
‘హోదా’పై చట్టసభలో, ఎన్నికల మానిఫెస్టోల్లో పదేపదే చేసిన వాగ్దానాలను కూడా గాలికి వదిలితే ఆ గాలి సుడిగాలి కావచ్చు, సునామీ కావచ్చు. విశ్వసనీయత కోల్పోయిన తరువాత ఒక్క ఏపీలోనే కాదు, ప్రపంచంలోఎక్కడైనా ఉనికి ఊగిపోనూవచ్చు.
పార్టీలు ప్రభుత్వాలు చేసే హామీలను వాగ్దానాలను అమలు చేయించే శక్తి ప్రజలకు లేదనుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వహామీలను అమలు చేయిం చుకోలేకపోవడం తాత్కాలిక దౌర్భాగ్యం. మిత్రపక్షాలై సంకీర్ణ భాగస్వాములుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిన రెండు పార్టీలు నవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో, ఎన్నికల సభల్లో, మానిఫెస్టోలో మాట ఇచ్చిన ప్రత్యేక హోదా వర్గీకరణను ఇవ్వకపోవడం రాజ కీయాల నైతికస్థాయి పతనానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన 2014 వరకు తెలం గాణ నుంచి అందుతున్న అనంతమైన ఆదాయవనరులు ఏపీకి అందకుండా, తెలంగాణకు చెందడం వల్ల ఒక్కసారిగా సరి కొత్త వనరులను రాత్రిరాత్రే సృష్టించుకోవడం సాధ్యం కాని పరిస్థితి. హటాత్తుగా ఏర్పడిన ఈ లోటును ఏ విధంగా భర్తీచేస్తారని ఆంధ్ర రాజకీయ పార్టీలు చాలా తీవ్రంగానే అడిగాయి. విభజన నిర్ణయం తీసుకుంటే మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారనే సమస్యను అనేక కోణాలనుంచి కేంద్ర నాయకులకు, అధికారులకు, మంత్రివర్గ ఉపసంఘాలకు, అధిష్టానవర్గాలకు ఇతర పెద్దలకు శక్తి వంచన లేకుండా వివరించారు.
ముఖ్యంగా ఆనాటి బీజేపీ ముఖ్యనేత ఎం వెంకయ్యనాయుడు రాజ్యసభలో చేసిన సమగ్ర ప్రసంగం ప్రత్యక్షప్రసారం ద్వారా పత్రికలద్వారా అందరికీ తెలుసు. తన పార్లమెంటరీ కార్యనైపుణ్యానికి ప్రతీకగా ఆయన చేసిన ఉత్తమప్రసంగంగా అది చట్టసభల చరిత్రలో నిలిచిపోతుంది. విభజన తరువాత ఏపీని ఏవిధంగా ఆదుకోవాలో ఆయన చాలా వివరంగా ఆనాటి అధికార సంకీర్ణానికి వివరించారు. ఆ ప్రసంగం మొత్తం బీజేపీ పక్షాన ఇచ్చిన ఒక గొప్ప కమిట్‌మెంట్.
బీజేపీ నాయకుల వత్తిడి వల్లనే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తామని ప్రకటించారు. ఒక ప్రధాని పెద్దల సభలో పెద్దల సూచన మేరకు, ప్రధాన ప్రతి పక్షం చేసిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఒక కమిట్‌మెంట్‌ను నాలుగేళ్లదాకా అమలు చేయకపోవడం, అమలు చేస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడడం రాజ్యాంగ పరంగా ఏమాత్రం ఆమోదయోగ్యంకాని విషయం. సార్వభౌములైన ప్రజలు, ఓట్లేసి పార్లమెంటుకు ఎన్నుకుని పంపిన ప్రతిని ధులు, ప్రభుత్వపక్ష, ప్రతిపక్ష నాయకులు కలిసి ఉమ్మడిగా చేసిన ఒక ప్రతిజ్ఞను ఇంత దారుణంగా తిరస్కరిస్తారా?
ఏపీకి ప్రత్యేక హోదా వద్దని ఎవరూ అనలేదు. ఆనాటి వాగ్దానాలలో ముఖ్యమైనవి రెండు. ఒకటి పోలవరం, రెండు ప్రత్యేకహోదా. ఇవి రెండూ వచ్చి తీరుతాయని అందరూ ఆశిం చారు. ఆకాంక్షించారు. అది దురాశ కాదు. రాముడు ఆదర్శం, రామరాజ్యం లక్ష్యం అని ఎన్నికల సమరాల్లో రామరణన్నినాదాలు చేస్తున్న పార్టీ గొప్ప ప్రజాదరణతో అధికారం చేపట్టిన తరువాత మాట తప్పితే మన ప్రమాణాలు ఎక్కడున్నట్టు? ఎన్నికల ప్రణాళికల హామీలను చెత్త చిత్తు కాగితాల వలె విసిరి పారేస్తే మన ప్రయాణం ఎటు సాగుతున్నట్టు? ఇక ఈ ప్రజ ఎవరిని నమ్మాలి? మన రాజకీయానికి అసత్యభయం లేదు, రాజ్యాంగ వ్యతిరేకత అనే లజ్జలేదు.
ఇతర పార్టీలతో పోల్చి, వీరయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారేమోనని నమ్మిన జనులకు నమ్మకద్రోహం చేస్తున్నామన్న పాపభీతి లేదు. 1956లో తెలంగాణకు హామీలిచ్చిన పెద్దమనుషుల ఒప్పందం గాలికి వదిలినట్టే 2014లో పెద్దలు చట్టసభలో, ఎన్నికల మాని ఫెస్టోల్లో పదేపదే చేసిన వాగ్దానాలను కూడా గాలికి వదిలితే ఆ గాలి సుడిగాలి కావచ్చు. ఎదురుతిరిగే సునామీ కావచ్చు. విశ్వసనీయత కోల్పోయిన తరువాత ఒక్క ఆంధ్రలోనే కాదు, ప్రపంచంలోఎక్కడైనా ఉనికి ఊగిపోనూ వచ్చు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే నూరు శాతం ఆదాయపు పన్నురాయితీ, జిఎస్‌టి రాయితీలు, విద్యుచ్ఛక్తి మినహాయింపులు, అప్పులలో వెసులుబాట్లు ఏర్పడి, పరిశ్రమలకు సానుకూల వాతావరణం నెలకొని, దేశ విదేశాలనుంచి పెట్టుబడులు వచ్చి కొత్త ఉపాధికల్పనావకాశాలు కలుగుతాయి. గ్రూప్ వన్ అధికారులను తప్ప మిగిలిన ఏ ఉద్యోగులను ప్రభుత్వాలు నియమించడంలేదు. కంప్యూటర్, ఇంగ్లీషు భాషా ప్రతిభ ఆధారంగా లక్షల మంది అమెరికా రాష్ట్రాలకు వెళ్లడం వల్ల బతుకులు ఇన్నాళ్లూ తెల్లవారుతున్నాయి. కాని ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రతికూలమై యువ ఉద్యోగులు తిరుగుప్రయాణం దారి బట్టారు. వారికీ, ఇక్కడి వారికి ఉద్యోగాలు ఎవరిస్తారు?
పరిశ్రమలు రావడమొక్కటే దిక్కు. ఆ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వస్తాయి? ఏ రాయితీలు లేకుండా ఏ ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఉంటే పారిశ్రామిక వేత్తలు ఎందుకు రావాలి? అత్యంత సంపన్నులైన బహుళ జాతి సంస్థలే కాదు చిన్న సంస్థలు, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలు ప్రతిజిల్లాకు వస్తేనే ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రత్యేకప్యాకేజి అంటేనే లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ప్యాకేజీ ఇస్తే ఇవ్వండి. కాని ప్రత్యేక హోదాను నిరాకరించే అధికారం ఎవరికీ లేదు. ఈదేశంలో ఒక్కొక్క మనిషి సార్వభౌముడు. ఆ మనిషిని మని షిగా చూడకుండా నోటు తీసుకుని ఓటిచ్చే యంత్రంగా చూడొద్దు. ఆ సగటు జనుడు మీరు అందించని సేవలు వినియోగించుకునే కొనుగోలుదారుడు కాదు. మీరు నమ్ముకోకుండా అమ్ముకోవడానికి ఈదేశం దుకాణం కాదు, బేరసారాల గోల్ మాళ్ల మాల్ కాదు.
దేశమంటే ఎగిరే జెండాల వంటి మనుషులు. దేశమంటే సున్నం మట్టీ కాదు సూపర్ మార్కెట్టూ కాదు. చైతన్యం తొణికిసలాడే సజీవమైన మనుషులు. మనసు, ప్రేమ, కోపం అన్నీ ఉన్న మనుషులు. ఏ రాజకీయ నాయకుడికైనా సరే చెప్పింది చేయకపోతే చరిత్రకెక్కని చెత్తకాగితాలవుతారని చెప్పగలవాళ్లు, చేవగలవాళ్లు వాళ్లు. సగటు మనిషి శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు. జనం రాజ్యాంగాన్ని రాజకీయ వాగ్దానాల్ని అమలు చేయించుకోగల సమర్థులని మర్చిపోవద్దు. తస్మాత్ జాగ్రత్త.
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్,professorsridhar@gmail.com