వాక్ స్వాతంత్య్రం విలువ చాలా మందికి అర్థం కాదు. అందరూ ఏదో లాభంకోసమే విమర్శిస్తున్నారనుకునే సోమరుల మెజారిటీ నానాటికీ పెరుగుతున్నది. దారుణంగా ఒక అమాయకురాలిని తమ పోలీసుస్టేషన్‌లో రేప్ చేసిన పోలీసుల నేరం రుజువు కాలేదని 1980లలో సుప్రీంకోర్టు మధురా కేస్ అని పిలువబడే కేసులో విచిత్రమైన తీర్పు చెప్పింది. ప్రేమిస్తానని చెప్పి ఒక బాలికను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపి, ఆ బాలిక మీద పోలీసులు అత్యాచారం చేసిన కేసు అది. వారికి కింది కోర్టులో శిక్ష పడింది. కాని ఆ శిక్ష తప్పు అని సుప్రీంకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అత్యాచారం చేస్తుంటే ఎందుకు అరవలేదు? మౌనంగా ఉందంటే ఆమె కూడా అంగీకరించినట్టే కదా అని వ్యాఖ్యానిస్తూ ఇచ్చిన ఆ తీర్పు ఎంత అన్యాయమైందో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ తన మిత్రులతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దుర్మార్గపు రేప్ చట్టాల పట్ల దారుణమైన అన్వయం చేసే తీర్పుల పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబికింది. చివరకు ఆ ఉద్యమం రేప్ చట్టాన్ని చాలావరకు మార్చేసింది. ప్రొఫెసర్ మనకేం పోయిందనుకున్నా, కోర్టు ధిక్కారం అవుతుందని భయపడినా, మరే కారణంతోనో భజన చేసినా ఈ మార్పులు జరిగేవి కావు. న్యాయానికి విరుద్ధమైన అన్వయం చేయడానికి సిగ్గుపడే పరిస్థితి ఆ విమర్శ వల్ల వచ్చింది. వాక్ స్వాతంత్య్రాన్ని నిర్భయంగా వాడుకుంటేనే ఉన్నతాధికారంలో ఉన్నవారు అప్పుడప్పుడైనా సిగ్గుపడవలసి వస్తుంది.
మనం కరోనాతో భయపడిపోతున్నాం. కుటుంబ సంబంధాలు, స్నేహాలను కరోనా నిర్దయగా తెంచి వేస్తున్నది. ఒకరికొకరం దూరమవుతున్నాం. కరోనా పేదలకు నరకం, వలసకూలీలకు మరణం, నియంతలకు స్వర్ణయుగం. మరి ధర్మం, న్యాయం సంగతేమిటి? ధర్మం అంటే సంవిధాన పాలనా ధర్మం. న్యాయం అంటే నిష్పక్షపాత, నిర్భయ, నిర్ద్వంద్వ, స్వతంత్ర న్యాయ నిర్ణయం. దానికి నిజాయితీ ప్రాణం వంటిది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక మంచి న్యాయమైన తీర్పు ఇచ్చింది. లాక్‌డౌన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మైళ్లదూరాలు నడుస్తూ భరతమాత హైవేలకు నెత్తుటి పాదాలు అద్దిన వలస కార్మికులకు వెంటనే ఉచిత రవాణా, ఉచిత భోజన, ఉచిత ఆవాస సౌకర్యాలు కలిగించాలని సముచిత నిర్ణయం తీసుకుంది. చాలా ఆలస్యమైనప్పటికీ అవసరమైన నిర్ణయం. అంతకుముందు అనేక సందర్భాలలో పిల్‌లను నిరాకరిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు, ప్రభుత్వం పక్షాన ప్రమాణం చేసి మరీ చెప్పే అవాస్తవాలను నమ్మి ఆదేశాలు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం మానవీయంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని, కరోనా వైరస్ వంటి క్లిష్టసమయంలో మానవత్వాన్ని మించిన న్యాయం లేదని, చాలా హైకోర్టులు ఎంతో హుందాగా వలస కార్మికుల పట్ల దయచూపాలని అనుభవం ఉన్న న్యాయవాదులు ఆవేదన చెందారు. చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకుని, వాక్యాలు నిర్మించి సుదృఢమైన విమర్శ రంగరించి లేఖ రాశారు. వారికి జోహార్లు. న్యాయవాదులకు పదవులుంటాయి, పదవీకాలాలు ఉంటాయి, విరమణలు ఉంటాయి. ఒత్తిడులు భయాలు కూడా ఉంటాయి. ఈ మధ్య భయాలు పెరిగాయి. న్యాయవాదులు స్వతంత్ర వృత్తిగల వారు. స్వతంత్ర ప్రవృత్తి గలవారు కూడా అయితే చాలా బాగుంటుంది. కాని వారికి కూడా చాలా కష్టాలుంటాయి మరి. అయినా ఎవరికీ భయపడకుండా వారు రాసిన లేఖ కదిలించింది.
