
ఆర్టీఐ వేధించేందుకు కాదు
విచారణ ప్రారంభించిన అధికారిపై పగ తీర్చుకునే విధంగా ప్రశ్నలు వేయడం ఆర్టీఐ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది.
సమాచార హక్కు అందరి కోసం వినియోగించవలసిన హక్కు. అధికారులను జవా బుదారులను చేయడానికి వాడవలసిన సాధనం. అవినీ తిపై పోరుకు కావలసిన అస్త్రం. పగతీర్చుకోవడానికి కాదు. ప్రజాప్రయోజనాలు ప్రజాశ్రేయస్సు ప్రధాన లక్ష్యం గా సమాచారం అడగాలి. చెత్త ప్రశ్నలడిగితే పరువు పోయి, నిజమైన సమాచారం అడిగే వారిని నిరోధిం చినట్టవుతుంది.
ఒక బస్ డిపో మేనేజర్‌కి నిక్కచ్చి అధికారి అని మంచి పేరు ఉంది. తప్పుచేసిన ఆరోపణపై విచారణ ఎదుర్కొంటున్న ఒక ఉద్యోగి అటువంటి మంచి అధికారిపైన నానా రకాల వృథా ప్రశ్నలు సంధించడం సమంజసమా?
ఉద్యోగికి విధులు నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అవినీతికి పాల్పడటం శిక్షార్హమైన నేరం అవుతుంది. హక్కులు, బాధ్యతలు రెండూ ఉంటాయి.
దీనికి మరో కోణం ఉంది. ఒకవేళ ఉద్యోగి పైనతప్పుడు ఆరోపణ చేస్తే తన తప్పులేదని రుజువు చేసుకోవడానికి కావలసిన పత్రాలు అడగవచ్చా? నిస్సందేహంగా అడగవచ్చు. విచారణ దశలో కూడా ఆ ఉద్యోగికి అనేక హక్కులుంటాయి. తనను రక్షించుకోవ డానికి కావలసిన పత్రాలు, అవకాశం కూడా ఇవ్వాలి. విచారణ ముగిసిన తరవాత నివేదికను, తీసుకున్న చర్య లను కూడా తెలియచేయాలి.
కాని విచారణకు సంబంధం లేని సమాచార అభ్య ర్థనలు పంపడం దుర్వినియోగం అవుతుంది. దానిని సహించడానికి వీల్లేదు. ఈ ఉద్యోగి వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు, వీరి దుర్మార్గానికి, అవినీతికి దెబ్బ తిన్న వ్యక్తులు ఫిర్యాదు చేస్తే విచారణ చేయడం పైవారి బాధ్యత. విచారణ ప్రారంభించిన అధికారిపై పగ తీర్చు కునే విధంగా ప్రశ్నలువేయడం దుర్వినియోగమే. తన పైన ఫిర్యాదు చేసిన అధికారులను, సహ ఉద్యోగులను వేధించడానికి అసమంజస ప్రశ్నలు వేసే హక్కు లేదు. క్రమశిక్షణ లేని ఉద్యోగులు, లంచగొండుల వల్లనే మన పాలన భ్రష్టుపట్టిపోయింది. పనిచేయకుండా తమ అధి కారాన్ని జనాన్ని పీడించడానికి వాడే స్వార్థపరులను నిలదీయడం కోసమే ఈ సమాచార హక్కు వచ్చింది. కాబట్టి ఈ హక్కును దుర్వినియోగం చేయడం దుర్మార్గం.
ఫలానా డిపోమేనేజరుగారు 1985, 1988, 1991, 2003, 2007 సంవత్సరాలలో ఎంతమంది ఉద్యోగు లను తొలగించారు? ఎంత మందిని నియమించారు? వంటి అనవసర ప్రశ్నలు వేస్త్తున్నాడు. అయినా చాలా సమాచారం ఇచ్చారు. సస్పెన్షన్ల సమాచారం కూడా ఇచ్చారు. కానీ ఎవరెవరిని ఏఏ కారణాలతో సస్పెండ్ చేశారో తాను ఇచ్చిన ఒక పట్టిక ప్రకారం ఇవ్వాలని కమి షన్‌కు అప్పీలు చేసుకున్నాడు. తమ దగ్గర ఉన్న సమా చారం ఇచ్చాం. విశ్లేషణ మీరే చేసుకోండి అని ప్రజా సమాచార అధికారి జవాబిచ్చాడు. అసలు విషయం విచారణలో బయటకు వచ్చింది. ఈ విధంగా పనికిరాని సమాచారం అడుగుతున్న ఉద్యోగి చెడు ప్రవర్తన కార ణంగా సస్పెండయ్యాడు. అతనిపై వచ్చిన ఫిర్యాదు కాపీ, నోటీసు, చార్జిషీటు ఇతర పత్రాలు ఇవేవీ అడగ లేదు. అవన్నీ ఇదివరకే ఇచ్చారు. తన హక్కుల రక్షణకు ఏవైనా అడుగుతున్నాడా అంటే అదీ లేదు. ఇతను అడిగే ప్రశ్నలన్నీ అనుమతించి, సమాచారం ఇవ్వవచ్చు అని తీర్పు ఇస్తే తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవడా నికి అధికారులు ఎవరైనా ముందుకు వస్తారా? అన్న సందేహం కలుగుతుంది. ఉన్నతాధికారులను నిర్వీర్యుల ను చేసే ఇటువంటి దుర్వినియోగాన్ని అరికట్టవలసిందే.
చర్యలు ఉంటాయన్న నమ్మకం ఉంటేనే ఫిర్యా దులు వస్తాయి. చర్యలు తీసుకుంటే సమాచార హక్కు చట్టం కింద వేధిస్తారనే భయం కల్పించడమే ఈ దుర్మా ర్గపు ప్రశ్నావళి ఉద్దేశం. విచారణలను నిరోధించే సమా చారాన్ని ఇవ్వకూడదని ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1) హెచ్ నియమం విధించింది. విచారణలో ఉన్న అంశాలను వెల్లడిస్తే ఒక్కోసారి విచారణ సాగకపోవచ్చు. నిజమే కానీ, ఫిర్యాదు ప్రతి అడిగితే విషయం విచారణ జరు గుతున్నది కనుక ఇవ్వబోము అనడానికి వీల్లేదు. ఎందు కంటే విచారణలో ఉన్న పత్రాన్ని ఇవ్వకూడదనే నిషేధం లేదు. విచారణ దెబ్బతినే విధమైన సమాచారం మాత్రమే ఇవ్వకూడదని అర్థం.
ఇక మరో అంశం ప్రజాప్రయోజనం ఎక్కడుందో చూడాలి. ఈ సమాచారం చెప్పడం వల్ల చెడు ప్రవర్తనల మీద విచారణే జరగకుండా పోయే ప్రమాదం ఉంది. చెప్పకపోవడం వల్ల ఏ నష్టమూ లేదు. అభ్యర్థి ప్రశ్నలు వేధించేవి కావడం వల్ల, తనపైన ఉన్న ఆరోపణలతో సంబంధం లేని సమాచారం అడుగుతున్నందున, ఇది వరకే ఇవ్వగలిగినంత సమాచారం ఇచ్చినందున, ఇవ్వని సమాచారం అథారిటీ వద్ద లేనందున, డేటాను విశ్లేషించి ఇవ్వాలని కోరడం, సమాచారం కిందికి రాదు. కనుక, సెక్షన్ 8(1)(జె) మినహాయింపులో పేర్కొన్నట్టు ప్రజాప్రయోజనం లేదు. కనుక, సెక్షన్ 8(2)లో వివరిం చినట్టు, ఇవ్వకపోవడంలోనే ప్రజాప్రయోజనం ఉంది. కనుక ఇతని అప్పీలు తిరస్కరించాల్సి వచ్చింది.
(ముకేశ శర్మ వర్సెస్ డీటీసీ కేసు నంబర్ సీఐసీ, ఎస్‌ఏ, ఎ, 2014, 615,616లో నేను 14 జనవరి 2014లో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
విశ్లేషణ: మాడభూషి శ్రీధర్, (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com