ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే | CIC Madabhushi Sridhar writes on NGOs | Sakshi
Sakshi News home page

ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే

Published Fri, Jul 14 2017 1:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే

ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే

విశ్లేషణ
ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్‌ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది.

జమ్మూకశ్మీర్‌లోని ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) రాజీవ్‌ గాంధీ జాతీయ బాలల పోషక పథకం కింద కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు నుంచి సాయం పొందుతున్నదనీ, ఆ సంస్థ వివరాలు కావాలని అశోక్‌ కుమార్‌ ఆర్టీఐ కింద కోరారు. ఆ ఎన్జీవో రిజిస్ట్రేషన్‌ ప్రతి, పాన్‌ (ఆదాయపు పన్నుకు సంబంధించిన గుర్తింపు) కార్డు, ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 12ఎ ఎ, రిజిస్ట్రేషన్, 80జి రిజిస్ట్రేషన్, మేనేజింగ్‌ కమిటీ సభ్యుల పేర్లు, వారి ఆదాయవ్యయాల వార్షిక నివేదికలు, ఆదాయం పన్ను అంచనా వివరాలను అడిగారు. ఈ సమాచారం మూడో వ్యక్తికి చెందినదంటూ డిప్యుటీ డైరెక్టర్‌ అందుకు నిరాకరించారు. ఆ రాష్ట్రంలో ఎన్నో ఎన్జీవోలు ఆదాయం పన్ను రిటర్న్‌లను దాఖలుచేయడం లేదనీ, వాటి ఆదాయం పన్ను మదింపు ఎలా జరుగుతున్నదో తెలియడం లేదని, ఆదాయం పన్ను చట్టం సవరణ తరువాత సంస్థలు రూ. 2,000 కన్నా ఎక్కువ డబ్బును నగదు రూపంలో విరాళంగా తీసుకోవడానికి వీల్లేదు. వారు తీసుకున్న విరాళాల వివరాలను ఇవ్వాలని దరఖాస్తుదారు కోరారు. ఆయన అడిగిన సమాచారం మూడో వ్యక్తి సమాచారం ఎందుకయిందో, అది వ్యక్తిగత సమాచారమే అయినా అందులో ప్రజాప్రయోజనం ఉందో లేదో విచారించారా? అనే అంశాలపై∙ప్రజా సమాచార అధికారి ఏ వివరణా ఇవ్వలేదు.

ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికి «థర్డ్‌ పార్టీ అనే సాకును ప్రభుత్వ విభాగాలు విరివిగా వాడుకుంటూ ఎడా పెడా పీఐఓలను నిరాకరిస్తున్నారు. ఐటీ రిటర్న్‌లు తప్ప అశోక్‌ కుమార్‌ అడిగిన ఏ సమాచారమూ ప్రైవేటుది కాదు. ప్రజాప్రయోజనం ఉంటే ఐటీ రిటర్న్‌లను కూడా వెల్ల డించాలని ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 138 (1)(బి) వివరిస్తున్నది. అదే విధంగా ఆర్టీఐ చట్టం కూడా సెక్షన్‌ 8(1)(జె)లో మినహాయింపు కూడా వివరిస్తున్నది. ప్రజాప్రయోజనం ఏదైనా ఉందా లేదా అనేదాన్ని పరిశీలించాల్సిన బాధ్యతను ఆదాయం పన్ను అధికారిపైన, ఆర్టీఐకింద పనిచేసే ప్రజాసంబంధ అధికారిపైన ఉందని ఈ రెండు చట్టాలు నిర్దేశిస్తున్నాయి.

విదేశీ ఎన్జీవోల కార్యకలాపాలు దేశ ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతున్నాయని ఇటీవల పలు ఇంటెలిజెన్సు బ్యూరో నివేదికలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్‌ 2016లో ఒక కేసు విచారణ సందర్భంగా ఎన్జీవోల జవాబుదారీని శాసించే చట్టమేదీ లేదని, వాటిని నియంత్రించే చట్టాన్ని చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదని అన్నారు. 30 లక్షల ఎన్జీవోల ఆదాయవ్యయాల లెక్కలను కనీసం మార్చి 31, 2017 వరకైనా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ కేహర్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఎన్జీవోల నియంత్రణకు మార్గదర్శకాలనైనా కనీసం రూపొందించాలని ఇటీవల సూచిం చింది. ఈ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారుచేసింది. నీతి ఆయోగ్‌ అంతర్జాల వేదికలో, ఎన్జీవో దర్పణ్‌ అనే పోర్టల్‌ రిజిస్టర్‌ చేసిన ఎన్జీవోలకు మాత్రమే విదేశీ దాతలనుంచి విరాళాలను సేకరించే అనుమతి లభిస్తుంది. ఎన్జీవోల ముఖ్యపదాధికారుల ఆధార్‌ కార్డు నంబర్లు, పాన్‌ నంబర్లు కూడా అందుబాటులో ఉంచాలి. ఈ మార్గదర్శకాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కాని ఈ నియమాలు సరిపోవని అది అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్జీవోలకు అందే ప్రజాధనానికి సంబంధించి అన్ని లెక్కలు చెప్పవలసిన బాధ్యతను చట్టపరంగా నిర్దేశించడానికి పార్లమెంటు ఒక శాసనం చేయాలని భావిస్తున్నది.

ఒకవేళ ఎన్జీవోను ఆదాయపు పన్ను చట్టం కింద రిజిస్టర్‌ చేస్తే ప్రజలకు అది తమ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చెప్పి తీరాలి. అదే విధంగా మినహాయిం పులు ప్రయోజనాలు పొందడానికి సెక్షన్‌ 80జి, 12ఎ ఎ వంటి నియమాల కింద రిజిస్ట్రేషన్‌ చేస్తే ఆ వివరాలు కూడా అందించాల్సిందే. ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్‌ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్జీవోకు పాన్‌ కార్డు ఉందా, వారి ఐటీæ వార్షిక నివేదికలు ఏమిటి అని విచారించవలసిన బాధ్యత కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిపై ఉంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలు, సంస్థలు తమ పాన్‌ కార్డు వివరాలు, ఆదాయంపన్ను రిటర్న్‌లు వెల్లడించాలని సీఐసీ ఇదివరకు ఒక కేసులో నిర్దేశించింది. ఎన్జీవోల ఆదాయం పన్ను నివేదికలను వ్యక్తిగత విషయాలుగా పరిగణించడం న్యాయం కాదు. మూడో వ్యక్తి సమాచారం అనడం సరికాదు. సెక్షన్‌ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంది.
(సీఐసీ, సీఎస్‌ డబ్ల్యూబీ ఓ, ఎ, 2017, 109115 అశోక్‌ కుమార్‌ వర్సెస్‌ సెంట్రల్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ కేసులో 17.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా).


- మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement