సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న గ్రేటర్‌లో పర్యావరణ కాలుష్యం మోతాదు మించుతోన్న ప్రాంతాలపై ఇక నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) దృష్టి సారించనుంది. ప్రస్తుతం పటాన్‌చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్ పరిధిలో పర్యావరణ కాలుష్యం అవధులు దాటుతుండడంతో గత కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు, వాయు, జల, ఘన, భూగర్భ కాలుష్యం నమోదవుతున్న తీరుతెన్నులపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను పరిశీలించడంతోపాటు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు, సూచనలు అందజేస్తోంది.
ఇక నుంచి ఈ జాబితాలో మరిన్ని ప్రాంతాలు చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూకట్‌పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న వాయు, జల కాలుష్య నివేదికలను ప్రతి ఆరు నెలలకోమారు సీపీసీబీ నిపుణులు పరిశీలించనున్నారు.
సీపీసీబీ పర్యవేక్షణ ఇలా...
పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాల్లో జల, వాయు కాలుష్యంపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా రాష్ట్ర పీసీబీకి సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్కారు నుంచి ఈ నివేదికలను స్వీకరించిన సీపీసీబీ నిపుణులు వివిధ కాలుష్య కారకాల మోతాదును మరోసారి ప్రైవేటు ల్యాబ్‌ల సౌజన్యంతో పరీక్షిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ కాలుష్య సూచీ(సెపీ) ఆధారంగా కాలుష్య ఉద్గారాల తీవ్రతను లెక్కగడతారు.
దీని ప్రకారం సూచి 55 పాయింట్లు దాటిన ప్రాంతాల్లో అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలుగా, సూచీ 70 దాటిన పక్షంలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తించి ప్రకటిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్య ఉద్గారాల కట్టడికి తీసుకున్న చర్యలు, జీరో లిక్విడ్ డిశ్ఛార్జీ(తక్కువ కాలుష్యం విడుదల)కు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలు, సూచనలు సీపీసీబీ అందిస్తుంది.
ఎంత మోతాదులో..
గతంలో పటాన్‌చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్‌పరిధిలో సూచీ 70.07గా నమోదైనట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరోవైపు కూకట్‌పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ సూచీ 55 పాయింట్లకు మించి నమోదయ్యేఅవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నాయి. తాజాగా రూపొందించే నివేదిక ఆధారంగా ఆయాప్రాంతాల్లో ఎంత మోతాదులో కాలుష్యం నమోదవుతుందో తెలుస్తుందని వెల్లడించాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి.
కాలుష్య కోరలకు కత్తెర !
Published Tue, Mar 17 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement
Advertisement