న్యాయం బదిలీ | Madabhushi Sridhar Article On Judges Transfers | Sakshi
Sakshi News home page

న్యాయం బదిలీ

Published Fri, Sep 13 2019 1:54 AM | Last Updated on Fri, Sep 13 2019 1:54 AM

Madabhushi Sridhar Article On Judges Transfers - Sakshi

ప్రభుత్వానికి సైనిక బలం, బలగం, డబ్బు, ఆయుధాలు.. అన్నిటికీ మించి లక్షల కోట్ల ప్రజాధనంపై పెత్తనం, ఆ డబ్బు ఏవిధంగా ఖర్చు చేస్తున్నారో చెప్పకుండా దాచుకునేందుకు చెప్పనలవి కాని అధికారం ఉంటుంది. ప్రభువులను నియంతలుగా మార్చకుండా ఉండేం దుకే రాజ్యాంగ నియమాలు, పరిమితులు, బాధ్యతలు నిర్మించారు. వీటన్నింటినీ మించిన శక్తి బదిలీ అస్త్రం. నచ్చని వారిని, వారికి నచ్చని చోటికి పంపించే అధికారం పాలకులకు ఉంది. బదిలీ శిక్ష కాదని న్యాయసూత్రాలున్నాయి. కానీ, నేరగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు నీతివంతులైన కింది అధికారులను బదిలీచేయడం శిక్షకాదా?

ఇందిరాగాంధీ హయాంలో కోర్టులు కొన్ని నిర్భయంగా తీర్పు చెప్పాయి. ఆమె పాలనలో తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేశాయి. చట్టవ్యతిరేకమయిన పనులను ఎత్తి చూపాయి. ఆమె ఎమర్జన్సీ విధించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అందరికన్నా సీనియర్‌ న్యాయమూర్తిని నియమించడం సాంప్రదాయం. కానీ ఇందిరాగాంధీ సీనియర్‌ న్యాయమూర్తులు ముగ్గురిని కాదని వారికింద ఉన్న నాలుగో స్థానపు న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఆ ముగ్గురూ తమ న్యాయమూర్తి పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. తమ కన్న జూనియర్‌ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకుని నిలబడే అవమానం కన్నా రాజీనామా చేయ డం సరైన నిర్ణయమని భావించి వారు సర్వీసు వదులుకున్నారు. ఇదొక రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ పాలన ప్రభావం. 

ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి విజయ తాహిల్రమణిని మేఘాలయ ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. మద్రాస్‌ హైకోర్టులో 75 మంది న్యాయమూర్తులు ఉంటారు. మేఘాలయలో చీఫ్‌తో సహా ఇద్దరే ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. అంతపెద్ద కోర్టునుంచి అంత చిన్న హైకోర్టుకు బదిలీ చేయడం కక్ష సాధింపు చర్య కాకపోతే ఎందుకనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కానీ దీనికి జవాబు లేదు. బిల్కీస్‌ బాను కేసులో హత్యలు, అత్యాచారాలు జరిపించిన పదకొండుమందికి శిక్ష పడితే విజయ బాంబే హైకోర్టు న్యాయమూర్తి అప్పీలులో ఖరారు చేసారు. కింది కోర్టు నిర్దోషులని విడుదల చేసిన అయిదుగురు పోలీసు ఉన్నతాధికారులకు, ఇద్దరు డాక్టర్లకు శిక్షలు విధించారు. వారు సాక్ష్యాలను ధ్వంసం చేశారనే నేరాలు రుజువు అయ్యాయని నిర్ధారించారు. ఇది గుజరాత్‌ మతకల్లోలాలకు సంబంధించిన తీర్పు కావడమే ఆమె బదిలీకి కారణమా అని అనుమానాలు వస్తున్నాయి. ఏడాది కిందట ఆగస్టులో ఆమె మద్రాస్‌ హైకోర్టుకు వచ్చారు. ఒక్క ఏడాదిపాటు ఉన్నచోట ఉండనీయండి అని ఆమె పెట్టుకున్న అర్జీని కొలీ  జియం తిరస్కరించింది. అసలు ఆమె  బదిలీకి కారణాలు లేవా? ఉంటే చెప్పడానికి వీల్లేని కారణాలా? కనీసం ఆమెకైనా చెప్పరా?

ఇది వరకు జస్టిస్‌ జయంతి పటేల్‌ను అలహాబాద్‌  హైకోర్టుకు బదిలీ చేశారు. సీనియారిటీ ప్రకారం ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావలసిన వారు. లేదా కనీసం ఒక హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌ కావలసిన వ్యక్తి. ఆయన కూడా తన పదవికి రాజీనామా చేశారు. గుజురాత్‌లో ఇష్రత్‌ జహాన్‌ మరో ముగ్గురి ఎన్‌కౌంటర్‌ కేసులో  సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు జస్టిస్‌ జయంతి పటేల్‌. అంతేకాదు ఆ దర్యాప్తును పర్యవేక్షించారు. ఆ దర్యాప్తులో పెద్ద ఐబీ అధికారుల అసలు నేరాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఒత్తిడులకు లొంగకుండా రాజ్యాంగం ప్రకారం న్యాయ నిర్ణయం చేసినందుకు అన్యాయపు బదిలీ చేయడం కక్ష సాధించడమే అని గుజరాత్‌ బార్‌ విమర్శించింది.

మరో న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్‌ హమీద్‌ ఖురేషిని కూడా గుజరాత్‌ హైకోర్టు నుంచి బొంబాయి హైకోర్టుకు బదిలీ చేశారు. సోహ్రాబుద్దీన్‌ కేసులో అమిత్‌ షాకు సీబీఐ రిమాండ్‌ ఆదేశించారీ న్యాయమూర్తి. గుజరాత్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా ఈ బదిలీని ఖండిస్తూ తీర్మానం చేసింది. అహంకారులైన  పై అధికారులు గుమాస్తాలను బదిలీ చేసినట్టు కొలీజియం హైకోర్టు జడ్జిలను బదిలీ చేయడం రాజ్యాంగం న్యాయమూర్తులకు ఇచ్చిన ప్రాధాన్యతకు, స్వతంత్రతకు భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఖాలిద్‌ అన్నమాటలు గుర్తు చేసుకోవలసిన సందర్భం ఇది.


మాడభూషి శ్రీధర్‌

వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement