
అక్కడ పుస్తకాలు చెల్లాచెదురైనాయి. చదివే మస్తకాలు పగిలాయి. సైలెన్స్ బదులు గ్రంథాలయాల్లో వయొలెన్స్ విలయ తాండవం చేసింది. కలాలు కాదు ఐరన్ రాడ్లు, కంప్యూటర్లు కాదు మొబైల్ ఫోన్లలో వాట్సాప్ కుట్రలు పనిచేసాయి. విద్యార్థులు కాదు విద్యార్థి సంఘాల గూండాలు విజృంభించారు. చంపడం తన్నడం పాఠాలనుకునే వారు, లాఠీతో సరిచేద్దామనుకునే తత్వజ్ఞులు చీకటితో వెలుగు మీద దాడిచేశారు. హాస్టళ్ల అద్దాలు పగిలాయి. బాత్‌రూంలలో కూడా నెత్తురు చుక్కలు.. వారు ఎవరిమీద ఎక్కడ దాడిచేశారో చెప్పే రుజువులు. కొత్త సంవత్సరం మొదటి ఆదివారం రాత్రి జేఎన్‌యూలో కాళరాత్రి. ఎవరూ రమ్మనకుండానే వచ్చి ఒక యూనివర్సిటీలో జొరబడి విద్యార్థులను శాంతిభద్రతలకోసం చితకబాదిన పోలీసులు ఈసారి వచ్చి కూడా అనుమతి లేదని కొన్నిగంటలు నిశ్చలంగా ఉండిపోయారు. జేఎన్‌యూలోని ముగ్గురు వ్యక్తులు గూండాలను తీసుకువచ్చి ఏయే హాస్టల్ గదుల మీద దాడిచేయాలో చూపారని వార్తలు. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలిసిన రహస్యమే.
ముసుగు పర్వం: పాలకులు ఎవరైనా సరే వారికి చదువంటే భయం. చదువుల నిలయాలంటే భయం. చదువుకునే వారంటే ఇంకా భయం. చదివిన చదువు లక్ష మెదళ్లను కదిలి స్తుంటే భయం. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెంట రాడ్లు తెచ్చుకుని, ముసుగులేసుకుంటారు.
జాతీయతా పర్వం: భయాన్ని దాచుకోవడానికి జాతీయత, దేశభక్తి వంటి భారీ పదజాలం కప్పుకోవాలి. లైబ్రరీ అయితే నాకేమిటి, పుస్తకాలు నాకెందుకు. అక్కడ ప్రొఫెసర్ ఉంటేనేం, విద్యార్థి అయితేనేం ఎవడైతే నాకేమిటి. లాఠీతో కొడతాను. పుస్తకం చింపేస్తాను. గొంతు నులిపేస్తాను, శరీరాల్ని నలిపేస్తాను. నీవు చదువుకుని ఏం చేస్తావు? మేం పాలిస్తున్నాం. మీకన్నీ ఇస్తాం. నోరుమూసుకుని పడి ఉండు. అనేదే ఫిలాసఫీ.
భయపడే పర్వం: ఈ పిరికి మంద పాడైపోవడాన్ని బాగుపడడం అనుకుంటుంది. పాపం జేఎన్ యూను బాగుచేయాలనుకున్నారు పాడైపోయిందనుకుని, కొట్టి భయపెట్టి. తలలు పగిలితే బాగుపడుతుందని నమ్మారు. ఈ మంద భయపడుతూ శరీరాలపై హింసకు పాల్పడి భయపెడుతున్నానుఅనుకుంటుంది. నిజాలంటే భయం, నిలదీయడమంటే భయం.
టెర్రరిజం పర్వం: ఎదురుపడలేని పిరికితనమే టెర్రరిజం. సరిహద్దు అవతలనుంచి విసిరే రాకెట్ కన్న దారుణమైంది విశ్వవిద్యాలయం మీద గూండాల దాడి. సంబంధంలేని వాడిని తన్ని గర్వించడమే టెర్రరిజం. కళ్లు కనబడలేదన్నా వదలరు. కదలలేమన్నా వదలరు. వారికి మెదడు ఉండే చోట మరేదో ఉంది. గుండె ఉండేచోట ఇంకేదో ఉండకూడని పదార్థం ఉంది.
సంస్కృతి పర్వం: పిరికితనం దాచుకుని గూండాగిరీ చేసేవారు వాడుకునే మరో ఇనుప రాడ్–సంస్కృతి. సంస్కృతి అంటే లాఠీలు పట్టుకుని రాడ్లు పట్టుకుని, వాట్సాప్‌లో తోడున్న గూండాలను, మందలను తరలిం చినట్టు తరలించి, పోలీసులు మనోళ్లే, సర్కార్ మనదే, వీసీ మనోడే, ఇంకెవడో కూడా మనోడే అని సంక్షిప్త సందేశాలిస్తూ, తరువాత దొరికిపోతామన్న ఆలోచన కూడా లేకుండా, ముసుగు దాచదన్న భయం లేకుండా మూర్ఖత్వంతో దాడి చేస్తారు. ఇది సంస్కృతి మీద, సనాతన ధర్మం మీద దాడి.
లాఠీ లూటీ పర్వం: రేపటి తరానికి రిజర్వ్ బాంక్ విశ్వవిద్యాలయమే. అది లూటీ చేయడానికి వీలుకాని ధనాగారం. జేఎన్‌యూలో దాడిచేసిన గూండాల ముసుగులను తొలగించే అంశాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. అందుకే కొందరు సిగ్గు లేకుండా మేమే తన్నాం, మేమే గుద్దాం, మేమే దాడి చేశాం, మాది దక్షిణ పక్షమని ఉన్మత్తంగా చెప్పుకుంటూనే ఉన్నారు. జేఎన్‌యూ అయింది. ఇక ఆ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ అని టార్గెట్లు కూడా నిర్ణయించారు.
మౌనాంగీకార పర్వం: దీన్ని ఖండించక మౌనంగా ఉండడానికి ఫేస్‌బుక్‌లో లైక్‌లు పెట్టడానికి పెద్ద తేడా లేదు. మౌనం అతి భయంకరం. విశ్వవిద్యాలయం శత్రుస్థావరం అనుకునే విజ్ఞానవంతులకు రాజ్యాంగం ఎందుకు? నిర్భయ, దిశ కన్న భయంకర నేరం ఇది. వెలుగుదిశ చూపే నిర్భయ విద్య ఎక్కడ?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment