
సకల వ్యవస్థలకూ నయీమ్ మకిలి
నయీమ్ నయా నాయకుడిగా చెలామణి అయ్యే ఈ రోజుల్లో రామకష్ణారెడ్లు బతకడం సాధ్యమా?
నయీమ్ నయా నాయకుడిగా చెలామణి అయ్యే ఈ రోజుల్లో రామకష్ణారెడ్లు బతకడం సాధ్యమా? నయీమ్ డైరీలను, ఎస్సై చావులేఖను ఎవరైనా తెరిచి చూస్తారా? వీటిని జనం ముందు పెట్టాలి. పారదర్శకతే అవినీతికి విరుగుడు.
నయీమ్ చీకటి రాక్షసాలు, ఉన్నతాధికారులతో అవినా భావ సంబంధాలు పైస్థా యిలో నెలకొన్న భ్రష్టాచా రానికి ఉదాహరణైతే, మెదక్ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్య.. కిందిస్థాయిలో వ్యవస్థీకతమై విస్తరించిన అవి నీతి రాచపుండుకు నిదర్శనం. లంచగొండ్లు ఎక్కువైతే లంచం తీసుకోనివాడు ఒంటరైపోతాడు. ఎక్కువ వసూలు చేసి ఇవ్వాలనే పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆ ఒంటరి చనిపోయాడు. దర్యాప్తు పేరుతో వచ్చిన ఒక డీఎíస్పీ తన పేరున్న చావులేఖను కొట్టేయడానికి ప్రయత్నించడం మరో ఘనకార్యం. ఈ వ్యవస్థ ఒక ఎస్‌ఐని అతని చేతులతోనే హత్య చేసేసింది. ఇటువంటి ఆత్మహత్యలన్నీ ఒకరకంగా హత్యలే.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న పెద్దలు పెంచి పోషిం చిన నయామ్ అనే మాఫియా హంతకుడి వ్యవస్థాత్మక రాక్షసాలు కథలు కథలుగా వార్తల్లో వస్తూనే ఉన్నాయి. కాని ఎస్‌ఐ ఆత్మహత్య మనను కదిలించే సంఘటన. కాని అది రూల్ ఆఫ్ లాను కదిలించిందా? ఇసుక లారీల నుంచి లంచాల వసూలు మామూలుగా మారి పోయింది. ఆత్మహత్యకు కారకులు ఎవరో ఆ చావు లేఖలో స్పష్టంగా ఉంది. ఆత్మహత్యకు వారు కారకులా కారా అనేది ఒక నేర పరిశోధనైతే లంచాల వసూలు ఒక మామూలుగా మారడం తీవ్రమైన పాలనాపరమైన నేరం. దానిపైన విడిగా సమగ్ర విచారణ జరగాల్సిందే. వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం కావలసిందే. పోలీసులే ఇక్కడ నిందితులు. రాజ్యాంగం, నేరన్యాయం, నేర పాలనా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, దానిపైన ప్రజాస్వామ్యపరమైన ఆజమాయిషీ అంతా ధ్వంసమైనట్టే.
ఓడరేవులో ఒక కూలీ హజీ మస్తాన్, చిల్లర దొంగతనాలతో మొదలు పెట్టి ఈ దేశపు తొలి స్మగ్లర్ డాన్‌గా అవతరించి 1955 నుంచి 75 దాకా బొంబాయి చీకటి జగత్తును ఏలుకున్నాడు. విచిత్రమేమంటే ఇప్పటి డాన్‌లంతా అతని శిష్యులే. దావూద్ ఇబ్రహీం అతడి కుడి భుజం. కరీంలాలా, వరదరాజన్ ముదలియార్లు దావూద్ మిత్రులు. వీరు కొన్ని భౌగోళిక ప్రాంతాలు పంచుకుని తమలో తాము కొట్టుకోకుండా ప్రశాంతంగా నేరాలు చేసేవారు. యూసుఫ్ పటేల్ అనే ఒక వ్యాపారి హజీ మస్తాన్‌కు అమ్మిన వెండిలో సీసం కలిపి మోసం చేసాడు. తన నష్టాన్ని పూరించమని మస్తాన్ అడిగాడు. యూసుఫ్ వినలేదు. అతనిమీద హత్యా ప్రయత్నం చేశాడు మస్తాన్. స్మగ్లింగ్‌లో నేర చరిత్ర ఆ విధంగా మోసంతో మొదలైంది. వెండి, బంగారం, డాలర్లు ఈ అధోజగత్తు వారి కరెన్సీ. వారి వ్యవస్థలో రూపాయికి విలువలేదు. తర్వాత