ప్రభుత్వం సామాన్య పౌరుడి మీద కోర్టులో దావాలు వేయడం మామూలై పోయింది. కింది కోర్టు సామాన్యుడికి అనుకూలంగా తీర్పు ఇస్తే అక్కడితో తగాదా ముగియదు. ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా లాక్కుపోతుంది. మీకు ఎప్పుడైనా సుప్రీంకోర్టు సామాన్యుడిమీద పోరాడినట్టు తెలుసా? అదీ పన్నెండేళ్ల పాటు పోరాడిందంటే ఎంత పట్టుదల, ఎంత విచిత్రం... సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులంతా సత్ప్రవర్తన కలిగి ఉండాలని, అందుకని తమ ఆస్తి పాస్తుల వివరాలు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వా లని 1997లో వారే తీర్మానించుకున్నారు.
ఆస్తుల జాబితా ఇచ్చితీరాలని చట్టాలు లేవు. సుభాష్ చంద్ర అగర్వాల్ అనే పౌరుడు 1. ఆ తీర్మానం ప్రతి ఇస్తారా, 2. ఆ తీర్మానం ప్రకారం జడ్జీలు ఆస్తుల జాబితా ఇచ్చారా, 3. హైకోర్టు న్యాయమూర్తులలో ఎందరు ఇచ్చారు అని అడిగారు. ఆ ఆస్తుల చిట్టాల ప్రతులు అడగలేదు. చిట్టాలు చదివారా అని అడగలేదు. చిట్టాలు పరిశీలించి చర్యలు తీసుకున్నారా అని కూడా అడగలేదు. జడ్జీలతో వ్యవహారం కదా అని ఒళ్లు దగ్గరబెట్టుకునే ఆర్టీఐ వేశాడాయన. సుప్రీంకోర్టు కార్యాలయంలో ఉద్యోగులు గాభరా పడిపోయారు. ఈ ఆర్టీఐకి ఏం జవాబిస్తాం? అని తలపట్టుకున్నారు. తీర్మానం కాపీ ఇచ్చారు. ఆస్తుల చిట్టాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు జవాబు తమ దగ్గర లేదన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చారో లేదో హైకోర్టులనే అడుక్కోమన్నారు.
సీఐసీకి వచ్చారాయన. వజాహత్ హబీబుల్లా, ఎ.ఎన్. తివారీ, ఎం.ఎం.అన్సారీ అనే పెద్ద కమిషనర్లు ముగ్గురు కూచుని సుప్రీంకోర్టు ఈ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. నిజానికి ఈ ఆదేశం కమిషనర్ కూడా ఇవ్వవచ్చు. కానీ ఎందుకైనా మంచిది, సుప్రీంకోర్టుతో వ్యవహారం అని జాగ్రత్త పడ్డారు. ఇక ఆ మామూలు మనిషి మీద సుప్రీంకోర్టు పోరాటం మొదలు పెట్టింది. ఈ సమాచారం ఇస్తే తమ స్వతంత్రతకు భంగం ఏర్పడుతుందని, భూమి బద్దలవుతుందని, రాజ్యాంగం తల్లకిందులవుతుందని ఇవ్వకూడనిదని ఢిల్లీ హైకోర్టుకు మొర బెట్టుకుంది.
న్యాయమూర్తి రవీంద్రభట్ సుప్రీంకోర్టు వారి వాదన విని, ఇది ఇవ్వవలసిన సమాచారమే ఇవ్వండి అని ఆదేశించింది. అప్పటికైనా సమాచారం ఇస్తే బాగుండేది. కానీ సుప్రీంకోర్టు వారు డిల్లీ హైకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఆశ్రయించి రవీంద్రభట్ తీర్పును కొట్టివేయమని, ఈ సమాచారం ఇవ్వకూడదని తీర్పుచెప్పాలని కోరారు. ఆ ధర్మాసనం కూడా చాలా జాగ్రత్తగా విచారణ జరిపింది. వారికీ ఈ సమాచారం ఇవ్వవలసిందేననిపించింది. సుప్రీంకోర్టు గారూ సమాచారం ఇవ్వండి అని ఆదేశించింది. ఇప్పటి కైనా ఇస్తుందేమో అనుకున్నారు. సుప్రీంకోర్టువారు పట్టుదలకు పోయి సుప్రీంకోర్టులో అప్పీలు వేసుకున్నారు. స్టే ఇచ్చుకున్నారు. ఎప్పుడెప్పుడు తీర్పు ఇస్తారా అని కొన్నాళ్లు ఎదురు చూసి ఇక మరిచిపోయారు.
పాపం రంజన్ గొగోయ్ తాను ప్రధాన న్యాయమూర్తిగా ఉండగానే ఈ తగాదా తెగదెంపులు చేయాలనుకున్నారు. దాదాపు పదో సంవత్సరం ముగుస్తుండగా అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి రెండురోజులు జోరుగా వాద ప్రతివాదనలు విన్నారు. తరువాత 13 నవంబర్ నాడు విశేషమైన తీర్పు ఇచ్చారు. న్యాయవ్యవస్థ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాలని అంగీకరించడం చరిత్రాత్మకమైన తీర్పు అని దాదాపు అందరూ అనుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద పబ్లిక్ అథారిటీ అని సుప్రీంకోర్టు అంగీకరించిందని 90 శాతం మీడియా సంస్థలు తొలి పేజీ వార్తలు, తాటికాయంత శీర్షికలు రచించాయి. చాలామంది ఇప్పటినుంచి సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ ఆర్టీఐ కిందికి వచ్చాయని అనుకున్నారు. అద్భుతం అని ప్రశంసించారు. కానీ ఇందులో ఏ
అద్భుతమూ లేదు.
ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ప్రత్యే కంగా పబ్లిక్ అథారిటీ కాదని చెప్పింది సుప్రీం కోర్టు. అయితే న్యాయవ్యవస్థలో సీజే కార్యాలయం కూడా ఒక భాగమే కనుక ఆర్టీఐ కింద జవాబుదారీ అవుతుందని వివరించింది. సీజే కూడా విడిగా ఆర్టీఐ కింద జవాబు ఇవ్వాలన్న ఢిల్లీ హైకోర్టుతో ఏకీభవించలేదు. 2005 నుంచి న్యాయవ్యవస్థ ఆర్టీఐ కింద అడిగిన వాటిలో కొన్నింటికి సమాచారం ఇస్తూనే ఉంది. చాలా వాటికి ఇవ్వను పొమ్మంటున్నది. పోనీ చివరికి సుభాష్ గారు అడిగిన సమాచారం ఇచ్చిందా అంటే లేదు. మళ్లీ సుప్రీంకోర్టు లోని సీసీఐఓకి పంపారు.
ఆయన జాగ్రత్తగా తన మేధోశక్తికి పదునుపెట్టి 250 పేజీల సుప్రీంకోర్టు తీర్పును చదివి, అర్థం చేసుకుని అందులో వ్యక్తిగత సమాచారం ఉంటే తీసేసి, మూడో వ్యక్తి సమాచారం ఉండి ఉంటే ఆ మూడో వ్యక్తిని అడిగి, ఇంకా ఏదైనా రాజ్యాంగ వ్యతిరేక దుర్మార్గ అన్వయం ఉందేమో చూసి, అప్పుడు ఏమైనా ఇచ్చే వీలుంటే అది ఇవ్వాలని తీర్పు చెప్పారు. పుష్కరకాలం తర్వాత ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో న్యాయవ్యవస్థలో
పారదర్శకత వెల్లివిరుస్తుందని అందరూ అనుకున్నారు.
అసలు అడిగిన ప్రశ్నలేమిటి? వాటికి జవాబులు ఇవ్వకపోవడమేమిటి? ఇందులో న్యాయ మేధావులంతా తలలు బద్దలు కొట్టుకునేంత గొప్ప సంవిధాన సంక్లిష్ఠతలు, న్యాయస్వతంత్ర సార్వభౌమత్వానికి వచ్చిన ముప్పేమిటి అని ఆలోచించే వాడే లేడు. మీ తీర్మానాన్ని మీరే అమలు చేయబోరా? అన్నది సామాన్యుడి ప్రశ్న. చేయం అనేదే జవాబయితే అది ఇవ్వడానికి భయమెందుకు? ఎవరూ ఆస్తిపాస్తుల చిట్టా ఇవ్వలేదు అనండి నూటికి నూరు మార్కులు మీకే. దానికింత రాద్ధాంతం, దాని వెనుక బోలెడంత సిధ్ధాంతం. ఓ సామాన్యుడి ఆర్టీఐ అంటే సుప్రీంకోర్టుకు ఇంత ఉలికిపాటా?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment