అమరుల త్యాగానికి గుర్తింపేది? | Madabhushi Sridhar Article On Freedom Fighter Bhagat Singh | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగానికి గుర్తింపేది?

Published Fri, Nov 9 2018 12:17 AM | Last Updated on Fri, Nov 9 2018 12:17 AM

Madabhushi Sridhar Article On Freedom Fighter Bhagat Singh - Sakshi

సర్దార్‌ భగత్‌ సింగ్, భారత్‌ గర్వించదగిన సమరయోధుడు.  జాతిపిత గాంధీజీ శాంతి ఉద్యమం ఎంత సమున్నతమైనదో, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వంటి యువకుల ప్రాణ త్యాగం కూడా అంతే కీలకమైంది. నేతాజీ నడిపిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ బ్రిటిష్‌ సైన్యంతో పోరాడింది. వారిని గుర్తిస్తున్నామా? అధికారికంగా మన దేశం వారికి ఏ స్థాయి కల్పిస్తున్నది? భగత్‌సింగ్‌ను షహీద్‌ అని ప్రభుత్వం గుర్తించిందా లేదా, గుర్తించడానికి చట్టపరంగా ఏవైనా ఇబ్బందులు, పరిమితులు, ఆంక్షలు ఉన్నాయా, కనీసం ఆయనను స్వతంత్ర సేనానిగా ప్రభుత్వం అంగీకరిస్తుందా అని సమాచారం అడిగారు అమిత్‌. ఆయన అడిగింది రాష్ట్రపతి భవన్‌ అధికారులను. వారు ఆయన ఆర్టీఐ దరఖాస్తును హోం శాఖకు పంపించారు.

హోం శాఖ దాన్ని అదే వేగంతో పురావస్తుశాఖకు తరలించింది. భగత్‌సింగ్‌ జీవితానికి, పోరాటానికి సంబంధించిన పత్రాలను ఎవరైనా వచ్చి చదువు కోవచ్చునని, భగత్‌ సింగ్‌ గుర్తింపుపై సమాచారం తమదగ్గర ఉన్న దస్తావేజులలో లేదని పురావస్తు శాఖ తెలిపింది. సంతృప్తి చెందని అమిత్‌ కుమార్‌ సమాచార కమిషన్‌ తలుపు తట్టారు.  
ఈ సమాచార అభ్యర్థన నిజానికి ప్రభుత్వం భగత్‌ సింగ్‌ వంటి వీర పుత్రుల గురించి  ఏదైనా విధాన నిర్ణయం తీసుకుందా, తీసుకుంటే ఆ విధానం గురించి సమాచారం ఇస్తుందా అనేవి అసలు ప్రశ్నలు. ఈ వీరులు తమ యవ్వనాన్ని లెక్క చేయకుండా దేశానికి అర్పించారని ప్రధాని నివాళులర్పించారు. ఆ ముగ్గురు వీరులు ఉరికంబానికి వేలాడిన మార్చి 23న దేశ భక్తులంతా నివాళులర్పిస్తారు. వారు అమరులై 81 ఏళ్లు దాటింది. 

ఈ సంవత్సరం మార్చి 25న ఆరోరా అనే న్యాయవాది, భగత్‌ సింగ్‌ విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటని అడిగారు. దానికి హోం మంత్రిత్వ శాఖ ‘జీవించి ఉన్న వారినైనా మరణించిన వారినైనా అమర వీరులుగా అధికారికంగా గుర్తించలేదు’ అంటూ ఈ దరఖాస్తును జాతీయ పురావస్తు విభాగానికి బదిలీ చేశారు. ఇలా అయితే రాబోయే తరాలు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఉద్ధంసింగ్, కర్తార్‌సింగ్‌ వంటి అమరుల త్యాగాలను మరిచిపోతాయని ఆరోరా అన్నారు. భారత ప్రభుత్వం లేదా పంజాబ్, హరియాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమరవీరులకు షహీద్‌ గౌరవాన్ని ఇవ్వాలి. అధికారికంగా ప్రకటన జారీచేయాలని ఆరోరా కోరారు. అమర వీరులు, స్వాతంత్య్ర పోరాట వీరుల జాబితాలను ముందు తరాలవారి కోసం అధికారికంగా విడుదల చేయాలని కోరారు.  ప్రతి ఏడాదీ ఇటువంటి డిమాండ్‌ వస్తూనే ఉంది. హోం శాఖ మాదగ్గర ఏ అధికారిక పత్రం లేదు. కనుక మేం చెప్పేది ఏమీ లేదని జవాబు ఇస్తూనే ఉంది.

పంజాబ్‌ ప్రభుత్వం సరబ్జిత్‌ సింగ్‌ను జాతీయ అమర వీరుడుగా ప్రకటించింది. మరి భగత్‌సింగ్‌ను ఎందుకు వదిలేశారు అని వీరు అడుగుతు న్నారు.  పంజాబ్, హరియాణా హైకోర్టు మార్చి 20 (2018) నాటి తీర్పులో ఈ ముగ్గురు వీరులను షహీద్‌ అని ప్రకటించాలని ఆదేశించడానికి ఏ చట్టమూ లేదని వివరించింది. ఆర్టికల్‌ 18 ప్రకారం బిరుదులు ఇవ్వడానికి వీల్లేదని పంజాబ్‌ ప్రభుత్వం వాదించింది. బీరేంద్ర సంగ్వాన్‌ వర్సెస్‌ యూని యన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచి న్యాయమూర్తులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, సి.హరిశంకర్‌  డిసెంబర్‌ 12, 2017న ఈ విధమైన తీర్పు ఇచ్చిందని పంజాబ్‌ హరియాణా కోర్టు ఉటంకించింది. 2015లో ఆర్టీఐ దరఖాస్తుకు కూడా హోం శాఖ ఇదే సమాచారం ఇచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి, మన్‌మోహన్‌ సింగ్‌ ప్రసంగిస్తూ ‘భగత్‌సింగ్‌ గురించి అధికారిక పత్రాలు ఉన్నా, లేకపోయినా, వారు ఈ దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అవిభాజ్యమైన భాగస్వాములుగా ఉంటారు.

వారి వారసత్వాన్ని జాతి గర్వంగా స్వీకరిస్తుంద’ని అన్నారు. భగత్‌ సింగ్‌ మనవడు అధికారికంగా వారికి షహీద్‌ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విభిన్న రంగాలలో పేరెన్నిక గన్న వారికి భారతరత్న, పద్మ అవార్డులు ఇవ్వడానికి, సైన్యంలోని వారికి వీరచక్ర బిరుదులు ఇవ్వడానికి, క్రీడాకారులకు ఖేల్‌ రత్న బిరుదులు ఇవ్వడానికి అడ్డురాని ఆర్టి కల్‌ 18 భగత్‌ సింగ్‌ను అమరవీరుడని అధికారికంగా పిలవడానికి అడ్డొస్తుందా? భగత్‌ సింగ్‌ వంటి వీరులను, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులను అధికారికంగా గుర్తించడానికి ఏమైనా ఆలో చిస్తున్నారో లేదా అనే విషయమై ఇప్పటి ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు వీలుగా హోంమంత్రి ముందు ఈ దరఖాస్తును ఉంచాలని సీఐసీ ఆదేశించింది.

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement