదిస్తారు. వారింకా ఎదిగి న్యాయాధికారులు, ఇంకా ఎదిగి హైకోర్టుకు, మరీ ఎదిగి సుప్రీంకోర్టుకు వెళ్తారు. తరగతి గదికి దూరంగా వెళ్లిపోతారు. దురదృష్టమేమంటే లా కాలే జీకే కాదు, లాకు.. రూల్‌ ఆఫ్‌ లాకు కూడా మరీ దూరమైపోతున్నారేమోనని భయం. విచారణ విధానాలు, సాక్ష్యాలు, సాక్ష్య విచారణ, తీర్పు కలిగి ఉన్న నివేదిక కూడా రహస్యం. ఇంతెందుకు ఫిర్యాదికి కూడా ఇవ్వకూడని రహస్యం నివేదిక ఎందుకట?  అవన్నీ అడక్కండి... ఎక్కడి దొరలు అక్కడే గప్‌చుప్‌.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement