కేరళలో నిషేధంతో... టయోటా పునరాలోచన!
న్యూఢిల్లీ: వాతావరణ కాలుష్యం దృష్ట్యా కేరళలో 2000 పైగా సీసీ సామర్థ్యం గల వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయడంతో జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టయోటా పునరాలోచనలో పడింది. సంస్థ ఉపాధ్యక్షుడు, హోల్ టైం డెరైక్టర్ శేఖర్ విశ్వనాథన్ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘మా వాదనలు వినకుండా సహజ న్యాయ సిద్ధాంతానికి విరుద్ధంగా ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. మా కంపెనీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ నిషేధం విధించారు’’ అని ఆయన ఆరోపించారు. గత డిసెంబర్‌లో సుప్రీం వె ల్లడించిన తీర్పు ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో(ఎన్‌సీఆర్) తమ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింద న్నారు.
‘‘నిషేధించాలనుకుంటే అన్ని రకాల డీజిల్ వాహనాలనూ బ్యాన్ చేయాలి. కానీ 2000 సీసీ సామర్థ్యం ఉన్న వాటినే ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ భారతలో మా సంస్థ కార్యకలాపాలు నిలిపివేస్తే దాదాపు 25 వేల మంది ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుంది? హేతుబద్ధత లేకపోతే భారత్‌లో పెట్టుబడులతో కొత్త న మూనాలను తయారు చేసేందుకు ముందుకెవరొస్తారు?’’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. కంపెనీ కొత్త ఉత్పత్తి ఇన్నోవా క్రిస్టాతో సంతృప్తిగా ఉన్నామని, కానీ కేరళ, ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో నిషేధం పట్ల అసంతృప్తిగా ఉందని చెప్పారాయన. కేరళలో టయోటా కిర్లోస్కర్ గ్రూపు కలిసి సంయుక్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ప్రజా రవాణా, స్థానిక అధికారుల వాహనాలు మినహా 2000 సీసీ, పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలపై తిరువనంతపురం, కొచ్చితో సహా ఆరు ప్రధాన నగరాలలో ఎన్జీటీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.