
బడుల నల్లడబ్బు తెల్లనా?
విశ్లేషణ
ప్రైవేటు విద్యకు కూడా పన్నుల మినహాయింపు ఇస్తారు. అలా బడి నల్లడబ్బుకు పుట్టిల్లవుతోంది. లెక్కలేని డబ్బున్న వారు ఎవరినీ లెక్క చేయరు. డబ్బు బలం కన్న నల్లడబ్బు బలం మిన్న. విద్యా దుకాణాల నల్లడబ్బును అడిగేవారే లేరా?
విద్యాసంస్థలు నల్లడబ్బుకు పుట్టిళ్లు కాగలవని ఎన్నడూ ఊహించలేదు. రాజ్యాంగం లోని 19వ అధికరణం కింద వ్యాపార స్వాతంత్య్రం ఉన్నా, విశృంఖల విద్యా వ్యాపారం చేయొచ్చా? అలా చేసేవారికి పన్ను మినహాయింపులు ఎంత వరకు న్యాయం? ఎల్‌కేజీ చదు వుకు భారీ ఫీజుతో పాటు లక్షల రూపాయల డెవలప్ మెంట్ ఫండ్ ‘పన్ను’ చెల్లించక తప్పదా? ప్రతి వస్తు వుకూ ఒక ఉత్పత్తి రేటు, మార్కెట్ రేటు ఉంటుంది, అలా అని బడి అనే దుకాణం, చదువు అనే వస్తువుకు ఎంత రేటైనా పెట్టవచ్చా? జనం నోరు మూసుకుని అంత రేటు పెట్టి చదువు‘కొన’వల్సిందేనా?
ఫీజుకు రసీదిస్తారేమోగాని ‘విరాళా’నికి అదీ ఇవ్వరు. ఒక మిత్రుడు రూ. 1.25 లక్ష డొనేషన్ ఇచ్చి తన కొడుకును ఒకటో తరగతిలో చేర్పించాడు. ఉద్యోగ రీత్యా కుటుంబంతో సహా వేరే దేశానికి తరలిపోవాల్సి వచ్చి.. ఫీజు తిరిగి ఇవ్వమంటే, లేదు పొమ్మన్నారు. లెక్కలకెక్కని ఈ సొమ్మును వాపస్ ఇప్పించడం కోర్టు లకు కూడా సాధ్యం కాదు. విద్యను సేవగా భావించి పన్నుల మినహాయింపు ఇస్తారు. అలా బడి నల్లడబ్బుకు పుట్టిల్లవుతుంది. లెక్కలేని డబ్బున్నవారు ఎవరినీ లెక్క చేయరు. డబ్బు బలం కన్న నల్లడబ్బు బలం మిన్న. చదువు దుకాణాల నల్లడబ్బును అడిగేవారే లేరా? పిల్లల తల్లిదండ్రులు వారి చదువుకోసం ఎంత డబ్బ యినా ఖర్చు చేయవలసిందేనా? ఈ పరిస్థితిని కల్పించే విద్యా విధానం రాజ్యాంగ సమ్మతమా?
అఖిల భారత తల్లిదండ్రుల సమావేశం మార్చి 2016లో ఢిల్లీలో జరిగింది. ప్రైవేటు బళ్లు గోళ్లూడగొట్టి వసూలుచేసే ఫీజులను క్రమబద్దీకరించాలని అవి డిమాండ్ చేశాయి. మైనారిటీ స్కూళ్ల స్వేచ్ఛ మరీ ఎక్కువ. మైనారిటీ మత స్వేచ్ఛ పేరిట వారు చదువుల వ్యాపారాలను విశృంఖలంగా చేసుకోవచ్చా? చదువుల దుకాణీకరణను అఖిల భారత సభ వ్యతిరేకించింది. బ్రిటన్ మనకిచ్చి పోయిన చెత్త చట్టాలను వారు మార్చు కున్నా, మనం పట్టుకుని వేళ్లాడుతున్నాం. అంతేగానీ, నేడు బ్రిటన్ ప్రభుత్వ విద్యాసంస్థలపైన అధికంగా ఖర్చు చేస్తుండటాన్ని ఆదర్శంగా తీసుకోం.
మన దేశంలో సర్కారీ విద్య మనసులేని అధి కారుల దుర్మార్గ పాలనలో మగ్గిపోతున్నది. పుట్ట గొడుగుల్లా ప్రైవేటు విద్యావ్యాపార సంస్థలు పుట్టుకొస్తు న్నాయి. సమగ్ర విద్యావిధానం మృగ్యం. కేంద్రం లోనూ, రాష్ట్రాల్లోనూ సర్కారీ బళ్లను సక్రమంగా చేయ డానికి, ప్రైవేటు బళ్లను క్రమబద్దీకరించడానికి చట్టాలు రావాలని 18 రాష్ట్రాల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్కరణలకు మూడు బిల్లు లను ఆమోదించింది. కాని అది కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్ల ఢిల్లీ శాసనసభ కన్న ఎక్కువ అధికారాలు కేంద్రానికి ఉంటాయి. దీంతో అవి నిలిచిపోయాయి. కాని ప్రైవేటు బడుల వ్యయాలు, వసూళ్లపైన సర్కారీ సమీక్షాధికారంపైన ఒక ఆలోచన మొదలైంది. అయితే మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు ఇటువంటి చట్టాలే తెచ్చాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అసోం, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి డిమాండ్ మొదలైంది.
సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు విద్యను లాభ సాటి వ్యాపారంగా పరిగణించరాదని, అదొక వృత్తి, సమాజసేవని వివరించింది. వినే వారెవరు? 2002 టీఎంఏ పాయ్ ఫౌండేషన్ కేసులో లాభాపేక్షను అదుపు చేసే యంత్రాంగం ఉండాలని, సమంజసమైన మిగు లును మాత్రమే అనుమతించాలని సుప్రీంకోర్టు సూచిం చింది. తరువాత ఈ మిగులుపైన రకరకాల వ్యాఖ్యా నాలు వచ్చాయి. మిగులు మళ్లీ లాభంగా మారి వ్యాపా రం ఉధృతమైంది. 2005 పీఏ ఇనాందార్ కేసులో చదువుల దుకాణాల దురాశను నియంత్రించాలని నిర్దా రించింది. స్వతంత్రం, సమంజసమైన మిగులు సూత్రా లను సమర్థిస్తూనే మాడర్న్ స్కూల్ కేసు(2016) లో సుప్రీంకోర్టు చదువుల దుకాణీకరణను నిరోధించా లన్నది. ఢిల్లీలో ప్రభుత్వం తగ్గింపు ధరకు ఇచ్చిన భూముల్లో బడులు పెట్టిన ప్రైవేటు సంఘాలు ఫీజు పెంచే ముందు విద్యాశాఖ సంచాలకుల అనుమతి తీసు కోవాలని షరతు విధించిన డీడీఏ, ఆ షరతును అమలు చేయాలని ఆదేశించింది. పెంచిన ఫీజులను తగ్గించి, తిరిగి చెల్లింపజేయాలని ఢిల్లీ సర్కారును నిర్దేశించింది.
పెంచిన ఫీజును తిరిగి ఇప్పించేందుకు తమిళనాడు తెచ్చిన చట్టాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఇటువంటి సందర్భంలోనే రాజస్తాన్ హైకోర్టు అందరికీ ఒకే ఫీజు నిర్ధారణపై విభేదించింది. ఫీజులను తల్లి దండ్రులు, టీచర్లు భాగస్వాములుగా ఉన్న కార్యవర్గ కమిటీ ఆమోదించాలని మహారాష్ట్ర చట్టం తెచ్చింది. లేక పోతే ఆ వ్యవహారాన్ని జిల్లా స్థాయి కమిటీ పరిశీలించా లని 2014లో చట్టం వివరించింది. బడుల యజమా నులు రకరకాల నిరసనలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వలె బడులన్నీ తమ రాబడులు, చెల్లింపులకు లెక్కలు చెప్పేలా చేసే శాసనం కూడా తేవలసి ఉంది.
(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్
ఈ–మెయిల్: professorsridhar@gmail.com )