70 ఏళ్ల కిందట మన రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చిన రోజు నవంబర్ 26, 1949. ‘‘వి ద పీపుల్..’ మనం రూపొం దించుకుని మనకే సమర్పించుకున్న ఒక పరిపాలనా నియమావళి. మనకు ప్రాథమిక హక్కులు వచ్చిన రోజు. 70 ఏళ్ల తరువాత మనం ఆ సంవిధానం సక్రమంగా అమలు చేసుకుంటున్నామా లేక నియమాలన్నీ ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నామా అనేది జనం తేల్చుకోవాల్సి ఉంది. రెండు నెలల తరువాత ఆ సంవిధానం అమలు కావడం ప్రారంభమైన గణతంత్ర దినోత్సవం జనవరి 26. మన దేశం మరిచిపోలేని రోజు. కాని అనుకున్నంత గొప్పగా మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లలేదు.
పోలీసులకు నేర పరిశోధన చేసేందుకు కావలసిన అధికారాలన్నీ ఉన్నాయి. నేరస్తుడనుకుంటే, నేరం చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిసి కూడా చెప్పలేదనుకుంటే అరెస్టు చేయవచ్చు. బంధించవచ్చు. కాని అమాయకుడిని అన్యాయం అరెస్టు చేస్తే? అతడిని ఎందుకుబంధించారో కారణాలు లేకపోతే ఎందుకు అరెస్టుచేసారో చెప్పకపోతే అది సమాచారం సమస్యా లేక, జీవన స్వేచ్ఛ ఉల్లంఘనా? లేక జీవితానికి సంబంధించిన విషయమా? జీవించే హక్కు ఉందని గ్యారంటీ ఇచ్చానని చెప్పుకునే సంవిధానం ఏమైపోయినట్టు? రాజ్యాంగ అధికరణం 21 ఉన్నట్టా లేనట్టా? జోగిం దర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యు.పి (1994) 4 ఎస్సిసి 260 కేసులో అరెస్టు చేయడమంటే సరైన సంతృప్తికరమైన సమంజసమైన కారణాలు, సమర్థ నీయమైన పరిస్థితులు ఉంటేనే అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు వివరించింది.
మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో అనుసరించవలసిన నియమాలను సుప్రీంకోర్టు వివరించింది. అరెస్టు లేదా ఇంటరాగేట్ చేసే విధినిర్వహించే పోలీసు అధికారి అతని పేరును హోదాను గుర్తింపచేసే బిళ్లను ధరించాలి. ఒక రిజిస్టర్ లో ఆ అరెస్టుకు సంబంధించిన వివరాలను, అరెస్టు కాబడుతున్న వ్యక్తి వివరాలు నమోదుచేయాలి. అరెస్టు అయిన వ్యక్తి వివరాల మెమోతయారు చేయాలి. ఆ మెమోకు బందీ కుటుంబ సభ్యుడు గానీ ఆ ప్రాంతంలోని గౌరవనీయమైన వ్యక్తి గానీ సాక్షిగా సంతకం చేయాలి. ఆ మెమోపైన బందీ సంతకం ఉండాలి. దానిపైన అరెస్టయిన సమయం తేదీ కూడా ఉండాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు.
ఈ తీర్పులో ఉన్న అసలైన హక్కు సమాచార హక్కు. సమాచారం లేకపోతే బతికే హక్కు ఉండదు. వ్యక్తిగత స్వేచ్ఛ బతకదు. అరెస్టు చట్టబద్ధంగా ఉండాలని, చట్టబద్ధం కాని అరెస్టుచేస్తే పరిహారం ఉండాలని ఆర్టికిల్ 21 సారాంశం. ఈ తీర్పులోని అంశాలను నియమాలుగా మార్చి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించారు. అంటే తీర్పు అంశాలన్నీ సమాచార హక్కును ఇచ్చే చట్టబద్దమైన అంశాలుగా మారాయన్నమాట. సం విధానం వచ్చిన నవంబర్ 26 ఎంత గొప్పదో, గుర్తుంచుకోతగిందో అంత గొప్ప రోజు 12 అక్టోబర్ 2005. ఎందుకంటే ఆరోజు సమాచార హక్కు అమలులోకి వచ్చిన రోజు. సమాచారం అధికారుల కబంధ హస్తాలనుంచి బయటకు వచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడింది.
కాని ఈ హక్కుకు 14వ సంవత్సరంలో గండం వచ్చిపడింది. అదే 2019 సవరణ. 12 అక్టోబర్‌ను గుర్తుంచుకొని దినోత్సవాలు చేసుకునే ప్రజలకు మరో పన్నెండు రోజుల తరువాత దారుణంగా గుర్తుంచుకునే చెడురోజును ఈ ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. అదే అక్టోబర్ 24. ఈ రోజున సమాచార హక్కు చట్టాన్ని సవరించి నీరు కార్చి, కమిషన్లను కింది స్థాయి ఉద్యోగులుగా మార్చే నియమాలు అమలు లోకి తెచ్చారు.
కేంద్ర ప్రభుత్వం జనహితమైన మంచి హక్కును ఈ విధంగా నీరు కార్చి సంవిధానానికి అన్యాయం చేసింది. ఇంకా ఈ దెబ్బనుంచి కోలుకోకముందే సుప్రీంకోర్టు సమాచార హక్కు గురించి ప్రతికూలంగా గుర్తుంచుకునే మరో రోజును సృష్టించింది. అదే సమాచార హక్కును మరింత నిస్సారంగా మార్చి, హక్కు పరిధిని కుదించి, పరిమితులు పరిధులను అపరిమితంగా పెంచే తీర్పును ఇచ్చిన రోజు. మన సంవిధానాన్ని మనం రక్షించుకుందామా?
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్,
బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్
ఈ-మెయిల్: madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment