ఆయన పేరు బారు పాండురంగ విఠల్. ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ రామనర్సు పుత్రుడు. ప్రముఖ రచయిత సివిల్ సర్వెంట్ సంజయ్ బారు తండ్రి. తన 93 ఏట తుది శ్వాస విడిచేదాకా దేశం జాతి ప్రజ అని ఆలోచించిన బారు పాండురంగ విఠల్ ఈ దేశ ఆర్థిక రంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రం మరిచిపోలేని మహనీయుడు. దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కార్యదర్శి (1972–82). ఒక ముఖ్యమయిన రాజ్యాంగ సంస్థగా ఆర్థిక సంఘం గుర్తింపు పొంది పనిచేసే రోజుల్లో ఆయన పదో ఆర్థిక సంఘం సభ్యుడు (1992–94). తను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఉన్నపుడు సభ్యుడిగా విశేష సేవలందించిన విఠల్‌ను ది మెమోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కాసుబ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం పూర్వాపరాలు, లోపాలు లాభాలు, తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్నీ కంఠతా తెలిసిన వ్యక్తి, వివేకవంతమైన పరిష్కారాలు చూపగల మేధావి.
‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిపిఆర్ విఠల్’ అని ఆయన శిష్యులు ప్రచురించిన 550 పేజీల ఉద్గ్రం«థం ఆయన వ్యక్తిత్వానికి సమగ్రమైన దర్పణం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వై వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక వేత్త విఠల్‌ను గురువుగా గౌరవించేవారు. ఆర్థికరంగం, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, భౌతికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం, రాజకీయశాస్త్రం వంటి అనేక రంగాలలో సమగ్రమైన అవగాహన, ఆలోచనలు ఉన్న మేధావి విఠల్ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒక గురువు, శ్రేయోభిలాషి, తనను అభిమానించే ఒక ఉత్తముడిని కోల్పోయానని బాధపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అనే సంస్థకు రూపకల్పన చేసి, నెలకొల్పి, నిలబెట్టిన దార్శనికుడు విఠల్. బోధన పరిశోధన కలిసి సాగాలనే ఉద్దేశ్యంతో విఠల్ ఈ సంస్థను తీర్చిదిద్దారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు నివాళులర్పించారు.
గాంధీ ప్రభావంతో విద్యార్థిగా తన కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర వీరుడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే అయినా తెలంగాణలో స్థిరపడి, హైదరాబాద్‌లో ఉర్దూ మీడియం బడిలో చదువుకున్నాడు. నిజాం కాలేజి విద్యార్థి. 1949లో సివిల్ సర్వీసులో చేరి 1950లో ఐఏఎస్ అధికారి అయినారు. బారు పాండురంగ విఠల్ తండ్రి ప్రొఫెసర్ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ తరువాత రామనర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆకాలంలో రావాడ సత్యనారాయణ వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. వీరు ఇరువురు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర మేధావులు. వారి చిత్తశుద్ధి, జనసంక్షేమపరమైన ఆలోచనలు సాటిలేనివి.
తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడం సరైన ప్రయోగం కాదని, అందువల్ల తెలం గాణ చాలా నష్టపోతుందని ఆనాటి రోజుల్లోనే వ్యతిరేకించిన ఆర్థిక శాస్త్రవేత్త విఠల్. వందల కోట్ల రూపాయల మిగులు ధనం ఉండిన సంపన్నరాష్ట్రం తెలంగాణ. అప్పట్లో పన్నుల ఆదాయం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో ఈ విలీనం సరైన చర్య కాదని ఆయన వివరించేవారు. అంతే కాదు 1969లో తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణకు ఏవిధమైన అన్యాయాలు ఎదురైనాయో రుజువులతో సహా అంకెలన్నీ జనం ముందుంచిన చిత్తశుద్ధి కలిగిన అధికారి. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం అయిదు సూత్రాల పథకాన్ని రూపకల్పన చేసింది బీపీఆర్ విఠల్ గారే. అయితే పెద్దమనుషుల ఒప్పందం లాగే దీన్ని కూడా పాలకులు చెత్తబట్టలో వేశారు. ఆ తరువాత ఆయనే ఆరుసూత్రాల పథకం కూడా కల్పించారు. దానికి కూడా గండి కొట్టారు.
1984లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినపుడు కూడా తెలంగాణకు న్యాయం చేయడానికి ఎన్‌టీ రామారావును ఒప్పించి 610 జీవో తెచ్చిన ఉత్తముడు, చేతులెత్తి మొక్కాల్సిన వ్యక్తి విఠల్ అని ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రశంసించారు. అయితే చంద్రబాబునాయుడు పాలనలో తెలంగాణ వ్యతిరేక రాజకీయాలకు ఆ 610 జీవో కూడా బలైపోయింది. 1994లో తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. అప్పుడు తెలంగాణ మిగులు నిథులు ఎన్నో ఉండేవి. అవేమయ్యాయి? అని సవాలు చేస్తూ ఒక పుస్తకం రాశారు విఠల్. ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక అధికారిగా అనేక ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం అయినప్పుడు తెలంగాణా వేర్పాటు ఉద్యమం సరైనదని భావించి ఉద్యమానికి మద్దతు నిచ్చిన ఉన్నతమైన వ్యక్తి బీపీఆర్ విఠల్. గుడ్డిగా ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ రాజకీయనాయకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు తల ఊపడం కాకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తపన ఉన్న కొందరు సివిల్ సర్వీసు అధికారుల్లో బీపీఆర్ విఠల్ ముఖ్యులు.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment