ప్రతికాత్మక చిత్రం
పోలీసులు కళ్లు తెరిచి చూస్తే ఇన్ని ప్రాణాలు పోయేవా? పోలీసులు పోలీసులవలె వ్యవహరిం చేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, వారిని స్వతంత్రంగా వృత్తి పనులు నిర్వహించనీయకపోవడం ప్రశ్నార్థకాలు. ఈ మాటలు నేను అంటున్నవి కాదు. న్యాయమూర్తులు ఎస్.కె. కౌల్, కె.ఎం. జోసఫ్ సుప్రీంకోర్టులో ఆవేదనతో చెప్పినవి. జనాన్ని రెచ్చగొట్టి హింసాకాండకు పురిగొల్పిన కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ పైన కనీసం ప్రథమ సమాచార నివేదికలు కూడా నమోదుచేయని పోలీసుల నిష్క్రియనేమనాలి? ఆగ్రహించాలా, విచారించాలా? అని అడిగింది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ఆధ్వర్యం లోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అల్లర్ల పైన అర్ధరాత్రి విచారణ చేస్తూ ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు. విచిత్రమేమంటే గాయపడిన వారిని క్షేమంగా ఆస్పత్రికి చేర్చాలని, హత్యాకాండ జరిపిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయాలని కోరుతూ ఈ రిట్ పిటిషన్ దాఖలుచేశారు. మామూలుగా జరగవలసిన ఈ చర్యలు చేపట్టడానికి హైకోర్టు అర్ధరాత్రి సమావేశమై విచారించి ఆదేశాలు ఇవ్వవలసి వచ్చింది.
అర్ధరాత్రి విచారణ జరిపి రెచ్చగొట్టిన వారిపై కేసులెందుకు పెట్టడం లేదని నిలదీసిన న్యాయమూర్తి మురళీధర్‌ను అదే అర్ధరాత్రి హర్యానా పంజాబ్ హైకోర్టుకు బదిలీ చేశారు. వెంటనే అక్కడ ఉద్యోగంలో చేరాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ కేసును గురువారం తన బెంచ్ విచారిస్తుందని డిల్లీ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీలో జరుగుతున్నమారణకాండ జాగ్రత్తగా పరిశీలించిన వారికి అవి మతకలహాలు కావనీ, సీఏఏ వ్యతిరేకులు, అనుకూలుర మధ్య ఘర్షణ కాదనీ, కావాలని కుట్ర పన్ని పథకం ప్రకారం ఎంపిక చేసుకున్న లక్ష్యాలమీద దాడులు చేయడానికి నిర్ణయించుకుని, సానుకూల వాతావరణం కల్పించుకుని నిర్భయంగా నిర్లజ్జగా సాగిస్తున్నహత్యాకాండ, దోపిడీ దహనకాండ, మతోన్మాదం అని అర్థమవుతుంది.
మొత్తం సీఏఏ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు మూడురోజుల్లో ముగిసిపోవాలని పోలీసులకే అల్టిమేటం ఇచ్చేవాడు ఇంకొక బీజేపీ నాయకుడు, తుపాకులు పట్టుకుని ప్రదర్శన స్థలాలమీద దాడిచేసే వాడింకొకడు, ఈ విధంగా రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి, విశృంఖల దుర్మార్గ విహారం చేస్తున్నారు. అసలైతే ఇటువంటి గోలీమారో, అల్టిమేటం నేరగాళ్లపైన మాత్రమే రాజద్రోహం కేసులు పెట్టాలి. పోలీసులు ఏ కేసులూ పెట్టకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు తప్పించుకు పోతారని సుప్రీంకోర్టు ఆవేదన చెందింది. షాహీన్‌బాగ్ నిరసనకారులను అక్కడినుంచి తొలగించాలని కోరే రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 23న విచారిస్తుందట.
పోలీసులపై విమర్శా వ్యాఖ్యలు చేస్తే వారిలో నైతిక బలం తగ్గిపోతుందని, కనుక దయచేసి వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వం తరఫున వాదించే తుషార్ మెహతా అన్నారు. ‘‘నేను రాజ్యాంగానికి విధేయుడిని. నేను కొన్ని మాటలు చెప్పదలచాను. నేను చెప్పలేకపోతే నేను నా బాధ్యతలను నెరవేర్చిన వాడిని కాబోను’’ అని న్యాయమూర్తి కె.ఎం. జోసెఫ్ కచ్చితంగా చెప్పవలసి వచ్చింది. ‘‘నేను ఢిల్లీ సంఘటనలకు పరిమితమై మాట్లాడుతున్నాను. నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడడం లేదు. పోలీసుల వైఫల్యం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు స్వతంత్రంగా వృత్తిబాధ్యతలను వ్యవహరించలేదు’’ అని విమర్శించారు. ఢిల్లీ హైకోర్టులో ముగ్గురు బీజేపీ నాయకులు చేసిన రెచ్చగొట్టే మాటల వీడియోను ప్రదర్శించారు.
ఐపీసీ 153ఎ కింద ఇవి నేరాలుగా మీకు కనిపించలేదా, వీటిపైన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయలేదా అని అడిగారు. పోలీసు అధికారులు తాము ఆ వీడియోలు చూడలేదని హోం వర్క్ చేయని బడిపిల్లల వలె జవాబిచ్చారు. తగిన సమయంలో ఎఫ్‌ఐ ఆర్ దాఖలు చేస్తామన్నారు. ‘ఇంకా ఎంతమంది చనిపోయిన తరువాత ఆ తగిన సమయం వస్తుంది?’ అని అడిగారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సామాన్యుల వలె ప్రశ్నించారు. సంతోషం. దాంతోనే సంతోషించాలా? పాలక పార్టీవారే రెచ్చగొడతారు. పోలీసులు మౌనం పాటిస్తారు. పోలీసు అధికారులే హతులౌతారు. సామాన్యుడి ప్రాణానికి భద్రత కరువైంది.
వ్యాసకర్త: మాడభూషి శ్రీదర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్,
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment