
ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు
న్యూఢిల్లీ : నానాటికీ పెరిగిపోతున్న గాలి కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో చాలామంది ప్రొఫెషనల్స్ ఢిల్లీని వీడి దక్షిణ భారతదేశ ప్రాంతాలకు వలస వస్తున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దినపత్రికలో కథనం వెలువడింది. కాలుష్యం కారణంగా కుటుంబపరమైన సమస్యలతోనే ఢిల్లీ వాసులు బెంగళూరు, గోవా, హైదరాబాద్‌లకు తరలివెళ్తున్నట్లు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల రిపోర్టులు చెబుతున్నాయి.
ఏడాదిన్నరగా ఢిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడంతో ఎక్కువమంది ప్రొఫెషనల్స్ పిల్లలు, తల్లిదండ్రులు స్మాగ్ కారణంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీంతో సొంత ఇళ్లను అమ్ముకుని మరీ దక్షిణాది ప్రాంతాలకు వారు వలస వస్తున్నారు. దక్షిణ భారతదేశంలో గ్రీనరీతో పాటు గాలి నాణ్యత అధికంగా ఉంటుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.