పార్టీని వీడటంతో పాటూ అన్ని పదవులను, హోదాలను వదులుకుంటే చట్టపరంగా గానీ, నైతికంగా గానీ అది తప్పు కాదు. ప్రజా ప్రతినిధులుగా ప్రమాణ స్వీకారానికి ముందే ఫిరాయింపు ఎంత మాత్రం సమంజసం కాదు.
భారత శిక్షాస్మృతిని అనుసరించి ‘ఎక్స్’ అనేవాడు దొంగతనం చేస్తే అది నేరం. ‘సీ’ అనేవాడు అందుకు ప్రేరేపిస్తే అతడు కూడా దొంగతనం చేసినవాడితో సమానమైన నేరస్తుడే. గత 150 ఏళ్లుగా దేశంలో అమల్లో ఉన్న నేర శిక్షాస్మృతి ఇది. దురదృష్టవశాత్తూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధియైన ‘వై’ ఏ ఇబ్బందీ లేకుండా పార్టీ ఫిరాయించగలుగుతాడు. నిజానికి అది చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అయినా అది నేరమూ కాదు, దానికి శిక్షా లేదు. ఏదైనా శిక్షంటూ ఉంటే అది ఫిరాయించిన సభ్యుని అన ర్హత మాత్రమే. అయితే ఆ ఫిరాయింపును ప్రేరేపించిన పార్టీకి లేదా దాని నేతలకు ఆ బెడద సైతం ఉండదు. ఫిరాయింపు రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు ఓటర్ల పట్ల, నామినేట్ చేసిన పార్టీల పట్ల విశ్వాస ఘాతుకత్వానికి పాల్పడటం కూడా.
భారత దేశంలో చట్టాన్నయినా, రాజ్యాంగ చట్టాన్నయినా, కోర్టు తీర్పునయినా, చివరికి ప్రజా తీర్పునయినా దొడ్డిదారిన ఉల్లంఘించడం నేరం కాదు. ఏ కోర్టూ దాన్ని విచారించదు. రాజ్యాంగపరమైన ఉల్లంఘనలకు తీవ్ర పర్యవసానాలను రాజ్యాంగ ం సైతం నిర్దేశించ లేదు.
ఒక రాజకీయ పార్టీ పట్ల అసమ్మతి లేదా విమర్శ లేదా విభేదాల కారణంగా జరిగే ఫిరాయింపుల సమస్య వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశం, అది రాజ్యాంగపరమైన హక్కు. పార్టీని వీడటంతో పాటూ ఆ పార్టీవల్ల సంక్రమించిన అన్ని పదవులను, హోదాలను వదులుకుంటే చట్టపరంగా గానీ లేదా నైతికంగా గానీ అది ఎంత మాత్రమూ తప్పు కాదు. ప్రజా ప్రతినిధులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆ పని చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు.
రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ఫిరాయింపులను పూర్తిగా నిషేధించని మాట నిజమే. కానీ అది ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు వేసే అంశంలో అత్యంత స్పష్టంగా ఉంది. రెండవ పేరా ఇలా చెబుతోంది: ఏ రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడైనాగానీ (గుర్తింపు పొందిన పార్టీ/జాతీయ పార్టీ/ప్రాంతీయ పార్టీ, వగైరా తేడాలను పేర్కొనలేదు) ఆ చట్ట సభ సభ్యత్వానికి అనర్హులు (కావచ్చు కాదు, తప్పనిసరిగా) అవుతారు - (ఏ) అలాంటి రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని ఆ సభ్యుడు స్వచ్ఛం దంగా వదులుకున్నప్పుడు; లేదా (బీ) తాను ఏ రాజకీయ పార్టీకి చెందితే ఆ పార్టీ నిర్దేశించిన మార్గద ర్శకత్వానికి భిన్నంగా సంబంధిత ప్రజా ప్రతినిధుల సభలో ఓటు చేసినప్పుడు లేక ఓటింగ్ కు గైర్హాజరైనప్పుడు. సందేహాల రావులందరికీ సమాధానంలా దీనికి వివరణను కూడా చేర్చారు: సభలోని ఒక ప్రజాప్రతినిధిని ఏ పార్టీ ఎన్నికలలో అభ్యర్థిగా నిలిపితే అతడు ఆ పార్టీకి చెందిన సభ్యుడే అవుతాడు.
‘వై’కి తనకు బీ-ఫారం ఇచ్చి, తమ అభ్యర్థిగా పోటీకి నిలిపిన పార్టీకి చెందినవాడిని కానని అనలేడు. రెండు విధాలుగా అతనిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకటి, రాజీనామా ద్వారా స్వచ్ఛందంగా అతడే సభ్యత్వాన్ని వదులుకోవడం. రెండు, అలాంటిదేమీ లేకుండా శాసనసభ్యునిగా నేరుగా వేరే రాజకీయ పార్టీలో చేరిపోవడం. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది అదే. అనర్హత వేటు పడకుండా ఏ శాసనసభ్యుడూ పార్టీ ఫిరాయించ లేడు.
రాజ్యాంగబద్ధమైన పాలన గురించి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ రాజకీయ పార్టీల చుట్టూనే తిరుగుతుంటాయి. అయినా అందులో ఎక్కడా ‘రాజకీయ పార్టీ’ అన్న భావనే లేదు. 1985లో ప్రవేశపెట్టిన 52వ సవ రణ ద్వారా పదవ షెడ్యూల్ మొదటిసారిగా రాజ్యాంగంలోకి ఆ భావనను ప్రవేశపెట్టింది. ‘గుర్తింపు పొందని’ పార్టీకి చెందిన శాసనసభ్యుల ఫిరాయింపులకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని నేడు కొందరు వాదిస్తున్నారు. 1985కు ముందటి కాలంలో వారు ఈ వాదనను చేయాల్సింది.
గుర్తింపు ద్వారా ఒక పార్టీకి ఓటర్ల జాబితా కాపీని పొందడం, తదితర విశేష హక్కులను కల్పించే ఉన్నత హోదా లభిస్తుంది. వైఎస్సార్‌సీపీ గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి మరణం ఆ నియోజకవర్గంలో ఎన్నికల నిలిపివేతకు దారితీయలేదు. ఒక ఎన్నికల గుర్తును రాష్ట్ర వ్యాప్తంగా తాను మాత్రమే ఉపయోగించుకునే ప్రత్యేక హక్కును పొందగలగడమే ఎన్నికల సంఘం గుర్తింపును పొందినందువల్ల పార్టీకి కలిగే ప్రధాన ప్రయోజనం. ఉదాహరణకు టీడీపీకి కేటాయించిన గుర్తును ఆ పార్టీ అభ్యర్థులెవరికీ ఆంధ్రప్రదేశ్‌కు వెలుపల దాన్ని ఉపయోగించుకునే హక్కు ఉండదు. నిజానికి ఏపీలో టీడీపీ గుర్తే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి ఉంది.
2004 ఎన్నికల తర్వాత 11 మంది టీఆర్‌ఎస్ ఎమ్‌ఎల్‌ఏలు అనర్హతను ఎదుర్కోవాల్సి వ చ్చింది. వారిని అనర్హులను చేయడానికి బదులుగా వారి రాజీనామాలను ఆమోదించారు. ఎలాగైనా జరిగిన ఫలితం ఒక్కటే. పార్టీ ఫిరాయింపుల చట్టం చట్ట సభలలోని స్వతంత్ర శాసనసభ్యులకు, నామినే టెడ్ సభ్యులకు సైతం వర్తిస్తుంది. ఏదైనా పార్టీలో చేరితే వారు కూడా సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం పార్టీలు మారడాన్ని పూర్తిగా నిషేధించ లేదు. ఫిరాయించినవాళ్లపై అనర్హత వేటును వేయడం ద్వారా అది ఫిరాయింపులను నిరోధిస్తుంది, పరిమితం చేస్తుంది. ఒక శాసనసభ్యుడు నిజాయితీగానే ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాలతో విధానాలతో విభేదిస్తే అతనికి ఆ పార్టీ వల్ల లభించిన సభ్యత్వానికి రాజీనామా చేసి మరో పార్టీలో చేరవచ్చు లేదా స్వతంత్రునిగా కొనసాగవచ్చు. ఒక ఎంపీ వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపికై టీడీపీలోకి ఫిరాయించడమే నేడు రేగుతున్న వివాదానికి కేంద్ర బిందువు. వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదనీ, టీడీపీ మాత్రమే ఆ పని చేయగలదనీ ఎన్నికల తర్వాత ఇప్పుడు సదరు ఎంపీ ఓటర్లను ఎలా ఒప్పించగలుగుతారు? ‘అధికారం’ గురించి ఆయన విశ్వాసం తలకి ందులు కావడమే వచ్చిన మార్పు.
చట్టంలో తేవాల్సిన సవరణలు
ఉన్నత సాన్థ మైన స్పీకర్ పదవిలో ఉన్నవారు ఒక రాజకీయ పార్టీకి పరిమితమైన పక్షపాత పూరిత వైఖరులకు అతీతంగా ఉండాలి. కానీ స్పీకర్‌గా ఉండి కొందరు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా చర్యల విషయంలో కాలయాపనకు పాల్పడుతున్నారు. మరికొందరు పాలక పార్టీ ప్రయోజనాలకు తగిన విధంగా ఏ నిర్ణయం తీసుకోకుండానే గడిపేస్తున్నారు. ఫిరాయింపుల చట్టం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగానూ, నైతిక విలువలు లేని రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మల్లా వ్యవహరించే వెన్నెముక లేని స్పీకర్ల చేతుల్లో వక్రీకరణలకు గురికాకుండానూ దాన్ని సవరించడం అవసరం.
- తాము కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన రాజ్యాంగ నిబంధనలను బేఖాతరు చేసి పార్టీ ఫిరాయించినందుకు గానూ దానికదే, తక్షణమే ఫిరాయింపుదారులు అనర్హులైపోవాలి.
- అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోడానికైనా స్పీకర్‌కు నిర్ణీత కాలవ్యవ ధిని నిర్ణయించాలి. కోర్టులు సైతం నెలలోగా విచారణను ముగించాలి.
- పార్టీ ఫిరాయించిన వ్యక్తిని కనీసం రెండు దఫాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా అనర్హుణ్ణి చేయాలి.
- ఫిరాయింపుదారును పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఫిరాయింపును ప్రోత్సహించిన పార్టీని కనీసం ఆ సీటులో పోటీ చేయకుండా అనర్హతను విధించాలి.
- ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్య ద్వారా ఉప ఎన్నికకు కారణమైన సభ్యుడు, అందుకు ప్రేరేపించిన రాజకీయ పార్టీలే ఆ నియోజక వర్గంలో తిరిగి ఎన్నిక జరపడానికి ప్రభుత్వానికి అయ్యే వ్యయాన్ని భరించాలి.
ఫిరాయింపు పచ్చి అవకాశవాదపు రూపం. ఫిరాయింపుదార్లు ఎన్నిక కావడం భారత ప్రజాస్వామ్యానికి, విద్యావంతులైన పౌరులకు సిగ్గు చేటు. ‘నామినేషన్ల ఆఖరు గంటకు ముందు’ వరకు రాజకీయ పార్టీలు తలుపులు బార్లా తెరిచి, చే తులు సాచి ఫిరాయింపుదార్లను ఆహ్వానిస్తుండటం మరింత సిగ్గు చేటు. చట్టసభలకు ప్రతినిధులను ఎంపిక చేయడంలో ఎలాంటి గీటరాళ్లు లేక పోవడం రాజకీయ పార్టీల దివాలాకోరుతనం.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
ప్రొ.మాడభూషి శ్రీధర్
జంప్ జిలానీలపై వేటే
Published Tue, May 27 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement