ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రేమిస్తాం. అది కాలుష్యానికి రాజధాని. ఇక్కడ ఇంధన వనరుల వినియోగం, విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, చెట్లను ధ్వంసం చేసి నేలను చదునుచేసి, కార్బన్ విసర్జన పరిమాణాన్ని నిరంతరం పెంచే దుర్భర కార్యక్రమం జరుగుతున్న దారుణమైన ప్రదేశం ఢిల్లీ. వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రపంచం వ్యాప్తమై ఉందని 11 వేల మంది శాస్త్రజ్ఞులు 153 దేశాల నుంచి మనందరినీ హెచ్చరిస్తున్నారు. మన నవ నాగరిక జీవనానికి ఊపిరులూదుతున్న ఆక్సిజన్‌ను హరించి, హరిత హరణ విసర్జనలతో పర్యావరణాన్ని ఊహాతీతంగా పతనం చెందిస్తున్న మానవ దైనందిన కార్యక్రమాలలో సమూలమైన మార్పులు రాకపోతే మన సంగతి ఇంతే అని శాస్త్రజు్ఞలు వివరిస్తున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు 11,258 మంది ఈ వాతావరణ సూచిక మీద హెచ్చరిక సంతకాలు చేశారు. వారిలో 69 మంది మన భారతీయులు. మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా వివరించారు. మనం ఏ విధంగా బ్రతకాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మన నిలకడైన భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. మన ప్రపంచ సమాజం సహజ పర్యావరణ పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎంత త్వరగా తన వ్యవహార ధోరణి మార్చుకుంటుందో దాన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. మనకు గడువు లేదు. పర్యా వరణ సంక్షోభం అంతకంతకూ మరింత సంక్లిష్ట మవుతున్నది. పతనం ప్రమాదకరవేగంతో సమీపిస్తున్నది. అనుకున్నదానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
1979లో మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సభ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా బయో సైన్స్ జర్నల్‌లో వారు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి వారు ప్రతిపాదించిన మొదటి అంశం జనాబా పెరుగుదల రేటును వెంటనే పూర్తిగా అరికట్టడం. ఇది ముఖ్యంగా భారత్, చైనా దేశాలు గుర్తించి ఆచరణాత్మక పథకాలు అమలు చేయవలసి ఉంది. రెండోది భూగర్భ ఇంధనాలను భూమిలో మిగల్చడం. శరవేగంగా సాగుతున్న అడవుల నరికివేతను వెంటనే ఆపాలి. అంతేకాదు మాంసం తినడాన్ని కూడా చాలావరకు తగ్గించాలి. విపరీతంగా పర్యావరణంలో వస్తున్న మార్పులను చూసి ఈ హెచ్చరిక చేయాలనే నిర్ణయానికి వచి్చనట్టు ప్రొఫెసర్ విలియం రిపిల్ వివరించారు. పర్యావరణం ఈ విధంగా విచి్ఛన్నమవుతున్న విషయం జనులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేయవలసి వచ్చిందని ఓరేగావ్ రాష్ట్ర యూని వర్సిటీకి చెందిన రిపిల్ అన్నారు. భూ ఉపరితల, సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కుతున్నది. సముద్రమట్టం పెరగడం, తీవ్ర ప్రమాదకరం. మనం నలభై సంవత్సరాలుగా ఈ అంశాలను చర్చిస్తున్నాం. కాని చాలా మటుకు ఈ ప్రమాదాన్ని పసి గట్టి నివారించడంలో విఫలమయ్యాం. ఏవో కొన్ని చిన్న చిన్న విజయాలు తప్ప భారీ పరాజయాలే దాదాపు అంతటా ఎదురయ్యాయి.
పర్యావరణంలో ఉపసంహరించడానికి వీల్లేని మార్పులు జరుగుతున్నాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం. ఎకో విధానాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. మామూలు ప్రజలను, విధాన విధాతలయిన రాజకీయ నాయకులను హెచ్చరిం చడానికి ఈ ప్రకటన చేయకతప్పడం లేదని శాస్త్రజు్ఞలు అంటున్నారు. ముందు ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయతి్నంచండి. ప్రగతి నిజంగా జరుగుతన్నదో లేదో పరిశీలించండి అని శాస్త్రవేత్తలు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. భూగర్భ ఇంధనాల బదులు సౌరశక్తి, వాయుశక్తికి మళ్లుతున్నారు. మనం వెంటనే చేయవలసిన పనులను కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఇంధనాన్ని చాలా అరుదైన సమ యాల్లోనే వాడడం అలవాటు చేసు కోవాలి. భూగర్భ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాటిమీద భారీ పన్నులు వేయాలి. అమ్మాయిలకు సుదీర్ఘకాలం చదువు చెప్పించడం మంచి వ్యూహమంటున్నారు. అడవుల నరికివేతను ఆపి, మడ అడవులు పెంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను విలీనంచేసుకునే అవకాశాలు పెంచాలి. ఆకు కూరలు ఎక్కువగా తింటూ మాంసాహారాన్ని తగ్గించాలి.
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment