భిల్లుల బతుకులతో గుమాస్తాల బంతాట | Madabhushi Sridhar Article On Bhil Tribals In Rajasthan | Sakshi
Sakshi News home page

భిల్లుల బతుకులతో గుమాస్తాల బంతాట

Published Fri, Jun 21 2019 5:22 AM | Last Updated on Fri, Jun 21 2019 5:22 AM

Madabhushi Sridhar Article On Bhil Tribals In Rajasthan - Sakshi

సర్కారీ గుమాస్తాలు, వారిపై అధికారులు ఈ దేశంలో ప్రజల బతుకులను నిర్ణయిస్తున్నారు. వాళ్లకు ఇష్టమైతేనే లేదా డబ్బు ముడితేనే ఫైళ్లు కదులు తాయి. ఆదివాసుల మను గడ మట్టిపాలు చేయడానికి ఈ గుమాస్తాలు ఓ సులువైన మార్గం కనిపెట్టారు. అదే కాగితాలు మాయం చేయడం. అటవీ హక్కుల చట్టం కింద తమకు నివసించే హక్కు ఇవ్వాలని ఆదివాసులు అర్జీ పెట్టుకోవాలి. రుజువులు ఇవ్వాలి. అటవీ హక్కుల కమిటీ పెద్దలు పరిశీలించి దయకలిగితే ఇస్తారు. లేదా తిరస్కరిస్తారు. 60 రోజుల్లో అప్పీలు చేసు కోవాలి. భ్రష్ట గుమాస్తాలు ఏం చేస్తారంటే తిరస్కార ఉత్తర్వు పత్రాలను ఆదివాసులకు చేర్చరు. పంపినట్టు రాసుకుం టారు.

అరవై రోజుల కాల పరిమితి వడిసిపోతుంది. తరువాత అప్పీలు చేసుకోవడానికి వీలుండదు. అంటే శాశ్వతంగా నివాస హక్కులు కోల్పోతారు. ఈ విధంగా దురాక్రమణదారులు ఇంతమంది ఉన్నారండీ అని వీరు సుప్రీంకోర్టుకు ప్రమాణ పత్రాల్లో అంకెలు అతివినయంతో సమర్పిస్తారు. వెళ్లగొట్టకుండా మీరేం చేస్తున్నారు అని న్యాయమూర్తులు కోప్పడి వెంటనే వారిని తరిమేసి మన అరణ్యాల్ని పర్వతాల్ని, పర్యావరణాన్ని రక్షించండి అని ఆదేశిస్తారు. బ్రిటిష్‌ వారి శిక్షణ ఇది. నరనరాల్లో జీర్ణించుకుపోయింది. తరతరాలకు పాకిపోతూ ఉంటుంది.  

రాజస్తాన్‌ అడవుల్లో 61 మంది భిల్లు జాతి జనం శతాబ్దాల నుంచి ఉంటున్నారు. దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెస్తారు. ఎక్కడెక్కడో కాగితాల్లో ఉన్న ప్రస్తావన ఆధారంగా కొన్ని పత్రాలు దేవీ లాల్‌ కష్టపడి సేకరించి తనతోపాటు 61 మంది భిల్లు ఆదివాసుల నివాస హక్కుల క్లెయిమ్‌లు జాగ్రత్తగా అటవీ హక్కుల కమిటీకి పంపారు. ప్రతిస్పందనగా 2015 లో దేవీలాల్‌కు ఇతర భిల్లులకు, ఫలానా తేదీన రమ్మని సమన్లు వచ్చాయి.  

భిల్లులు రమ్మన్న రోజున వెళ్లారు. అధికారులు ఏమీ చెప్పరు. ఆ ఆంగ్లం అర్థం కాదు. వాళ్లు వెళ్లిపోతారు. తరువాత ఏమైందో తెలుసుకొమ్మని భిల్లులంతా దేవీలాల్‌ను పంపారు. ప్రతిసారీ అతను రావడం, వీళ్లు ఫైల్‌ ఈజ్‌ అండర్‌ ప్రాసెస్‌ అని చెప్పడం, ఈయన తిరిగి వెళ్లిపోవడం. 2015 నుంచి 2017 దాకా తిరిగిన తరువాత విసిగిపోయి మళ్లీ పాత కాగితాల దుమ్ము దులిపి కొత్తగా క్లెయిమ్‌లు రాసుకుని దస్తావేజులన్నీ పట్టుకుని దేవీలాల్‌ 61 మంది భిల్లుల బతుకుల కాగితాలని సర్కారు గుమాస్తాలకు సమ ర్పించుకున్నారు. గుమాస్తాలు పిడుగుపాటు వార్త అప్పుడు చెప్పారు. మీ క్లెయిమ్‌లు తిరస్కరించారు కనుక మీరు మళ్లీ క్లెయిమ్‌లు పెట్టుకునే వీల్లేదని. ఎందుకు నిరాకరించారంటే–దానికి జవాబు లేదు.  

ఆర్టీఐ కింద దరఖాస్తులు పెట్టండి అని కొందరు శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. తమ క్లెయిమ్‌ల పైన తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వగలరు అని సమాచార హక్కు కింద భిల్లులు కోరారు. కొన్నింటికి ఫైళ్లు లేవనీ, మరికొన్నింటికి పరిశీలనలో ఉంది అనీ తోచిన జవాబులు ఇచ్చారు సర్కారీ గుమాస్తాలు. మా హక్కుల అర్జీలు తిరస్కరించారంటున్నారు కదా ఆ ఉత్తర్వుల ప్రతులు ఇవ్వండి అని కోరారు. అటవీ చట్టం సెక్షన్‌ 12 (ఎ)(3) ప్రకారం అర్జీ తిరస్కారానికి గురైతే ఆ విషయం వ్యక్తిగతంగా అధికారులు వెళ్లి సంబంధిత దరఖాస్తుదారులకు ఇవ్వాలి. అప్పుడే సకాలంలో వారికి అప్పీలు చేసు కునే వీలుంటుంది. సెక్షన్‌ 12(ఎ)(10)ప్రకారం ఆది వాసుల హక్కుల పత్రాలను తిరస్కరించడానికి కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి.

ఈ రెండు సెక్షన్లను ఉల్లంఘించడం ద్వారా బ్రిటిషు గుమా స్తాలు ఈ దేశ ప్రభువుల స్థాయిలో ఆదివాసుల బతుకులతో బంతాట ఆడుకుంటున్నారు. ఆర్టీఐ కింద దేవీలాల్‌ తదితర భిల్లుల దరఖాస్తులకు ఇచ్చిన జవాబు ఏమంటే ఫైళ్లన్నీ భైరాంస్రోర్ఘర్‌ గ్రామ పంచాయతీకి పంపామని చెప్పారు. భైరాంస్రోర్ఘర్‌ గ్రామ పంచాయతీని ఆర్టీఐ కింద అడిగితే మాకు ఆ ఫైళ్లేవీ రాలేదన్నారు. ఈ విషయాలన్నీ అటవీ హక్కుల కమిటీ వారిని అడిగితే మౌనమే సమాధానం. ఇంతకూ ఆ ఫైళ్లన్నీ ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. కానీ అటవీ అధికారుల కమిటీ మాత్రం మీ హక్కుల పత్రాలు తిరస్కరించారన్నారు. ఆ తిరస్కరణ ఉత్త  ర్వులు ఉన్నాయో లేదో తెలియదు. కారణాలు తెలిస్తే వాటిని ఖండిస్తూ అప్పీలు చేసుకోవచ్చు. తిరస్కరణ ఉత్తర్వులు భిల్లులకు ఇవ్వకుండా మాయచేసి వారి నివాస హక్కులకు శాశ్వతంగా గండికొట్టిన ఈ గుమాస్తాలకు ఏ శిక్షలూ ఉండవు.  

ఆర్టీఐ దరఖాస్తులు వేసే దాకా అటవీ హక్కుల కమిటీలు కూడా ఏర్పాటు చేయలేదు. ఆ కమిటీలు కూడా చట్టాలు, నియమాలకు భిన్నంగా రూపొందించారని తెలిసింది. సబ్‌ డివిజనల్‌ లెవల్‌ కమిటీలో ఎవరిని నియమించాలో వారిని నియమించలేదు. ఆదివాసుల హక్కులను గుర్తించడానికి పార్లమెంట్‌ చేసిన చట్టానికి గండికొట్టడం గుమాస్తాల తెలివి.

వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

madabhushi.sridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement