విశ్లేషణ
ప్రాణం కాపాడే మందుల ధరలు ప్రజలకు అందుబా టులో ఉంచడానికి. జాతీయ ఔషధ ధరల అథారిటీ గరిష్ట ధరలను నిర్ణయించాలి. నిర్ణీత ధరకు మించి అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అథారిటీ ధరలు నిర్ణయించడం లేదు. జాబితాలో నిజంగా అత్యవసరమైనవి చేర్చడం లేదు. నిర్లిప్తత, నిష్క్రియాపరత్వం వల్ల ప్రయివేటు వైద్యవర్తకుల దోపిడీకి అవకాశం వచ్చింది. ఒక అభా గ్యుడికి గుండెపోటు వస్తే ఫరీదాబాద్ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. స్టెంట్ అమర్చాలన్నారు. ఆస్పత్రి వారే స్టెంట్‌ను లక్షా 26 వేల రూపాయలకు అమ్మారు. స్టెంట్ ప్యాకెట్ బాక్స్‌పై గరిష్ట ధర లేదు. ఎందుకని అడిగితే ప్రభుత్వం స్టెంట్‌ను ఔషధంగా ప్రభుత్వం పరిగణించదు కనుక నియంత్రణ లేదట. జాతీయ ఔషధ ధరల అథారిటీ సేకరించిన వివరాల మేరకు జాబితాలో లేని వస్తువులు, మందులకు ధరలు వేయి శాతం నుంచి రెండువేల శాతం వరకూ పెంచేస్తున్నారు.
మరో వైపు కార్డియో వాస్క్యులార్ రోగాలు పెరుగుతూ అయిదేళ్లలో ఆంజియోప్లాస్టీ చికిత్సలు రెట్టింపు అయ్యాయి. స్టెంట్ పేర రోగులను నిలు వునా దోచుకుంటున్నారు. ఇదో పెద్ద కుంభకోణం. ఏ స్టెంట్ కొనమనాలో వైద్యశాల యజమానులు డాక్ట ర్లను ఆదేశిస్తారు. డాక్టర్ చెప్పారని ఎంత ధరైనా పెట్టి కొంటారు. మార్కెట్‌లో మంచి స్టెంట్ ఎంచుకునే స్వేచ్ఛ గుండె రోగులకు లేదా? ప్రయివేటు వైద్య వర్తకుల స్టెంట్ దోపిడీని అరికట్టేందుకు జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఈ స్టెంట్‌లు చేర్చా లని ఆదేశించాలని కోరుతూ ప్రజాప్రయోజన వాజ్యాన్ని బీరేందర్ సాంగ్వాన్ ఢిల్లీ హైకోర్టులో 2014లో దాఖలు చేశారు. ఆర్టీఐ ద్వారా సాధించిన సమాచార పత్రాల ఆధారంగా ఈ పిల్‌ను రూపొం దించారాయన.
ఈఎస్‌ఐ కార్పొరేషన్ తమ ఆస్పత్రుల్లో స్టెంట్ ఇంప్లాంట్ చేసే సౌకర్యాలు లేవనే నెపంతో రోగు లను ప్రయివేటు వైద్యశాలలకు పంపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సీజీహెచ్‌ఎస్ ధరలను లేదా ఎయిమ్స్ ధరలను మాత్రమే వసూలు చేయాలని నియమాలు ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ఎంత మంది రోగులను ప్రయివేటు ఆస్పత్రులకు పంపారు? వారు ఎంత ధర వసూలు చేశారు? నిర్ణీత ధరలు ఏవి? అని సమాచార హక్కుచట్టం కింద అడిగారు. కోట్ల రూపాయలు ప్రయివేటు ఆస్పత్రులకు చెల్లించే బదులు సొంత ఆస్పత్రుల్లో కావలసిన చికిత్సలు అందించే ఏర్పాట్లు చేయరు. కార్పొరేట్ ఆస్పత్రులకు దోచుకునే అవకాశం ఇస్తున్నారు.
దీని వల్ల ఏటా రూ.1500 కోట్ల చొప్పున 2013 నుంచి 2016 దాకా చెల్లించవలసి వచ్చిందని ఈఎస్ ఐసీలో పనిచేసిన ఒక డాక్టర్ వివరించారు. ఔషధం స్రవించే స్టెంట్‌లను ఇండియాలో 600 నుంచి 2971 డాలర్ల ధర దాకా అమ్ముతున్నారని, అమెరికాలో ఈ స్టెంట్‌లను అంతకు సగం కన్నా తక్కువ ధరకు అంటే సగటున 1200 డాలర్లకు అమ్ముతున్నారని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ పరిశోధనా పత్రంలో వివరించారు. ఈఎస్‌ఐసీవారు సాధారణంగా సీజీహెచ్‌ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. నిజానికి ప్రైవేటు ఆసుపత్రులవారు ఎయిమ్స్ లేదా, సీజీహెచ్‌ఎస్ రేట్లకన్నా రెండున్నర రెట్లు ఎక్కువ ధరకు వసూలు చేస్తున్నారని, అయినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆర్టీఐ వేసిన ఒక డాక్టర్ విమర్శించారు. ఎయిమ్స్ రేటు లేదా సీజీహెచ్‌ఎస్ రేటుతో పోల్చితే మార్కె ట్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ధరలు చాలా ఎక్కువ.
మార్కెట్ లో గరిష్ట ధర కన్న 15 శాతం తక్కువ చార్జి చేయాలని నియమాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈఎస్‌ఐసీ వారు సాధారణంగా సీజీ హెచ్‌ఎస్ రేటునే చెల్లిస్తారని చెప్పారు. పాలనా విధా నాలను సరిచేయడంలో ఆర్టీఐ ప్రజలకు ఒక భూమి కను ఏర్పాటుచేస్తుంది. మొట్టమొదట స్టెంట్ రేటును నియంత్రించాలి. గరిష్ట ధర ఎంతో విస్తృతంగా ప్రజ లకు సులువుగా తెలియజేయాలి. ప్రయివేటు ఆసు పత్రుల గోడల మీద స్టెంట్ గరిష్ట ధర పెద్దగా రాసి ఉండాలి. అంతకు మించిన ధర ఇవ్వద్దనీ, వసూలు చేస్తే ఫలానా వారికి ఫిర్యాదు చేయాలని, మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్ కూడా పెద్దగా రాయాలి.
ఈ విధంగా రాయని వైద్యశాలల లైసెన్సు రద్దు చేయాలి. కేవలం జాతీయ అత్యవసర ఔషధాల్లో ఒకటిగా స్టెంట్‌ను చేర్చకపోవడం, అత్యవసర వస్తు వుల ధరల అథారిటీ ధరలను నిర్దారించకపోవడం వల్ల కోట్లాది రూపాయల అవినీతి ప్రభుత్వ రంగం లోనూ, అదే స్థాయిలో అక్రమార్జన ప్రయివేటు ఆస్పత్రి రంగంలోనూ జరుగుతోంది. దోపిడీకి గుర య్యేది మాత్రం సామాన్య రోగులు, మధ్యతరగతి కుటుంబాల వారు. ఈ విధాన నిర్ణయాలు తీసుకోవ డంలో ఎంత ఆలస్యం అయితే అంత మేరకు రోగుల దోపిడీ జరుగుతూనే ఉంటుంది.
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment