
విదేశీ యాత్రలకు వెళ్లండి. ఒప్పందాలపైన సంతకాలు చేయండి, మీతోపాటు అనేక మంది అధికారులను కూడా తీసుకు వెళ్లండి. వాణిజ్య ఒప్పందాలకోసం అవసరమైతే మన దేశంలో పారిశ్రామికవేత్తలను, పెద్ద వాణిజ్యసంస్థల ప్రతినిధులను కూడా తీసుకు వెళ్లండి. కావాలంటే ప్రత్యేక విమానాల్లో వెళ్లండి. పాలనకు అనుకూలమైన ఏ విధానాన్నయినా అనుసరించి విదేశీయాత్రలుచేసే అధికారం, అవసరం, అవకాశం ప్రధాన మంత్రికి, ఇతర మంత్రులకు ఉంది. అయితే మీ వెంట ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, వెళ్లి ఏం సాధించారో చెప్పండి. పరిపాలనలో పారదర్శకత అంటే మీరు చేసినవి చెప్పడం. అంతే. ఇందులో దాపరికం అవసరమైతే ఏ మేరకు అవసరమో కూడా చెప్పవలసి ఉంటుంది.పాలకులు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తారు. వారికి ఆ అధికారాన్ని ప్రజలే ఇస్తారు.
ప్రజలపైన ప్రజల సొమ్ము పైన పెత్తనం ఇస్తున్నారు కనుకనే తమకు ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు తాము చేసిన పనులేమిటో చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య సూత్రం. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టిన మొదటి రెండేళ్లలో అనేక పర్యటనలు చేపట్టారు. ఈ ప్రయాణాలకు మొత్తం రూ. 2,021లు ఖర్చయిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సాధికారికంగా వెల్లడించారు. చాలా సంతోషం. ప్రధాని సందర్శించిన పది ప్రముఖ దేశాల నుంచి మనకు బోలెడంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని కూడా మంత్రి గారు వివరించారు.
2017లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 43,478 మిలియన్ల డాలర్లమేరకు వచ్చాయి. 2014లో 30,930 మిలియన్ డాలర్లు వచ్చాయి. 2009 నుంచి 2014 వరకు ప్రధాని మన్‌మోహన్ సింగ్ విదేశీ యానాలకు రూ 1,346 కోట్లు ఖర్చుచేశారు. మోదీగారి విదేశీయాత్రా వ్యయంలో విమానాల నిర్వహణ ఖర్చు 1583 కోట్లు, ప్రత్యేక (చార్టర్డ్) విమానాలకు 429 కోట్లు, హాట్ లైన్ ఖర్చు 9.11 కోట్లు అని మంత్రి వివరించారు. 48 విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొత్తం 55 దేశాలను సందర్శించారు. కొన్ని దేశాలకు పదేపదే వెళ్లారు. అయితే ఈ లెక్కలో 2017 నుంచి ఇప్పటివరకు హాట్ లైన్ సౌకర్యాల ఖర్చు చేర్చలేదట.
వీరి పర్యటనలన్నీ అధికారికమైనవి. వ్యక్తిగత పర్యటనలు కావు. కనుక ఈ పర్యటనల వివరాలను వ్యక్తిగత వివరాలు అనుకోవడానికి వీల్లేదు. ఆ కారణంగా ఈ సమాచారాన్ని ప్రజలకు నిరాకరించే వీలు కూడా లేదు. కేంద్ర సమాచార కమిషన్ ఎన్నో సందర్భాలలో తీర్పులిస్తూ దేశ ప్రముఖులు విదేశాలకు వెళ్లినప్పుడు, లేదా దేశంలోనే తిరిగినప్పుడు వాటిని ప్రభుత్వ శాఖలు ఏదో ఒక హెడ్ కింద జమ కట్టవలసి ఉంటుందనీ, కనుక ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వెళ్లిన ప్రయాణాలకు చెందిన విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు ఇవ్వాలని పేర్కొన్నది. కమోడర్ లోకేశ్ కె బత్ర, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిని ప్రధాని విదేశాలకు ఐఏఎఫ్ వారు ఎంత ఖర్చులుపెట్టుకున్నారు అని అడిగారు. ఆ వివరాల్లో దాచడానికి ఏమీ లేదని కమిషన్ నిర్దేశించింది.
ప్రధాని వెంట వెళ్లిన ఎస్పీజీ సభ్యుల పేర్లు తదితర వివరాలు అడగడం అనవసరం. వారి పేర్లు తెలుసుకోవడం అంతకన్నా అనవసరం. భద్రతకోసం తీసుకున్న చర్యలు వచ్చిన వారి వివరాలు తీసి వేసి, మిగిలిన సమాచారం ఇవ్వడంలో ఇబ్బందేమీ ఉండటానికి వీల్లేదని 2012లో సుభాష్ చంద్ర అగ్రవాల్ కేసులో సీఐసీ వివరించింది.
నీరజ్ శర్మ ప్రధాని కార్యాలయం పీఐఓకు చేసుకున్న దరఖాస్తులో ప్రధాని వెంట వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పాలని కోరారు. సెక్యూరిటీ అంశాలతో సంబంధంలేని ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పడానికి ఏ ఇబ్బందీ ఉండే అవకాశం లేదని, కనుక 2014 నుంచి 2017 వరకు ప్రధాని వెంట విదేశాలకు వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల సమాచారం ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.సమాచార హక్కు చట్టం కింద అడిగితే పౌరులకు అసంపూర్ణ సమాచారం అందింది.
విశేషమేమంటే 2018 డిసెంబర్ 12న రాజ్యసభకు జవాబు ఇవ్వవలసిన విదేశీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. ప్రధాని వెంట వచ్చిన మీడియా సభ్యుల పేర్లు మాత్రం ఇచ్చింది. కానీ అధికారులు, అనధికారుల పేర్లు ఇవ్వలేదు. అంతేకాదు ప్రధాని వెంట వెళ్లిన ఒక మంత్రి పేరు అడిగితే ప్రభుత్వం ఆ ప్రశ్నకు జవాబు రాయవలసిన చోట ఏమీ రాయకుండా వదిలేసింది. చాలా సెన్సిటివ్ సమాచారం కనుక ఇవ్వలేమన్నారు. ఖర్చులు, పత్రికల వారి వివరాలిచ్చి, వెంట వచ్చిన అధికార, అనధికారుల సంగతి చెప్పకపోవడం ఎంత అన్యాయం?
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్
ఈ మెయిల్: madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment