మనకు ఇప్పుడు మూడు రకాల చెప్పులు, చెప్పుళ్లు. ఒకటి నెత్తుట తడిసిన వలస కూలీ కాలు సొంతూరివైపు వేసిన అరిగిన చెప్పు. రెండోది విలేకరుల సమావేశంలో ఖాళీ నినాదాల చెప్పుడు. మూడోది దివాళా కోరు ఆర్థిక విధానాలకు మూర్ఖ జనం ఇంకా చూపని చెప్పు. మన ఖజానాలు ఖాళీ, నినాదాలు కూడా ఖాళీ. జాన్ హైతో జహాన్ హై తొలి నినాదం. తరవాత జాన్ భీ జహాన్ భీ. పైపైకి జాన్ భీ అన్నారు గాని, ప్రాణం పోతే పోయింది డబ్బు ముఖ్యం అని అసలు అర్థం. లాక్ డౌన్ నీరుగార్చి డబ్బు కరువు తీర్చడానికి మద్యం కట్టలు తెంచారు.
కీలకమైన శాఖలలో సమర్థులను నియమించాలనే శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు. ప్రధానమైన పదవులకు ఎంచుకున్న వ్యక్తులను పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం పట్ల ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. అయినా మూర్ఖశిఖామణులకు అర్థం కావడం లేదు. కరోనా వైరస్ ఆర్థిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. బోలెడు లక్షల కోట్ల ప్రాజెక్టులు మొదలుపెట్టి అప్పులు తెచ్చుకుని చేతులెత్తేసే దుస్థితి. చెప్పుచేతల్లో ఉన్న రిజర్వ్ బ్యాంక్‌ను బతిమాలి బామాలి, వినకపోతే రాష్ట్ర గవర్నర్‌ను తీసేసినట్టు ఆర్బీఐ గవర్నర్‌ను తీసేశారు. ప్రపంచం అంతటా నిపుణులైన ఆర్థికవేత్తలను కేంద్ర బ్యాంకులకు గవర్నర్లుగా నియమిస్తే, భారత దేశం మాత్రం చెప్పిన మాట చేతులు కట్టుకుని వినే అనుయాయిని గవర్నర్ చేసేసింది. రాష్ట్ర పన్నులన్నీ పీకి, జీఎస్టీ పన్ను విధించింది. సంస్కరణ అంటే పన్నులు పెంచడం అనే కొత్త నిఘంటు అర్థం. రాష్ట్రాలు గోల చేస్తే రాష్ట్ర జీఎస్టీ అన్నారు. పన్నుల సంఖ్య తగ్గిస్తాం ఒకే దేశం ఒకే పన్ను అని ఇంకో ఖాళీ నినాదం. మనకు వినపడని నినాదం– పన్నుపన్నుకో పన్ను. కట్టకపోతే తన్ను. అన్నన్ని పన్నులు విధించి కేంద్రం, రాష్ట్రం మునిసిపాలిటీలు పళ్లూడగొట్టి వసూలు చేస్తున్నాయి. పన్నుల్లో ఎక్కువ శాతం కేంద్రం ఒళ్లో వచ్చి పడుతుంది. రాష్ట్రాల వాటాలు ఎప్పుడు బకాయిల్లోనే ఉంటూ ఉంటాయి. మాకు వసూళ్లు కావడం లేదు కనుక ఇవ్వం అంటున్నది కేంద్రం. ఉదా.. మహారాష్ట్ర రెవెన్యూ వ్యయానికి ఒక్క శాతం సాయం చేయాలన్నా 33 వేల 500 కోట్లు ఇవ్వాలి. కానీ, విపత్తు నిధికింద వారికి ఇచ్చింది కేవలం 4,300 కోట్లు. ఆదాయపరంగా అగ్రస్థాయిలో ఉన్న మహారాష్ట్ర గతే అదయితే మిగిలిన రాష్ట్రాలది అధోగతే. ఫైనాన్సియల్ రిస్క్ బిజినెస్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని తీసేసి 2017లో కొత్త చట్టం తెచ్చారు. ఈ ‘సంస్కరణ’ ఏమంటే– ఆర్థిక సంక్షోభం వస్తే కేంద్రానికి గండం గడిచే మార్గాలు ఉన్నాయి కాని రాష్ట్రాలకు లేవు. వీటిని తప్పించుకునే మార్గాలు అంటారు. అంటే లక్ష్యంనుంచి దారి మళ్లే సదుపాయం. కేంద్రానికి జాస్తి, రాష్ట్రాలకు నాస్తి.
అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వం. బకాయిలు ఇవ్వం. పన్నులు, అధికారాలు, చట్టపరమైన శక్తులు అన్నీ కేంద్రీ కృతం చేస్తాం. అధికారాలన్నీ మా కింద ఉన్న కేంద్ర అధికారుల చేతిలో పెడతాం. ముఖ్యమంత్రులంతా దేబిరిస్తూ ఉండాలని కేంద్రం అంటే దాన్ని ఫెడరలిజం అనీ ఆ పాలనను ప్రజాస్వామ్యం అనీ ఎవరూ అనుకోరు. కేరళ పదిహేను సంవత్సరాలకోసం 9 శాతం వడ్డీతో ఆరు వేల కోట్లరూపాయలు కాపిటల్ మార్కెట్ నుంచి అప్పుతీసుకున్నది. రాష్ట్ర జీడీపీ నిష్పత్తిని బట్టి ఇప్పటికే మన రాష్ట్రాల అప్పులు 27.7 శాతం పెరిగాయి. ఇంకా అప్పులు కావాలంటే ఎక్కువ వడ్డీరేటుతో తీసుకోవాలి. పేరుకుపోయిన ఈ అప్పుల భారాన్ని, తరువాత వచ్చే ప్రభుత్వాలు సంబాళించుకోవడం కష్టం. కరోనా సహాయ బాండులనుకొనే అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మరికొన్ని ప్రత్యామ్నాయ అవకాశాలు ఇవ్వాలని రాష్ట్రాలు అడుగుతున్నాయి. లేకపోతే పన్నులు పెంచుకుంటూ పోవడంతప్ప వారికి మరో దారి లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచండి అప్పులు తీసు కుంటా మని రాష్ట్రాలు కోరితే కేంద్రం తన అధికారాలను విపరీతంగా పెంచే బిల్లులను ఆమోదించాలనే షరతు పెట్టింది. భారీనిధులు ఇచ్చినప్పుడు కూడా ఇటువంటి షరతులు పెట్టరు. విద్యుచ్ఛక్తి సంస్కరణల పేరుతో రాష్ట్రాల అధికారాలన్నీ తుడి చిపెట్టి కేంద్రం గుప్పిట్లో పెట్టుకుంటే రేపు కరెంటు వాటా కోరినప్పుడు కూడా చెత్త షరతులు విధిస్తుంది. ఇదే దుర్మార్గమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విమర్శించారు. రుణపరిమితిని రెండు శాతం పెంచితే 20 వేలకోట్లు వనరులు అందుతాయి. ప్రతి రూపాయి వడ్డీతో సహా రాష్ట్రమే చెల్లించాలి. కేంద్రం మెహర్బానీ ఏమీ లేదు. రాష్ట్రాలను మరింత దిగజార్చే విద్యుచ్ఛక్తి చట్టం మార్పులు ఒప్పుకుని, జనం మీద పన్నుల పెంపు మోత మోగిస్తేనే మరో 2500 కోట్లకు ఇస్తామనడం రాష్ట్రాల పాలనా స్వాతంత్య్రాన్ని దెబ్బ తీయడమే అవుతుంది. రాష్ట్రాల ఖాళీ చిప్పల్లో కేంద్రం ఖాళీ ప్యాకేజీ.
కరోనాబూచి చూపి నియంతృత్వాన్ని వ్యవస్థాపితం చేయాలనుకుంటే ఒప్పుకోకుండా విద్యుచ్ఛక్తి కేంద్రీకరణతో సహా కేంద్రం ప్రతిపాదించిన కొత్త షరతులన్నీ ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలు పట్టుబట్టాల్సిందే. తమను మతం పిచ్చిలో మందు మత్తులో ముంచి గెలిచే ఏ పార్టీ కూడా దేశం గురించి ఆలోచించదని జనం తెలుసుకోవాలి. పాలకుల కన్నా ముందు జనం తమ మత మత్తును, మూర్ఖత్వాన్ని వదులుకోవాలి.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
‘అధోగతి’ రాష్ట్రాలకు అధ్వాన్నపు ప్యాకేజీ
Published Fri, May 22 2020 1:02 AM | Last Updated on Fri, May 22 2020 5:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment