
పూర్తి మెజారిటీతో గెలిచినా, తక్కువ స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చున్నా, ఒకటి రెండు స్థానాల్లో గెలిచినా, లేకపోయినా తమకు ఓటు వేసినప్రతివాడికీ కృతజ్ఞతగా వారికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఆయా పార్టీలపైన ఉంది. తమ నెత్తినెక్కి అధికారం చెలాయించడానికి అయిదేళ్లపాటు అనుమతి ఇస్తున్న జనులకిచ్చిన మాట నిలబెట్టుకోవడం పదవిలోకి వచ్చిన పార్టీ గురుతరమైన బాధ్యత. ఎక్కువ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీపైన ప్రధానమైన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న పార్టీ తన వాగ్దానం ప్రకారం విధానం రూపొందించి అందుకు తగిన చట్టం, ఉత్తర్వులు జారీ చేస్తే అదేరకమైన వాగ్దానం చేసిన ప్రతిపక్షపార్టీ దాన్ని వ్యతిరేకించడానికి వీల్లేదు. వ్యతిరేకిస్తే అదీ వాగ్దానభంగం కిందే భావించాలి.
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ‘‘సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి, నియమాలకు అనుగుణమైన చర్యలతో సమాచార హక్కును బలపరుస్తాం. సమాచార కమిషనర్లుగా కేవలం అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను, అర్హులైన వారిని ఎంపిక చేస్తా’’మని వాగ్దానం చేసింది. ఒకవేళ కాం గ్రెస్ స్వయంగానో, సంకీర్ణంగానో ప్రభుత్వం ఏర్పా టుచేస్తే ఆర్టీఐని బలోపేతం చేయడం వారి నైతిక బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర ఉండాలంటే ప్రభుత్వవిధానాలను తెలుసుకుని, విమర్శించే ప్రాథమికహక్కు ఆర్టికల్ 19(1)(ఎ)లో ఉంది.
బీజేపీ తన వాగ్దాన పత్రంలో సమాచార హక్కు విషయంలో మౌనంగా ఉంది. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారదర్శకమైన పాలన అందిస్తామని తమ ప్రసంగాల్లో పదే పదే ప్రకటించారు. ఒకవేళ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమాచార హక్కు చట్టాన్ని నీరు కార్చబోదని దీని అర్థం. బీజేపీ పారదర్శక విధానాలు కనుక సమాచార హక్కు చట్టానికి అనుకూలంగా ఉంటే అందుకు అభ్యంతరం చెప్పకుండా సహకరించడం కాంగ్రెస్ బాధ్యత. బీజేపీ కాకుండా కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఆ పార్టీపైన ఆర్టీఐని బలపరుస్తామన్న వాగ్దానాన్ని అమలు చేసే బాధ్యత ఉంటుంది.
2005లో సమాచార హక్కు చట్టం రావడం ఒక గణనీయమైన మార్పు. యశ్వంత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సమాచార హక్కు స్థాయిని పెంచే అపూర్వమైన తీర్పు ఏప్రిల్ 10న ఇచ్చింది. రక్షణ ఆయుధాలు పరికరాల కొనుగోలులో అధికార రహస్యాల రక్షణకన్నా పారదర్శకతా నియమాలకు ప్రాధాన్యం ఉంటుం దని ఈ తీర్పు సారాంశం. బీజేపీ మీద అభిమానంతోనో, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనో ఈ అంశాన్ని పరిశీలించకూడదు.
సోషల్ మీడియాలో తమ అభిమాన నాయకుడికి ప్రతికూలంగా వచ్చే అభిప్రాయాలపై∙బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం, బండబూతులు తిట్టే స్వేచ్ఛ స్వాతంత్య్రం రోజూ వ్యక్తమవుతూనే ఉంది. అది పౌరుల బాధ్యతారాహిత్యం అవుతుంది. మరో పక్షంలో ఉండే నేత ఏం చెప్పినా అవహేళన చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి అతీతంగా వాగ్దానాలను అమలు చేసే బాధ్యతను అన్ని పార్టీలపైనా ఉంచి, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ఆ బాధ్యత వారిపైన విధించేందుకు విధివిధానాలను రూపొందించాలి.
సమాచార హక్కు చట్టం పరిథిలోకి ఆరు ప్రధాన పార్టీలను తెస్తూ కేంద్ర సమాచార కమిషన్ 2013లో చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ పన్నురూపంలో ప్రజలకు చెందవలసిన కొన్నివందల కోట్ల రూపాయలు చెల్లించనవసరం లేదు. కనుక ఆ మేరకు ప్రభుత్వం ద్వారా ప్రజాధనం పొందుతున్నట్టే భావించి జవాబుదారీగా ఉండాలని కమిషన్ నిర్ధారించింది. ఈ తీర్పుపై ఏ కోర్టూ స్టే ఇవ్వలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఎవరూ సవాలు చేయలేదు. మిగిలిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కూడా ఆర్టీఐ పరిధిలోకి తేవాలని కోరుతూ సుప్రీంకోర్టు ముందు ఎ.డి.ఆర్, సుభాష్ చంద్ర అగ్రవాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. ఆర్టీఐ చట్టం పరిధిలోకి రావడం వారికి ఇష్టం లేదు. ఇతర పార్టీలదీ అదేదారి. అధికారంలోఉన్నప్పుడు రాజకీయ పార్టీలను ఆర్టీఐ నుంచి తప్పించడానికి కాంగ్రెస్ ఒక ప్రయత్నం చేసి విరమించుకున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని నీరుగార్చడానికి అనేక ప్రయత్నాలు చేసింది, చేస్తూనే ఉంది. ఆ ధోరణి మారుతుందనే ఆశలు కూడా లేవు. వీరి పారదర్శక వాగ్దానాలు అమలవుతాయా?
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment