ఒకే నేషన్‌ ఒకే రేషన్, ఒకే జీవన్‌ ఒకే వైరస్‌ | Guest Column By Madabhushi Sridhar On Medical Facilities | Sakshi
Sakshi News home page

ఒకే నేషన్‌ ఒకే రేషన్, ఒకే జీవన్‌ ఒకే వైరస్‌

Published Fri, Jul 3 2020 2:01 AM | Last Updated on Fri, Jul 3 2020 2:03 AM

Guest Column By Madabhushi Sridhar On Medical Facilities  - Sakshi

కరోనా వచ్చినా ఎవరైనా బతికి ఉన్నారంటే అది సర్కారు వారి కరుణ కాదు. రోగ నిరోధక శక్తి వారిలో ఉందని, అది పెరిగి రోగకారకశక్తులను తరిమికొట్టిందని అర్థం. కరోనా సోకి ఎవరైనా చనిపోయారంటే దానికి కారణం వారికి రోగ నిరోధక శక్తి కన్నా బలమైన రోగం ఉందని అర్థం. కరోనా చంపిందా లేక తగిన ఆరోగ్యం లేక మరణించారా అని పాలకులు ఆలోచించడం లేదు. మందులమ్ముకునే వ్యాపారుల ఆలోచనలకు, ప్రభుత్వాలకు మధ్య కొంతైనా తేడా ఉంటే బాగుండేది. కరోనా సోకకపోయినా, రోగ నిరోధక శక్తి తగ్గకపోయినా చనిపోయేవారు కూడా ఉన్నారు, వారే  భయపడి చచ్చేవారు. వరంగల్లులో ఒక డాక్టర్‌ ఉండేవారు. చాలా మంచి డాక్టర్‌. కాని తను చికిత్స చేయలేడనుకుంటే ‘‘ఇదిగో నీకు పెద్ద రోగం వచ్చింది. పెద్దాస్పత్రికి పో. లేకపోతే చచ్చిపోతవు. నేను కుదిర్చే జబ్బుకన్నా నీ జబ్బు పెద్దది. పో’’ అని మహాత్మాగాంధీ స్మారక హాస్పిటల్‌కు తరిమేవాడు. మనం ఇప్పుడు హైదరాబాద్‌లో అందరినీ గాంధీ హాస్పటల్‌కు తరుముతున్నాం.

మందుల కోసం, చికిత్సలకోసం ఎదురు చూస్తున్నాం. ఇది వాడితే పది నిమిషాల్లో కరోనా మాయం అనే వీడియోలు విరివిగా చూస్తున్నారు. ఇది వాడకపోతే చస్తావు అంటే అవి కొనుక్కుంటున్నాం. ఏ ఇంట్లో చూసినా కుప్పలు తెప్పలుగా మందులు. ఆయుర్వేదం, యునానీ, హోమియో, అలోపతి. అంతా అంతే. కానీ రోగం రాకుండా ఏంచేయాలి? కరోనా తగిలితే దాన్ని తిప్పికొట్టే నిరోధక శక్తి ఏ విధంగా పెంచాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఔషధ వ్యాపారులకు ఎట్లాగూ ఉండదు. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి ఇటువంటి ఆలోచన వస్తే బాగుండేది. రోగ నిర్ధారక పరీక్షలు చేయాలని రిట్‌ వేస్తే హైకోర్టు రిట్‌ ఇస్తే గిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోకపోతే ప్రభుత్వం పరీక్షలు చేస్తుంది లేకపోతే లేదు. కరోనా వైరస్‌ మహమ్మారిగా వ్యాపించడం మన లద్దాఖ్‌ సరిహద్దులో చైనా దురాక్రమణ అంతటి భయానక విషయం. మనకు చైనా దాడిలో 20 మంది మరణించడం అర్థమయిందో లేదో గాని కరోనా యుద్ధంలో మన సైనికులు మరణిస్తున్న సంగతి, చాలామంది మరణించడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తు రావడం లేదు.

వేల కోట్ల రూపాయలు పోసి ఆయుధాలు, యుద్ధ విమానాలు, తదితర సామగ్రి కొంటున్నాం గాని, కరోనా తదితర వ్యాధినిరోధక పోషక బలాన్ని పెంచుకోవడానికి, జనాన్ని రక్షించడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో కనిపించడం లేదు. పోషకాల స్థాయి పెంచడం, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత, ఆ విషయాన్ని రాజ్యం గుర్తించి తీరాలని ఆర్టికల్‌ 47లో రాజ్యాంగం మార్గదర్శకాన్ని రాసింది. తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. వెంటనే ఇవి కేవలం సూచనలే.. పాటించే పని లేదని వాదించడానికి లాయర్లు తయారుగా ఉంటారు. డబ్బులిచ్చిన వాళ్లకోసం లా ను ఏవిధంగానైనా ఎటైనా వంచగల ప్రతిభను మన ఆంగ్లేయుల నుంచి వారసత్వంగా ఒంటబట్టించుకున్నాం. ఇది మన డీఎన్‌ఏలో జీర్ణించుకుపోయిన అసలు వైరస్‌. హక్కుల్లో రాయడం సాధ్యం కానివి ఇక్కడ మార్గదర్శకాల్లో రాస్తున్నాం నాయనా, ‘అమలు చేయడానికి వీల్లేదు. కోర్టులు అడగొద్దు అనే చెత్త వాదనలు చేయకండి. బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు కనుక ఉంటే వారు ఈ డ్యూటీ పాటించాలని’ రాజ్యాంగం పార్ట్‌ 4 ఘంటాపథంగా చెబుతున్నది. మనం వింటే కదా. 

మన ప్రధాని మోదీకి మనదేశంలో చాలామందికి ఆకలి ఉందని, పేదరికం ఉందని, తిండి లేదని, అర్థమైనట్టుంది. నవంబర్‌ దాకా మన నేషన్‌లో రేషన్‌ ఉచితంగా ఇస్తానని మరో ప్రాస ప్రామిస్‌ చేశారు. శుభం. అసలు తిండే లేని వాడికి పోషక పదార్థాలు ఎక్కడినుంచి వస్తాయి అనేది ఒక పాయింట్‌. తిండి సరే.. పోషక పదార్థాల సంగతేమిటి? ఇది రెండో పాయింట్‌. ఉచితంగా కాకపోయినా కొనదగిన ధరలకు పోషక పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో తేవాలంటే కాస్త ప్లానింగ్‌ ఉండాలి. రేషన్‌ ఫ్రీగా ఇవ్వడానికి డబ్బు కేటాయిస్తే చాలు. విడుదల చేయవలసి వచ్చేనాటికి లెక్కలు చూసుకోవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ను ప్రింట్‌ చేసిమ్మంటే ఇస్తుంది. ఒక చిన్న పాప చాక్లెట్లడిగింది. రోజూ చాక్లెట్‌కు డబ్బెక్కడినుంచి వస్తుందో అని వాళ్లమ్మ మందలించింది. ‘ఎక్కడినుంచి అంటే ఎటిఎం నుంచి. నువ్వు ఎన్ని సార్లు తేలేదు. నెంబర్లు నొక్కితే నోట్లు రావా’ అని తెలివైన పాప జవాబు. మనకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఏటీఎం వంటిదే కదా? కాగితాలే కదా ప్రింట్‌ చేస్తే సరిపోదా? ఈ మాత్రం చాలా మంది

ఆర్థిక మంత్రులకు తెలియదేమో.
కోట్లాది వలస కార్మికులకు రేషన్‌ కార్డు లేదని మళ్లీ ప్రధానికి ఎవరూ గుర్తు చేయలేదు. రేషన్‌ కార్డుంటే ఒక నేషన్‌ ఒక రేషన్‌ ఇస్తారు. మరి ఒక రేషన్‌ కార్డు కూడా లేనివాడు సొంత నేషన్‌లో ఉన్నట్టా లేనట్టా? రాజ్యాంగం ఆర్టికల్‌ 21 ప్రకారం ఈ నేషన్‌లో రేషన్‌ కార్డు లేని వాడికే బతికే హక్కు లేనట్టా? వాడిది కూడా ఒకే నేషన్‌ ఒకే రేషన్‌ ఒకే జీవన్‌ కదా? ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డూ, స్మార్ట్‌ ఫోన్‌లో సేతు యాప్‌ లేని వాడికి చావడమే బాధ్యతా? ఔషధాలమ్ముకుందామా లేక రోగాన్ని ఎదుర్కొనే పోషకాహార బలం మన జన సైనికులకు ఇచ్చి చైనాను, వైరస్‌ను బార్డర్‌లోనే నిలువరిద్దామా? మన జాతిని బలోపేతం చేసే రాజనీతి మనకు రానే రాదా?
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
ఈమెయిల్‌: madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement