నర్సులూ.. డాక్టర్లే ఇప్పుడు మన సైనికులు | Madabhushi Sridhar Writes Guest Column About Doctors Serving For Coronavirus | Sakshi
Sakshi News home page

నర్సులూ.. డాక్టర్లే ఇప్పుడు మన సైనికులు

Published Fri, Mar 27 2020 12:43 AM | Last Updated on Fri, Mar 27 2020 12:43 AM

Madabhushi Sridhar Writes Guest Column About Doctors Serving For Coronavirus - Sakshi

కరోనా రోగులకు చికిత్స చేస్తున్న నర్సులకు, డాక్టర్లకు, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనిక అతిరథ మహారథులకు తేడా లేదు. ఎన్‌కౌంటర్లలో పోలీసులు, యుద్ధంలో సైనికులు గెలిస్తే, పోరాడి మరణిస్తే ఇచ్చే అన్ని సౌకర్యాలు, సహాయాలు వారికి చేస్తామని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ప్రభుత్వాలు వెంటనే డాక్టర్లకు మాస్క్‌లు, రోగులకు వెంటిలేటర్లు, ప్రత్యేక ఐసీయూ గదులు ఏర్పాటు చేయాలి. అసంఘటిత కార్మికులను, పనిచేస్తే తప్ప తినలేని పేదలను ప్రభుత్వం ఆదుకోవాలి. జనం రద్దీ ఏర్పడడానికి దారితీసే తిక్క నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోకూడదు. కరోనా సోకిన రోగులు ఆ విషయం చెప్పుకోవడానికి భయపడుతూ ఎటుపోవాలో తెలియకపోవడం వల్ల వైరస్‌ పెరుగుతున్నదనే సత్యాన్ని పాలకులు గుర్తిం చాలి. డాక్లర్లను ఇళ్లనుంచి ఖాళీ చేయించే అమానుష యజమానుల నుంచి రక్షణ కల్పించాలి. అసలు ఈ రోగాన్ని నిర్ధరించడానికి పరీక్షా పరికరాలు ఉన్నాయా? ఎప్పుడు తెప్పిస్తారో ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి.

కరోనా వైరస్‌ కావాలని ఎవరైనా ప్రయోగించిన విధ్వంసకర బయోలాజికల్‌ అస్త్రమా లేక దానంతట అదే పుట్టుకొచ్చిన ప్రమాదమా చెప్పలేము. సందేహాలు వది లేస్తే వైద్య ప్రముఖులంతా చేతుల నుంచి ముఖం ద్వారా ఈ వైరస్‌ ప్రవేశిస్తుందని చెబుతున్నారు. వైరస్‌ వచ్చే దారులు తెలిసినపుడు, ఆ దారులను మూసివేయడమే మన పని. సోకిన తరువాత పరీక్షించడం, ఆస్పత్రి, సౌకర్యాలు, చికిత్స, మందులు అన్నీ సమస్యలే. ప్రభుత్వాలను, ఆస్పత్రులను నమ్ముకోవడంకన్నా నివారించడం ముఖ్యం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎన్ని కోట్లిచ్చాయి, ఉన్నట్టుండి అష్టదిగ్బంధనం చేస్తే మామూలు మనిషి జీవనమెట్లా గడుస్తుంది అనే ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాలి. తప్పదు. 

అనేకానేక దేశాలు ఈ వైరస్‌పై యుద్ధంలో గెలవలేకపోతున్నాయి. పూర్తిగా ఓడిపోతున్నాయో లేదో తెలి యదు. చైనా ఘన విజయం సాధించానని చెప్పుకుంటున్నది. రెండు, మూడు రోజులుగా కొత్త కేసులు లేవని ప్రకటిస్తున్నది. నిజమైతే విజయమే.  అదో నమ్మకం. అనుకోకుండా విస్తరించిన ఈ వైరస్‌కు చైనా మొదటి బాధితురాలన్న మాట, చైనా ఆ వైరస్‌ను తరిమేసిన మాట కూడా నిజమే అయితే, ప్రపంచానికి తను అనుసరించిన విధానాలను చెప్పి, అనుసరించిన వ్యూహాల వివరాలను, విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు పంచాలి. మానవాళి మనుగడకు అవసరమైన ఔషధాలను, వస్తువులను పేటెంట్‌ లాభాలకోసం ఆపివేసే పెట్టుబడి స్వార్థానికి మేధో సంపత్తి హక్కులలో కూడా అంగీకారం లేదు. కరోనా చికిత్సకు సంబంధించి పేటెంట్‌ హక్కులకోసం కక్కుర్తి పడకుండా మానవజాతిపైన సాగే ఈ మారణ హోమానికి విరుగుడు దొరికింది దొరికినట్టు ప్రపంచానికి తెలియజేయాలి. 

దేశం మొత్తంమీద జనాల కదలికలను నిరోధించడం తప్ప ప్రభుత్వాలు నిజంగా వెంటనే చేయగలిగిందేమీ లేదు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ లైనా అన్ని రవాణా ప్రయాణ సౌకర్యాలను, ఇంటినుంచి బయటకు వెళ్లవలసిన అవసరాలను నిలుపుదల చేయాలన్నారు. ఇది తప్పనిసరి. కరోనా వైరస్‌ అని పత్రికల్లో వీడియోల్లో చూపే చిత్రాలు, ఆ వైరస్‌ జీవి అసలు పరిమాణాన్ని నాలుగు లక్షల రెట్లు పెంచిన తరువాత కనిపించేవి. ఒకే దారంలాగా, ఒక కిరీటంలాగా ఉపరితలం నుంచి చొచ్చుకొచ్చినట్టు కనిపించే ఈ వైరస్‌ ప్రొటీన్‌ చుట్టూ ముళ్లున్నట్టుగా ఉంటుంది. ఉపరితలంపైన క్రౌన్‌ (కిరీటం) వలె ఉంది కనుక కొరోనా అంటున్నారు.

కరోనా వైరస్‌ వంటి ఇతర అంటువ్యాధులు– పందులు, ఇతర పశువులు, గుర్రాలు, పిల్లులు, ఒంటెలు, కుక్కలు, ఎలుకలు, కుందేళ్ల వంటి క్షీరదాలు, పక్షులు, గబ్బిలాలు, తదితర అడవి జంతువుల్లో కనిపిస్తాయని, మూమూలు జలుబు, సార్స్‌ అంటే తీవ్రమైన శ్వాసకోశ బాధ రూపంలో మనిషిలో కూడా ఈ వైరస్‌ ప్రవేశించే ప్రమాదం ఉందని  శాస్త్రజ్ఞులు రాశారు. గబ్బిలం కూడా క్షీరదాల జాతి జంతువు. చైనాలో దేన్నయినా తినే అలవాటుంది. ఈ వైరస్‌ గబ్బిలాలలో పెరిగి, వాటిని తిన్న పాముల్లో ప్రవేశించి, వాటిని (గబ్బిలాలు, పాములు) తిన్న మనుషుల్లో ప్రవేశించిందా లేక ఏదైనా ప్రయోగశాలలోనుంచి బయటపడిందా మనకు తెలియదు.

శ్వాసకోశ మార్గంలో రోగ కారకాలైన మానవ కరోనా వైరస్‌లు 1960 నుంచి కనబడుతున్నాయట. కరోనా వైరస్‌ 229ఇ అన్నారు. సార్స్‌ కొవ్‌ 2003, 2019లో సార్స్‌ కోవ్‌ 2 అన్నారు. కంటికి కూడా కని పించని అతి సూక్ష్మ జీవి కరోనా వైరస్‌ మనం సాధించామనుకుంటున్న ప్రగతిని, శాస్త్ర విద్యను, మొత్తం నాగరికతను, అన్నింటికీ మించి వైద్యశాస్త్రాన్ని సవాలు చేస్తున్నది. కరోనా వైరస్‌ డిసీస్‌ 2019ని కోవిడ్‌ 19 అని పొట్టిగా పిలుస్తున్నాం. 

చైనాలోని హుబేయ్‌ రాజధాని వుహాన్‌లో ఇది బయటపడింది. న్యుమోనియాతో మొదలై శరీరంలోని అన్ని అవయవాలు వైఫల్యంగా పరిణమిస్తుంది. ముందుగా సాధారణ కణంలోని తొడుగులేని భాగపు జీనోమ్‌లో కణ సైటో ప్లాజమ్‌లో కరోనా వైరస్‌ తొడుగుపైన చొచ్చుకు వచ్చిన ముళ్ల వలె ఉన్న ఆకారంతో జొరబడుతుంది. ఎక్కువగా ఈ కణాలు పెరిగిపోయిన వ్యక్తి తుమ్మినపుడు, దగ్గినపుడు బయటకు చిమ్మిన చిన్న తుంపరల ద్వారా మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది. గాలినుంచి రాదు. కలుషితమైన ఉపరితలాన్ని తాకి తరువాత ముఖాన్ని తాకినపుడు కూడా వస్తుంది. తలుపు పిడి, మెట్లపక్క కడ్డీలు, లిఫ్ట్‌ తలుపుల పిడులు, స్విచ్‌లు, వస్తువులు, కాగితాలు, నోట్లు, కూరగాయలు మొదలైన వాటినుంచి చేతికి, చేతినుంచి ముఖానికి, అక్కడినుంచి శరీరంలోకి. ఇది సోకిన మనిషి మలంపైవాలిన ఈగ మరొకరిపై వాలినపుడు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. ఉపరితలాల మీద 72 గంటలు నివసించే ఈ వైరస్‌ పెరిగి లక్షణాలు బయటపడడానికి రెండురోజులనుంచి 14 రోజులు పడుతుంది. 

పరిశుభ్రత, తరచు బాగా చేతులు సబ్బుతో కడగడం, బయటి మనుషులతో మీటర్‌ దూరంలో సంచరించడం, కడగకముందు చేతులతో ముఖాన్ని తాకడం అలవాటు వదిలించుకుంటే సరైన నివారణ. అనుమానితులు తప్ప ప్రతివాడికీ ముసుగులు అవసరం లేదు. మామూలు గుడ్డ కట్టుకున్నా సరిపోతుంది. ఉగాది, శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు, కల్యాణాలు, పారసిటమాల్‌ గోమూత్రం వంటి రుజువుకాని మందుల గురించి జనాన్ని తప్పుదోవ పట్టించకుండా శాస్త్రీయంగా ఆలోచించి అంటువ్యాధి విస్తరించకుండా పారిశుధ్య నియమాలు నిక్కచ్చిగా పాటించడం గురించి ప్రజలకు నాయకులు, మీడియా తెలియజెప్పాలి. జనం కూడా మూర్ఖత్వాన్ని వదులుకోవాలి. కరోనా మతాతీతంగా కులాతీతంగా, పేద ధనిక, రాజకీయ పార్టీ రహితంగా దాడిచేస్తున్నప్పుడు, నాగరికులనుకునే వాళ్లుకూడా ఎదుర్కోవడానికి ఏదో ఒకటి కావాలి కదా?


వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌
బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement