ప్రజాప్రయోజనాలు రహస్యమా?  | Guest Column By Madabhushi Sridhar Over Election Commission | Sakshi
Sakshi News home page

ప్రజాప్రయోజనాలు రహస్యమా? 

Published Fri, Jun 7 2019 3:55 AM | Last Updated on Fri, Jun 7 2019 3:55 AM

Guest Column By Madabhushi Sridhar Over Election Commission - Sakshi

విశ్లేషణ

ఎన్నికల ప్రచారం ఒక రణ  రంగం వంటిదే. అందులో అధికారంలో ఉన్న పార్టీకి పైచేయి ఉంటుంది. పాలక పార్టీ చేతిలో చతురంగబలాలు, ప్రజల డబ్బు, విపరీతమైన అధికారం ఉంటాయి. వాటిని ప్రచారానికి ఉపయోగించుకోవాలనే తపన ఉంటుంది. ప్రతిపక్షాలకు ఆ లాభం ఉండదు. ఈ అసమానత తొలగించడానికే అధికారపక్ష అభ్యర్థులపై పరిమితులు విధిస్తారు. ముఖ్యంగా ప్రధానమంత్రి, సీఎంలు, మంత్రులు, ప్రచారానికి దిగినపుడు అధికారిక హంగులను వాడుకోకూడదు. ప్రచార నీతి నియమావళిలో ముఖ్యమైన పరిమితులు ఇవే. అబద్ధాలు, తప్పుడు మాటలు చెప్పి, బూటకాలు ప్రసారంచేసి నాటకాలు వేస్తూ మతాన్ని, కులాన్ని వాడుకోవడం తప్పు. సైన్య వ్యవహారాలను కూడా పార్టీ ప్రయోజనాలకు వాడుకునే సంఘటనలు జరగడంతో మరికొన్ని నియమాలను ఎన్నికల కమిషన్‌ రూపొందించింది. పార్టీల నాయకులను మధ్య మధ్య హెచ్చరించడం ద్వారా వారి ప్రచార దుర్మార్గాలకు పగ్గాలు వేయాలి. కమిషనర్లు స్వతంత్రంగా ధైర్యంగా పనిచేయాలి.  

నిజానికి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఎన్నికలను నిర్వహించడం మాటలు కాదు. అందుకే ఎన్నికల కమిషన్‌కు ఆర్టికల్‌ 324 కింద విస్తృతమైన అధికారాలు ఇచ్చింది మన రాజ్యాంగం. ఎన్నికల సమయంలో ప్రభువులంటే ఎన్నికల కమిషనర్లే. వారు అధికారులను బదిలీ చేయవచ్చు. కొత్తవారిని నియమించవచ్చు. ఆశ్చర్యమేమంటే మతం, కులం పేర్లతో ఓట్లు అడుగుతూ ఉన్నా ప్రారంభోత్సవాలు, విజయోత్సవాలు చేస్తున్నా  స్వయంగా చర్యలు తీసుకోవలసిన ఎన్నికల కమిషన్‌ మౌనంగా ఉండిపోయింది. ఎన్ని ఫిర్యాదులు చేసినా కదలలేదు. స్వయంగా ప్రధానిమీద, అధికార బీజేపీ అధ్యక్షుడిపైన కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు అనేకానేక ఫిర్యా దులు చేశాయి. ప్రసంగాల్లో రెచ్చగొట్టే భాగాలను ఎత్తి చూపించాయి. కాని ఎన్నికల కమిషన్‌ ప్రతిస్పందనే లేదు.

న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ కోర్టు తలుపులు తట్టి ఎన్నికల కమిషన్‌ను నిద్రలేపండి మహాప్రభో అని వేడుకున్నది. సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా కొన్ని ఫిర్యాదులు వారి పరిశీలనకు నోచుకోకుండా మిగిలిపోయాయి. సుప్రీంకోర్టు చివరకు ఫలానా తేదీలోగా చర్యలు తీసుకోండి అని ఆదేశించవలసి వచ్చింది. అప్పుడు ఎన్నికల కమిషనర్లు సమావేశమై ప్రధాని ప్రసంగాలలో ఏ పొరబాటూ లేదని క్లీన్‌ సర్టిఫికెట్లు జారీ చేయడం మొదలు పెట్టింది. అంతా ఆశ్చర్యపోయారు. తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, కనీసం హెచ్చరికలు కూడా జారీ చేయకపోవడం ఏమిటని విమర్శలు మొదలయ్యాయి. ముగ్గురు కమిషనర్లలో ఒకరు అశోక్‌ లావాసా మిగతా ఇద్దరి నిర్ణయాలతో ఏకీభవించలేదని, తప్పులు జరిగా యని ఆయన ఎత్తి చూపారని తెలిసింది. అశోక్‌ లావాసా తన అసమ్మతి గురించి లేఖలు రాశారు.  

తన అసమ్మతి అంశాలను రికార్డు చేయాలని, కమిషన్‌ తుది తీర్పులో కూడా తన అసమ్మతి కారణాలను వివరించాలని కోరుతూ అశోక్‌ లావాసా మరో ఉత్తరం రాశారు. చివరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదుల విచారణలో తాను పాల్గొనడం వృథా అని భావిస్తున్నానని, కనుక తాను ఆ సమావేశాలకు రాలేనని ఇంకో లేఖ రాశారు. ఈ విషయం పత్రికా వర్గాలలో సంచలన వార్త కావడంతో ఎన్నికల కమిషన్‌ చర్చించాలని నిర్ణయించింది. మే 21న సుదీర్ఘంగా సమావేశం జరిపింది. ఎవరైనా అసమ్మతి తెలియజేస్తే వారి అభిప్రాయాన్ని రికార్డులో భద్రంగా ఉంచుతామని, కాని దాన్ని తమ తుది ఉత్తర్వులలో భాగంగా చేర్చలేమని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు. అసమ్మతిని కనీసం రికార్డులో ఉంచడానికి ఎన్నికల కమిషన్‌ నిర్ణయించడం ఒక్కటే ఈ వ్యవహారంలో సమంజసంగా కనిపిస్తున్నది. ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులు, వాటి విచారణ, కమిషనర్ల అభిప్రాయాలు దాచడానికి కారణాలు ఏమిటి? అవి అత్యంత రహస్యాలు ఎందుకవుతాయి. అవేమైనా రక్షణ వ్యూహాలా, అధికారికంగా దాచవలసిన అంశాలా, వాణిజ్య రహస్యాలా?
 
చట్టప్రకారం వ్యవహరిస్తామని కమిషన్‌ పేర్కొ నడం ముదావహం. సమాచార హక్కు చట్టం ఒకటుందని వారు గుర్తించారో లేదో తెలియదు. ఈ చట్టంలో ‘అభిప్రాయాల’ను ‘సమాచారం’గా నిర్వచించారు. రికార్డు (దస్తావేజు)లో ఉన్న అంశం, సెక్షన్‌ 8 మినహాయింపులకు లోబడి వెల్లడించాలి. అసమ్మతి వివరాల వెల్లడిలో ఉన్న ఇబ్బందులు, దాచడంలో ప్రజాప్రయోజనం ఏమిటో చూపాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వసంస్థపై ఉంటుంది. సెక్షన్‌ 4 కింద ఎన్నికల కమిషన్‌ స్వయంగా వెల్లడించాల్సిన అంశాలలో అసమ్మతి కూడా ఒకటి. అర్థ న్యాయ (క్వాసి జ్యుడీషియల్‌) నిర్ణయం కాదని కమిషన్‌ వాదిస్తున్నది. నియమ ఉల్లంఘన ఫిర్యాదులపై విచారణ పరిపాలనా చర్య అంటున్నది. పరిపాలనా చర్యలైనా వాటి ప్రభావం పడే వర్గాలకు వెల్లడించాలని సెక్షన్‌ 4(1)(డి) వివరిస్తున్నది. దాచడానికి వీల్లేని ప్రజాప్రయోజన అంశాలను కాపాడటం ఎవరికోసం?



మాఢభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement