భారీగా ధర తగ్గనున్న మందులు ఇవే..
న్యూఢిల్లీ: మన దైనందిన జీవితంలో ఉపయోగించే కొన్ని మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రై సింగ్ అథారిటీ (ఎన్‌పీపీఎ) తాజాగా నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాంటీబయాటిక్స్, యాంటీఇన్ఫ్‌క్టివ్స్, అనాల్జేసిక్స్, విటమిన్ మందులు, యాంటీఫంగల్ మందులతో కూడిన మొత్తం 100కుపైగా మందుల రేట్లు 3 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో గత ఏడాది 4 శాతం పెరిగిన ఈ మందులు ప్రస్తుతం తిరిగి మామూలు ధరకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్ణయించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వీటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏప్రిల్ 15లోగా ఎన్‌పీపీఏ తెలియజేయాలని ఎన్‌పీపీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలై ఎక్కువ రేటును ముద్రించి ఉన్న మందుల డబ్బును సంబంధిత కంపెనీలు డీలర్లకు తిరిగి అందిస్తాయని తెలిపారు.
కాగా భారతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలు. ఎన్‌పీపీఏ ప్రకటించిన జాబితాలో ఉన్న మందుల సంవత్సర ఆదాయం రూ.4,839కోట్లు కాగా, రేట్లు తగ్గిన కారణంగా రూ.647 కోట్ల ఆదాయన్ని కంపెనీలు కోల్పోనున్నాయి. వీటిలో కేవలం గుండె సంబంధిత వ్యాధుల మందులు రూ.250 కోట్లను కోల్పోనున్నట్టు తెలుస్తోంది.