కమిషనర్లు లేకపోవడం విచారకరం
స.హ.చట్టం అవగాహన సదస్సులో మాడభూషి శ్రీధర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టానికి కమిషనర్లు లేకపోవడం విచారకరమని, వారి నియామకానికి ఆ రాష్ట్రాల సీఎంలు చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ తెలిపారు. నోట్లరద్దుతో కోట్లాది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనిపై స.హ.చట్టం ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించింది కేవలం ఐదుగురేనని చెప్పారు. దేశంలోని పౌరులంతా మౌనంగా ఉంటున్నారని, సమస్యలపై ప్రశ్నించినవారే చరిత్ర సృష్టించగలరని సూచించారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో స.హ.చట్టం–2005పై నిర్వహించిన అవగాహన సదస్సుకు శ్రీధర్ ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నీ ప్రజలకు కనిపించేలా డిస్‌ప్లే చేయాలన్నారు. ప్రజా సమస్యలపై అందరూ స్పందించినప్పుడే సుపరిపాలన సాధ్యపడుతుందన్నారు. ఏఏ పనులు చేశారని రాజకీయ నాయకులను ప్రజలు నిలదీసే రోజు రావాలని ఆకాంక్షించారు. నేటికీ ఓటు సరిగా వేయడంరాని ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారన్నారు. స.హ.చట్టంపై అవగాహన లేనివారు చాలామందే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స.హ.చట్టం వికాస సమితి గౌరవ అధ్యక్షుడు కాచం సత్యనారాయణగుప్త, వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.