జూదం ఆయుధాల స్మగ్లింగ్, మాదకద్రవ్యాల వ్యాపారంతో విస్తరించారు. మస్తాన్‌లు, కరీంలాలాలు ఇప్పుడు లేరు. కాని అటువంటి వారిని పుట్టించే మురికి కేంద్రాలు ప్రతీ నగరంలో పుట్టాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఉన్నతాధికారుల అండదండలతో పెరిగి, నక్సలైట్లనే పేరుతో ఎందరినో చంపడానికి పోలీసుల చేతిలో ఒక ఆయుధంగా మారి, ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిం చిన నయీమ్ తాజా మాఫియా రాజు. ఇదివరకు మాఫి యాల్లో దొంగలే ఉండేవారు, ఇప్పుడు పాలకులు, పోలీ సులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. రెండు రాష్ట్రాల రాజకీయ, పాలనా యంత్రాంగం కన్న బలీయమైన శక్తి వీడు. పాలనా వ్యవస్థలో భ్రష్టాచారం ఇతనికి అసలైన బలం. రాజకీయనేతల దుర్మార్గం ఇతనికి ఆక్సిజన్. పోలీసు ఉన్నతాధికారుల అధికార దురహంకారం, దురాశ నయీం పెరుగుదలకు ఎరువులు.
పాలక, శాసన ఎస్టేట్‌లు, మీడియాతో సహా నాలుగు ఎస్టేట్ లను రియల్ ఎస్టేట్ అవినీతి ప్రలోభపెడుతున్నదని నయీమ్ డైరీ వివరిస్తున్నది. పోలీసులకు, మీడియాకు నెలనెలా జీతాలు, ఖరీదైన బహుమానాలు ఇచ్చినట్టు, జైన్ డైరీలో కన్నా స్పష్టమైన వివరాలు నయీమ్ డైరీలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 30 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎందరో ఎస్‌పీలు, తదితర ఉన్నతాధికారులు, 65 మంది జర్న లిస్టులు నయీమ్ నుంచి నిస్సిగ్గుగా నెలనెలా వేతనాలు అందుకున్నారు. వీళ్లు ప్రజాసేవకులు, ప్రజలకు రిపోర్ట్ చేసే విలేకరులు అంటే నమ్మాలి. నక్సలైట్ నాయకులను చంపినప్పుడల్లా మానవహక్కుల సంఘాల వారు నెత్తీ నోరు బాదుకుంటూ నయీమ్‌ను పోలీసు వర్గాలు కిరాయి హంతకుడిగా వాడుకుంటున్నాయంటే ఎవరూ పట్టించుకోలేదు.
ప్రతి ఇసుక లారీకి పదివేల చొప్పున వసూలు చేసి లక్షలు నెలనెలా చెల్లించడం ఎస్సై రామకష్ణారెడ్డి డ్యూటీ. రోజూ మూడొందల లారీలు తిరుగుతూ ఉంటే ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నట్టు? ఎంత ఇసుక దోచు కుంటున్నట్టు? కానిస్టేబుళ్లే ఇన్‌ఫార్మర్లుగా మారి డీఎస్‌పీ, సీఐల చెవులు కొరుకుతూ ఉంటే వారు ఎస్సై పైన వత్తిడి చేస్తున్నారని ఆరోపణ. ఈ ఎస్సైని తప్పుడు కేసుల్లో ఇరికించే కుట్ర చేస్తున్నారని మరో ఆరోపణ.
ఈ పోలీసుల అవినీతిని ఏ పోలీసులు విచారిం చాలి? నయీమ్ నయా నాయకుడిగా చెలామణి అయ్యే ఈ రోజుల్లో రామకష్ణారెడ్లు బతకడం సాధ్యమా? జైన్ డైరీలు సుప్రీంకోర్టుదాకా వెళ్లి మూసుకుపోయినాయి. నయీం డైరీలను, ఎస్సై చావులేఖను ఎవరైనా తెరిచి చూస్తారా? ఈ రెండూ జనం ముందు పెట్టాలి. పార దర్శకతే అవినీతికి విరుగుడు. నాలుగు ఎస్టేట్‌లను నమ్మలేం. ఐదో ఎస్టేట్ పౌర సమాజం, జనమే ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడాలి.
- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com