అంతకు ముందు అరడజను హైకోర్టు న్యాయస్థానాలు రాష్ట్రాలను మందలించాయి. వలస కూలీల గురించి పట్టించుకొమ్మని ఆదేశించాయి. కాని ప్రభుత్వాలు ఏం చేశాయో తెలుసా. హైకోర్టులను తప్పబట్టాయి. ఏమనుకుంటున్నారు మీరు సమాంతర ప్రభుత్వం నడుపుతారా అని కోపించాయి. దానికి సుప్రీంకోర్టు జవాబిస్తూ హైకోర్టులు సక్రమంగా, రాజ్యాంగ ధర్మబద్ధంగానే వ్యవహరించాయని మద్దతు పలకడం శుభ పరిణామం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయం ఒకటి మనం తప్పనిసరిగా గుర్తించాలి. సెక్షన్ 51 డిసాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద సంక్షోభ కాలంలో ప్రభుత్వ ఆదేశాలు (ఇక్కడ లాక్‌డౌన్ ఆంక్షలు) ఉల్లంఘించినందుకు ఏడాదిపాటు జైలుకు పంపే అధికారం ఉంది. ఆ సెక్షన్ కింద వలస కార్మికులమీద ప్రాసిక్యూషన్ మోపాయి. తిండి లేదు, పని లేదు, ఉన్నచోటి నుంచి తరిమేస్తున్నారు, రైళ్లు, బస్సులు లేవు. నడిచిపోదామంటే కేసులు, రాష్ట్రం దాటితే పక్క రాష్ట్రం వారు రానివ్వరు. కేసులు పెట్టే వారు, కొట్టే వారు, గుంజీలు తీయించేవారు, మోకాళ్లమీద కూచోబెట్టేవారు, జైల్లోకి నెట్టేవారు. ఇది ప్రజాస్వామ్యమా? వీరు పాలకులా? ఇవన్నీ మానేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా ఆలస్యం తరువాత కాలీకాలని వాత, చాలీచాలని న్యాయం అనే విమర్శలకూ అవకాశం ఉన్నా రెండు మంచి ఆదేశాలిచ్చింది అగ్రన్యాయస్థానం. ధర్మం కోసం కంకణం కట్టుకున్న జాతీయ దేశోద్ధారకులనుకునే పాలకులు వలసకూలీలపై ప్రాసిక్యూషన్ మోపినపుడు వారి నిజస్వరూపం తెలుసుకోకపోతే అంతకన్నా గుడ్డితనం మరొకటి ఉండదు. అటువంటి పౌరులకు వెన్నెముక ఉందో లేదో ఎక్స్‌రే తీయాలి. ఎవ్వరినీ ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ ‘‘మహాఘనత వహించిన డీజీపీలూ మీ పోలీసులకు చెప్పండి. జనం పట్ల అమానుషంగా ప్రవర్తించకండి’’ అని చెప్పింది. పాలకులూ, పోలీసులూ వింటున్నారా?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment