Environmental pollution
-
టీచరమ్మగా రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము టీచర్‌గా మారారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా గురువారం ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. భూతాపం పర్యవసానాలు, తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో 9వ తరగతి చదువుకునే 53 మంది విద్యార్థులతో ఆమె సంభాషించారు. మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ అవసరాన్ని తెలియజెప్పారు. ముఖాముఖి సందర్భంగా వారి ఆకాంక్షలు, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుని వైద్యులు, శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఉందంటూ వారు చెప్పిన లక్ష్యాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా నేడు శాస్త్రవేత్తలు, పాలనాధికారులు, పాలకులు సభలు, చర్చాగోషు్టలు, సమావేశాలు చేపట్టి ఓ పెద్ద సమస్యపై చర్చలు జరుపుతున్నారు. అదేమిటో మీకు తెలుసా?’అని వారినడిగారు. వాతావరణ మార్పులు, భూతాపం, పర్యావరణ కాలుష్యం..అంటూ విద్యార్థులు బదులిచ్చారు. రాష్ట్రపతి ముర్ము బదులిస్తూ..‘ఇది వరకు ఏడాదిలో ఆరు రుతువులుండేవి కానీ, నేడు నాలుగే ఉన్నాయి. వీటిలో అత్యధిక కాలం కొనసాగుతూ మనల్ని ఇబ్బంది పెట్టే రుతువు ఎండాకాలం. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో మనుషులే కాదు, జంతువులు, మొక్కలు, పక్షులూ ఇబ్బంది పడుతున్నాయి. కరువులు కూడా ఏర్పడుతున్నాయి. భూతాపమే వీటికి కారణం’అని ఆమె వివరించారు. ‘భూతాపాన్ని ఎదుర్కోవాలంటే నీటిని పొదుపుగా వాడాలి. వర్షం నీటిని సంరక్షించాలి. చెట్లను విరివిగా పెంచాలి’అని వారికి సూచించారు. -
కరెంట్ కొరతకు కొత్త జవాబు
నా ఉచ్ఛ్వాసం కవనం... నా నిశ్వాసం గానం.. అన్నాడో కవి. నా ఉచ్ఛ్వాసం మీథేన్.. నా నిశ్వాసం విద్యుత్.. అంటున్నాయి ఒక రకం బ్యాక్టీరియాలు. మానవాళిని వేధిస్తున్న పర్యావరణ కాలుష్యం, ఇంధన కొరతకు అవి సమాధానం చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.. జనాభా పెరిగిపోయే కొద్దీ శిలాజ ఇంధనాల వాడకం పెరిగి వాతావరణ కాలుష్యం హద్దులు దాటుతోంది. అలాగని ఇంధన వాడకాన్ని పరిమితం చేయదలిస్తే మానవ అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత ఇంధనాల కోసం మనిషి అన్వేషణ చాలా రోజులుగా జరుగుతోంది. వాయు, సౌర విద్యుత్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం జరుగుతున్నా అది శిలాజ ఇంథనాలను పరిమితం చేసే స్థాయిలో జరగడంలేదు. వీటికయ్యే ఖర్చు, సాంకేతిక సమస్యలు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని విరివిగా వాడేందుకు అడ్డంకిగా మారుతున్నాయి. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటున్నారు శాస్త్రవేత్తలు. వాయు కాలుష్యకాల్లో కీలకమైన మీథేన్‌ను వాడుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాను కనుగొన్నామని నెదర్లాండ్స్ పరిశోధకులు చెప్పారు. మీథేన్‌ను ఇంధనంగా వాడుకోవడం చాలా రోజులుగా జరుగుతున్నదే. బయోగ్యాస్ ప్లాంట్లలో వ్యర్థాలను సూక్ష్మ జీవులు మీథేన్‌గా మారుస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన మీథేన్‌ను మండించి టర్బైన్లు తిరిగేందుకు వాడతారు. దీంతో విద్యుదుత్పాదన జరుగుతుంది. అయితే ఉత్పత్తి అయిన బయోగ్యాస్‌లో సగానికన్నా తక్కువే విద్యుదుత్పాదనకు ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తమ ప్రయోగం ప్రత్యామ్నాయ ఇంధనోత్పత్తిలో ముందడుగు అని రాడ్బౌడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కార్నెలియా వెల్టె చెప్పారు. ప్రయోగ ఫలితాలను ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇలా చేశారు పరిశోధనలో భాగంగా కాండిడేటస్ మిథేనోపెరెండెన్స్ అనే బ్యాక్టీరియాకున్న ప్రత్యేక టాలెంట్‌ను గుర్తించామని వెల్టె చెప్పారు. ఈ సూక్ష్మజీవులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా బతుకుతుంటాయి. ఇవి మీథేన్‌ను ఆక్సిజన్ అవసరం లేకుండానే విడగొట్టి శక్తిని ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. ఏఎన్‌ఎంఈ (అనరోబిక్ మీథనోట్రోపిక్) ఆర్కియాగా పిలిచే ఈ జీవులు కొన్ని రసాయన ప్రక్రియల ద్వారా తమ సమీపంలోని పదార్ధాల నుంచి ఎలక్ట్రానులను విడగొడతాయి. కరెంటంటేనే ఎలక్ట్రానుల ప్రవాహం. అంటే ఇవి తమ దగ్గరలోని పదార్ధాలను ఆక్సిడైజ్ చేసి కరెంటును ఉత్పత్తి చేస్తాయి. ఇందుకు కొద్దిగా నైట్రేట్ల సాయం తీసుకుంటాయి. ప్రయోగంలో భాగంగా ఈ సూక్ష్మజీవులను ఆక్సిజన్ రహిత ట్యాంకులో మీథేన్‌తో కలిపి ఉంచారు. దగ్గరలో ఒక మెటల్ ఆనోడ్‌ను జీరో ఓల్టేజ్ వద్ద సెట్ చేసి పెట్టారు. దీంతో ఈ మొత్తం సెటప్ ఒక బ్యాటరీలా మారిందని, ఇందులో ఒకటి బయో టెర్మినల్ కాగా ఇంకోటి కెమికల్ టెర్మినల్ అని వెల్టె తెలిపారు. సదరు బ్యాక్టీరియా తమ దగ్గరలోని మీథేన్‌నుంచి ఎలక్ట్రానులను విడగొట్టి కార్బన్ డైఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ ప్రక్రియలో దాదాపు చదరపు సెంటీమీటర్‌కు 274 మిల్లీ యాంప్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. దీన్ని మరింత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఆధారంగా భారీ స్థాయిలో బ్యాక్టీరియా బ్యాటరీలను నిర్మించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ► ప్రపంచ జనాభాలో 94 కోట్ల మంది (13 శాతం)కి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. ► భూతాపాన్ని పెంచే గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్ కీలకమైనది. మొత్తం గ్రీన్‌హస్ వాయువుల్లో దీని వాటా 20 శాతం. ► కార్బన్ డై ఆక్సైడ్తో పోలిస్తే మీథేన్ భూమిపై సూర్యతాపాన్ని 25 శాతం వరకు పట్టి ఉంచుతుంది. ► పశువ్యర్థాలు, బొగ్గు గనుల నుంచి ఎక్కువగా మీథేన్ విడుదలవుతుంది. ► భారీస్థాయిలో శిలాజ ఇంధనాల వాడకం తగ్గితే భూతాపం గణనీయంగా అదుపులోకి వస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని, డబ్బు కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్‌లో పర్యావరణ కాలుష్యంపై న్యాయస్థానం మరోసారి తీవ్రంగా స్పందించింది. కాసుల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? అంటూ యాజమాన్యాన్ని నిలదీసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తేల్చి చెప్పింది. కార్మికుల రక్త నమూనాల్లో సీసం ఆనవాళ్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. అమరరాజా బ్యాటరీస్‌లో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది. అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనలు పాటించకపోవడంతో అమరరాజా బ్యాటరీస్ మూసివేతకు పీసీబీ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరరాజా బ్యాటరీస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై తాజాగా జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం, గతంలో అమరరాజా ఉద్యోగులు, కార్మికుల ఆరోగ్య స్థితిపై పీసీబీ సమర్పించిన నివేదికలను పరిశీలించింది. ఆ నివేదికల్లో కార్మికులు, ఉద్యోగుల రక్త నమూనాల్లో సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్రంగా స్పందించింది. ఇదిలాఉంటే ఇదే కేసులో, తమ సంస్థలో ఎలాంటి అధ్యయనం చేయకుండా పీసీబీని నియంత్రించాలని కోరుతూ అమరరాజా బ్యాటరీస్ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్‌లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్‌ల్యాండ్‌లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్‌ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్‌ల సెటప్‌తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్‌వర్క్స్, ఐస్‌ల్యాండ్‌కు చెందిన కార్బ్‌ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్‌గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
బీజేపీ అధికారంలోకి వచ్చాక పర్యావరణం నాశనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతింటోందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పర్యావరణ పరిరక్షణపై బీజేపీ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. కానీ ఏ సంవత్సరంలో.. ఎక్కడ, ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని విత్తనాలు చల్లారనే వివరాలను వెల్లడించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్యావరణం నాశనం అయ్యింది’’అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. బీజేపీ యూపీలో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం సాగుతోందని అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. తమ హయాంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామని గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో చెరువులు తవ్వి, గ్రీన్ పార్కులు డెవలప్ చేశామని చెప్పారు. 30 కోట్ల మొక్కలను నాటాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ ఏడాది ప్లాంటేషన్ డ్రైవ్‌లో 30 కోట్ల మొక్కలను నాటాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా భూమి, మొక్కలను గుర్తించాలని జిల్లా న్యాయాధికారులను (డీఎం) కోరినట్లు మంగళవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు. చదవండి: ప్రేమించినోడితోనే పెళ్లి అన్నందుకు తండ్రి దారుణం.. -
ముంచుకొస్తున్నది పర్యావరణ ప్రళయం
ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రేమిస్తాం. అది కాలుష్యానికి రాజధాని. ఇక్కడ ఇంధన వనరుల వినియోగం, విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, చెట్లను ధ్వంసం చేసి నేలను చదునుచేసి, కార్బన్ విసర్జన పరిమాణాన్ని నిరంతరం పెంచే దుర్భర కార్యక్రమం జరుగుతున్న దారుణమైన ప్రదేశం ఢిల్లీ. వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రపంచం వ్యాప్తమై ఉందని 11 వేల మంది శాస్త్రజ్ఞులు 153 దేశాల నుంచి మనందరినీ హెచ్చరిస్తున్నారు. మన నవ నాగరిక జీవనానికి ఊపిరులూదుతున్న ఆక్సిజన్‌ను హరించి, హరిత హరణ విసర్జనలతో పర్యావరణాన్ని ఊహాతీతంగా పతనం చెందిస్తున్న మానవ దైనందిన కార్యక్రమాలలో సమూలమైన మార్పులు రాకపోతే మన సంగతి ఇంతే అని శాస్త్రజు్ఞలు వివరిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 11,258 మంది ఈ వాతావరణ సూచిక మీద హెచ్చరిక సంతకాలు చేశారు. వారిలో 69 మంది మన భారతీయులు. మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా వివరించారు. మనం ఏ విధంగా బ్రతకాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మన నిలకడైన భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. మన ప్రపంచ సమాజం సహజ పర్యావరణ పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎంత త్వరగా తన వ్యవహార ధోరణి మార్చుకుంటుందో దాన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. మనకు గడువు లేదు. పర్యా వరణ సంక్షోభం అంతకంతకూ మరింత సంక్లిష్ట మవుతున్నది. పతనం ప్రమాదకరవేగంతో సమీపిస్తున్నది. అనుకున్నదానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 1979లో మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సభ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా బయో సైన్స్ జర్నల్‌లో వారు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి వారు ప్రతిపాదించిన మొదటి అంశం జనాబా పెరుగుదల రేటును వెంటనే పూర్తిగా అరికట్టడం. ఇది ముఖ్యంగా భారత్, చైనా దేశాలు గుర్తించి ఆచరణాత్మక పథకాలు అమలు చేయవలసి ఉంది. రెండోది భూగర్భ ఇంధనాలను భూమిలో మిగల్చడం. శరవేగంగా సాగుతున్న అడవుల నరికివేతను వెంటనే ఆపాలి. అంతేకాదు మాంసం తినడాన్ని కూడా చాలావరకు తగ్గించాలి. విపరీతంగా పర్యావరణంలో వస్తున్న మార్పులను చూసి ఈ హెచ్చరిక చేయాలనే నిర్ణయానికి వచి్చనట్టు ప్రొఫెసర్ విలియం రిపిల్ వివరించారు. పర్యావరణం ఈ విధంగా విచి్ఛన్నమవుతున్న విషయం జనులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేయవలసి వచ్చిందని ఓరేగావ్ రాష్ట్ర యూని వర్సిటీకి చెందిన రిపిల్ అన్నారు. భూ ఉపరితల, సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కుతున్నది. సముద్రమట్టం పెరగడం, తీవ్ర ప్రమాదకరం. మనం నలభై సంవత్సరాలుగా ఈ అంశాలను చర్చిస్తున్నాం. కాని చాలా మటుకు ఈ ప్రమాదాన్ని పసి గట్టి నివారించడంలో విఫలమయ్యాం. ఏవో కొన్ని చిన్న చిన్న విజయాలు తప్ప భారీ పరాజయాలే దాదాపు అంతటా ఎదురయ్యాయి. పర్యావరణంలో ఉపసంహరించడానికి వీల్లేని మార్పులు జరుగుతున్నాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం. ఎకో విధానాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. మామూలు ప్రజలను, విధాన విధాతలయిన రాజకీయ నాయకులను హెచ్చరిం చడానికి ఈ ప్రకటన చేయకతప్పడం లేదని శాస్త్రజు్ఞలు అంటున్నారు. ముందు ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయతి్నంచండి. ప్రగతి నిజంగా జరుగుతన్నదో లేదో పరిశీలించండి అని శాస్త్రవేత్తలు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. భూగర్భ ఇంధనాల బదులు సౌరశక్తి, వాయుశక్తికి మళ్లుతున్నారు. మనం వెంటనే చేయవలసిన పనులను కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఇంధనాన్ని చాలా అరుదైన సమ యాల్లోనే వాడడం అలవాటు చేసు కోవాలి. భూగర్భ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాటిమీద భారీ పన్నులు వేయాలి. అమ్మాయిలకు సుదీర్ఘకాలం చదువు చెప్పించడం మంచి వ్యూహమంటున్నారు. అడవుల నరికివేతను ఆపి, మడ అడవులు పెంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను విలీనంచేసుకునే అవకాశాలు పెంచాలి. ఆకు కూరలు ఎక్కువగా తింటూ మాంసాహారాన్ని తగ్గించాలి. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఢిల్లీని వదిలి.. దక్షిణాది బాట..
న్యూఢిల్లీ : నానాటికీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో చాలామంది ప్రొఫెషనల్స్ ఢిల్లీని వీడి దక్షిణ భారతదేశ ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో కథనం వెలువడింది. కాలుష్యం కారణంగా కుటుంబపరమైన సమస్యలతోనే ఢిల్లీ వాసులు బెంగళూరు, గోవా, హైదరాబాద్‌లకు తరలివెళ్తున్నట్లు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి. ఏడాదిన్నరగా ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడంతో ఎక్కువమంది ప్రొఫెషనల్స్ పిల్లలు, తల్లిదండ్రులు స్మాగ్ కారణంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీంతో సొంత ఇళ్లను అమ్ముకుని మరీ దక్షిణాది ప్రాంతాలకు వారు వలస వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో గ్రీనరీతో పాటు గాలి నాణ్యత అధికంగా ఉంటుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
ముంచుకొస్తున్న ముప్పు!
-
మళ్లీ పారిస్ ఒప్పందంలోకి అమెరికా?
వాషింగ్టన్: తమకు ఆమోదయోగ్యమైన విధంగా ‘పారిస్ పర్యావరణ ఒప్పందం’లో మార్పులు జరిగితే అందులో తిరిగి చేరడంపై యోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘నిజాయితీగా చెబుతున్నా. పారిస్ ఒప్పందంతో నాకెలాంటి సమస్య లేదు. కానీ అమెరికా ప్రయోజనాలు దెబ్బతీసేలా నాటి ఒబామా సర్కారు సంతకం చేయడం ఆందోళనకు గురిచేసింది. ఇది అమెరికాకు ఒక చెత్త డీల్. ఒప్పందంలో మాకు అనుకూలంగా మార్పులు జరిగితే తిరిగి అందులో చేరొచ్చు. పర్యావరణ కాలుష్యంపై నేనూ ఆందోళన చెందుతున్నా. స్వచ్ఛ జలం, స్వచ్ఛ గాలితో పాటు ఇతర దేశాలతో పోటీపడుతూ వ్యాపారాలు చేయడం ముఖ్యమే. కానీ పారిస్ ఒప్పందం మా పోటీతత్వ ప్రయోజనాన్ని హరిస్తోంది’ అని ట్రంప్ అన్నారు. -
అభివృద్ధి చెందిన దేశాల వల్లే పర్యావరణ కాలుష్యం
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యా వరణ కాలుష్యానికి అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల కంటే అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాల వల్లే ఎక్కువ హాని కలుగుతోందని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్. ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘పర్యావరణ పరిరక్షణ, భారత్‌లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అన్న అంశంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సోమవారం జాతీయ సదస్సు జరిగింది. ఢిల్లీకి చెందిన క్యాపిటల్ ఫౌండేషన్, హైదరాబాద్‌కి చెందిన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో జస్టిస్ టీఎస్.ఠాకూర్ మాట్లాడుతూ.. పర్యావరణ కాలుష్యాన్ని ప్రపంచ సమస్యగా అభివర్ణిం చారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ అవార్డును ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌కు, వార్షిక అవార్డులను మే ఫెయిర్ గ్రూప్ హోటల్స్ సీఎండీ దిలీప్ రే, సింబోటిక్ సైన్స్ సంస్థ చైర్మన్ రాకేష్ మల్హోత్రాలకు, ప్రొఫెసర్ టి.శివాజీ రావ్ జాతీయ అవార్డును ప్రొఫెసర్ ధర్మేంద్ర సింగ్‌కు ఇచ్చారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే.పట్నా యక్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్, క్యాపిటల్ ఫౌండే షన్ ప్రధాన కార్యదర్శి డా. వినోద్ సేతి, పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, తూర్పు కనుమల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు దిలీప్ రెడ్డి, డా. దొంతి నరసింహారెడ్డి, సంజీవరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. -
కేరళలో నిషేధంతో... టయోటా పునరాలోచన!
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం దృష్ట్యా కేరళలో 2000 పైగా సీసీ సామర్థ్యం గల వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా పునరాలోచనలో పడింది. సంస్థ ఉపాధ్యక్షుడు, హోల్ టైం డెరైక్టర్ శేఖర్ విశ్వనాథన్ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘మా వాదనలు వినకుండా సహజ న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. మా కంపెనీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ నిషేధం విధించారు’’ అని ఆయన ఆరోపించారు. గత డిసెంబర్లో సుప్రీం వె ల్లడించిన తీర్పు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో(ఎన్సీఆర్) తమ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింద న్నారు. ‘‘నిషేధించాలనుకుంటే అన్ని రకాల డీజిల్ వాహనాలనూ బ్యాన్ చేయాలి. కానీ 2000 సీసీ సామర్థ్యం ఉన్న వాటినే ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ భారతలో మా సంస్థ కార్యకలాపాలు నిలిపివేస్తే దాదాపు 25 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుంది? హేతుబద్ధత లేకపోతే భారత్‌లో పెట్టుబడులతో కొత్త న మూనాలను తయారు చేసేందుకు ముందుకెవరొస్తారు?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కంపెనీ కొత్త ఉత్పత్తి ఇన్నోవా క్రిస్టాతో సంతృప్తిగా ఉన్నామని, కానీ కేరళ, ఢిల్లీ, ఎన్సీఆర్లో నిషేధం పట్ల అసంతృప్తిగా ఉందని చెప్పారాయన. కేరళలో టయోటా కిర్లోస్కర్ గ్రూపు కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రజా రవాణా, స్థానిక అధికారుల వాహనాలు మినహా 2000 సీసీ, పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై తిరువనంతపురం, కొచ్చితో సహా ఆరు ప్రధాన నగరాలలో ఎన్జీటీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
మీ పాపాన్నిమా రైతులెందుకు మోయాలి?
వాతావరణ కాలుష్యం అభివృద్ధి చెందిన దేశాల చలువే స్పష్టం చేసిన వ్యవసాయ రంగ నిపుణులు ‘పర్యావరణ మార్పులు, ఆహార బాధ్యత- నైతిక ధోరణులు’పై అంతర్జాతీయ సదస్సు సాక్షి, హైదరాబాద్: ‘అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న వాతావరణ కాలుష్యానికి పేద, వర్ధమాన దేశాల చిన్న, సన్నకారు, మధ్యతరహా రైతులు ఎందుకు బలికావాలి? పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నందుకు పారిశ్రామికాభివృద్ధి చెందిన దేశాలు భరాయించాల్సిన వ్యయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులెందుకు మోయాలి. ఇది నైతికత కాదు. ప్రపంచం నుంచి ఆకలి బాధను తరిమికొట్టేందుకు 2030 వరకు ప్రతి ఏటా 105 బిలియన్ డాలర్ల మొత్తాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంపై ఖర్చు పెడతామన్న మాటకు అభివృద్ధి చెందిన దేశాలు కట్టుబడాలి’ అని పలువురు వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేశారు. ‘పర్యావరణ మార్పులు, ఆహార భద్రత- నైతిక ధోరణులు’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అగ్రి బయోటెక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు యూరోప్, అమెరికా, ఆసియా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రపంచ ఆహార అవార్డు గ్రహీత, సన్హాక్ శాంతి బహుమతి విజేత డాక్టర్ ఎంవీ గుప్తా, ప్రొఫెసర్ మత్తియాస్ కైసర్ (నార్వే), ప్రొఫెసర్ థియో వాన్ డీ శాండీ (నెదర్లాండ్స్), ప్రొఫెసర్ ఇ.హరిబాబు (హైదరాబాద్ యూనివర్శిటీ మాజీ వీసీ), ప్రొఫెసర్ జి.పక్కిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ఆహార అలవాట్లు, ఆహార దుబారా, నైతికత, 2030 నాటికి ప్రపంచం నుంచి ఆకలి, దారిద్య్రాన్ని పారదోలడం వంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతున్నా ఆకలి, పేదరికమనే రెండు ప్రధాన సవాళ్లకు పరిష్కారం కనుగొనడంలో వెనుకబడి ఉందని ఎంవీ గుప్తా పేర్కొన్నారు. వీటికి పరిష్కారం కనుగొనకపోతే ప్రపంచం అశాంతిని, అంతర్యుద్ధాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బహుళజాతి సంస్థలు తమ సామాజిక, కార్పొరేట్ బాధ్యతను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు పేదరికం, మరో వైపు అధిక బరువు... సహజ వనరులను అవసరాలకు మించి వినియోగిస్తున్న తీరుతో ప్రపంచంలో అసమానతలు పెరిగాయని, ఫలితంగా కొందరు తిండికి అల్లాడుతుంటే మరోవైపు అధిక బరువు(ఒబేసిటీ)తో బాధ పడుతున్నారని నార్వేలో బెర్జన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాత్తియాస్ కైసర్ చెప్పారు. వాతావరణ మార్పులకు, ఆహార భద్రతకు పరస్పర సంబంధం ఉందని నెదర్లాండ్స్‌కు చెందిన థియో వాన్ డీ శాండీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మెజారిటీ ప్రజలు మెట్ట వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, వాళ్లకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శుక్ర, శనివారాల్లో కూడా సదస్సు కొనసాగుతుందని ప్రొఫెసర్ పక్కిరెడ్డి తెలిపారు. -
కాలుష్య కోరలకు కత్తెర !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న గ్రేటర్లో పర్యావరణ కాలుష్యం మోతాదు మించుతోన్న ప్రాంతాలపై ఇక నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) దృష్టి సారించనుంది. ప్రస్తుతం పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్ పరిధిలో పర్యావరణ కాలుష్యం అవధులు దాటుతుండడంతో గత కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు, వాయు, జల, ఘన, భూగర్భ కాలుష్యం నమోదవుతున్న తీరుతెన్నులపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను పరిశీలించడంతోపాటు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు, సూచనలు అందజేస్తోంది. ఇక నుంచి ఈ జాబితాలో మరిన్ని ప్రాంతాలు చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న వాయు, జల కాలుష్య నివేదికలను ప్రతి ఆరు నెలలకోమారు సీపీసీబీ నిపుణులు పరిశీలించనున్నారు. సీపీసీబీ పర్యవేక్షణ ఇలా... పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాల్లో జల, వాయు కాలుష్యంపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా రాష్ట్ర పీసీబీకి సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్కారు నుంచి ఈ నివేదికలను స్వీకరించిన సీపీసీబీ నిపుణులు వివిధ కాలుష్య కారకాల మోతాదును మరోసారి ప్రైవేటు ల్యాబ్‌ల సౌజన్యంతో పరీక్షిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ కాలుష్య సూచీ(సెపీ) ఆధారంగా కాలుష్య ఉద్గారాల తీవ్రతను లెక్కగడతారు. దీని ప్రకారం సూచి 55 పాయింట్లు దాటిన ప్రాంతాల్లో అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలుగా, సూచీ 70 దాటిన పక్షంలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తించి ప్రకటిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్య ఉద్గారాల కట్టడికి తీసుకున్న చర్యలు, జీరో లిక్విడ్ డిశ్ఛార్జీ(తక్కువ కాలుష్యం విడుదల)కు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలు, సూచనలు సీపీసీబీ అందిస్తుంది. ఎంత మోతాదులో.. గతంలో పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్పరిధిలో సూచీ 70.07గా నమోదైనట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరోవైపు కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ సూచీ 55 పాయింట్లకు మించి నమోదయ్యేఅవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నాయి. తాజాగా రూపొందించే నివేదిక ఆధారంగా ఆయాప్రాంతాల్లో ఎంత మోతాదులో కాలుష్యం నమోదవుతుందో తెలుస్తుందని వెల్లడించాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. -
సిమెంట్ పరిశ్రమలకు కఠిన నిబంధనలు!
కాలుష్య కారక పరిశ్రమల్లో సిమెంట్ రంగం ‘కంప’ నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే రెండు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలి సాక్షి, హైదరాబాద్: వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న 17 రకాల్లో ఒకటైన సిమెంట్ పరిశ్రమలకు కాలుష్య నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్టు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. పరిశుభ్రమైన పర్యావరణం కోసం నిబంధనలను మరింత ఆధునీకరించనున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అటవీ శాఖ కార్యక్రమాల సమీక్ష కోసం వచ్చిన మంత్రి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘గ్రీన్ ఇండియా, క్లీన్ ఇండియా’ (పచ్చని, పరిశుభ్ర భారతం) తమ ప్రభుత్వ నినాదమని తెలిపారు. 280 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలు వదిలే దుమ్ము,ధూళితో వాతావరణం బాగా కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అమలు పర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘విధ్వంసం లేని అభివృద్ధి, మానవజాతి వికాసం’ తమ ఉద్దేశమని ప్రకటించారు. కంప నిధుల్లో 95 శాతం రాష్ట్రాలకే... పర్యావరణ అభివృద్ధిలో భాగంగా ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నిధుల నిర్వహణ, ప్రణాళిక సంస్థ (కంప) నిధుల్లో 95 శాతాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించిందని, ఈ మేరకు నియమ నిబంధనలతో ముసాయిదాను రూపొందిం చామని జవదేకర్ తెలిపారు. అభివృద్ధి పథకాల కోసం వంద ఎకరాలలోపు అటవీ ప్రాంతాన్ని ఇచ్చే అధికారాన్ని ఇకపై ప్రాంతీయ సాధికారిక కమిటీలే చూస్తాయని చెప్పారు. మైనింగ్, ఆక్రమణల క్రమబద్ధీకరణ, జల విద్యుత్ ప్రాజెక్టులకు స్థలాలు ఇచ్చే విషయాన్ని మాత్రమే కేంద్ర పర్యావరణ శాఖ చూస్తుందని తెలిపారు.