ఆ అమరవీరుడికి న్యాయం దక్కదా? | Madabhushi Sridhar Guest Column On Martyr Krishna Prasad | Sakshi
Sakshi News home page

ఆ అమరవీరుడికి న్యాయం దక్కదా?

Published Fri, Oct 25 2019 2:20 AM | Last Updated on Fri, Oct 25 2019 2:21 AM

Madabhushi Sridhar Guest Column On Martyr Krishna Prasad - Sakshi

27 సంవత్సరాల కిందట హైదరాబాద్‌ పాతబస్తీలో ఇస్లామిక్‌ టెర్రరిస్టులు ఉన్నారన్నా, వారి చేతుల్లో మారణాయుధాలున్నా యన్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ టెర్రరిస్టులు పాతబస్తీ టోలీచౌకీ బృందావన్‌ కాలనీలో మకాం వేస్తారని అనుకోగలమా. అక్కడ ఏవో తీవ్రమైన కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకోవడం ఇంటెలిజెన్స్‌ వారి విజయమనే చెప్పుకోవచ్చు.  ఏదో విధ్వంస రచన జరుగుతున్నదని తెలియగానే యువ పోలీసు అధికారి, అడిషనల్‌ ఎస్‌ పి, సాహసి, జి. కృష్ణ ప్రసాద్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు తలుపుతెరిచారు. వారిని దాటి ముందుకు అడుగు వేస్తుండగానే ఏకే 56 పేలింది. బుల్లెట్లు దూసుకు వచ్చాయి, ప్రసాద్‌ వెంట ఉన్న గన్‌మెన్‌పైన కూడా బుల్లెట్లు కురుస్తున్నాయి. ఇద్దరూ నేలకొరిగారు. కానీ పడిపోయే దశలో కూడా ప్రసాద్‌ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. అవి కొందరిని గాయపరిచాయి.

 తరువాత జరిగిన పరిణామాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రసాద్‌ కాల్పులకు గాయపడిన వారు ఆస్పత్రికి వెళ్లినప్పుడు పోలీసులు పట్టుకోగలిగారు. దాడిలో పాల్గొన్న ఒక టెర్రరిస్టును ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టగలిగారు. మరొక టెర్రరిస్టు ముజీబ్‌ అహ్మద్‌ను పట్టుకోగలిగారు. నేరం రుజువు చేసి ముజీబ్‌ను జైలుపాలు చేయగలిగారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ విజయాలే. కానీ తరువాత సంఘటనలు తీవ్రమైనవి. ముజీబ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అవినీతి పేరుకుపోయిన మన సమాజంలో టెర్రరిస్టులు జైలులో కూడా సకల సౌకర్యాలు పొందుతారు. విశాఖ సెంట్రల్‌ జైలులో ముజీబ్‌కు జైలు అధికారుల ప్రేమాద రాలు లభించాయని ఆ జైల్లో కొంతకాలం ఉండి విడుదలైన నక్సలైట్ల నాయకుడు నాగార్జున రెడ్డి ఆగస్టు 2004లో ఓ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ముజీబ్‌కు మూడు సెల్‌ఫోన్లు అందుబాటులో ఉంచారని, ఆ టెర్రరిస్టు వాటితో తమ జేకేఎల్‌ఎఫ్‌  సహచరులతో సంప్రదింపులు జరిపేవారని నక్సలైట్‌ ఖైదీ చెప్పారు. విచిత్రమేమంటే నాగార్జున రెడ్డి విడుదలైన నెలలోనే ముజీబ్‌ కూడా విడుదలైనాడు. నాగార్జున రెడ్డి ఆరోపణలు నిజంకావని జైలు అధికారులు కొట్టి పారేశారు. తమకు సెల్‌ ఫోన్లున్నా విశాఖ సెంట్రల్‌జైల్‌లో పనిచేయవని, నెట్‌వర్క్‌ ఎప్పుడూ ఉండదని వారు చెప్పుకున్నారు. ఒకసారి లంచం రుచి మరిగిన వారికి టెర్రరిస్టుల విధ్వంసం కళ్లకు కనబడదు. డబ్బే కనిపిస్తుంది. వీరి అండదండలతో ముజీబ్‌ తన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాడనుకోవాలి.

 భారత స్వాతంత్య్రోత్సవ దినాన టెర్రరిస్టుకు స్వతంత్రం లభించింది. ఎంత స్వతంత్రం అంటే ఎస్కార్టు కల్పించి విశాఖ నుంచి హైదరాబాద్‌ దాకా తీసుకువచ్చి వాడిని సాగనంపారు. అతను హైదరాబాద్‌లో తన మిత్రులను కలుసుకుని సహచరులతో హాయిగా సంప్రదించి ఉత్తర భారత్‌ వైపు వెళ్లిపోయి అక్కడ కూడా కొన్ని టెర్రరిస్టు కార్యక్రమాలు జరిపి దొరికిపోయాడని, ఆ తరువాత పోలీసుల అద్భుతమైన కస్టడీ నుంచి తప్పు కుని పారిపోయాడని తెలిసింది. మళ్ళీ దొరకలేదు. జైలునుంచి స్వాతంత్య్ర దినోత్సవ బహుమతి కింద విడుదలైన ఈ టెర్రరిస్టు సాగించిన నేరాలకు ఎవరు బాధ్యులు.అతను ఇంకా నేరాలు చేస్తూ ఉంటే ఆ నేరాలకు ఎవరు బాధ్యులు. టెర్రరిజం ప్లస్‌ లంచగొండితనం ప్లస్‌ అసమర్థత, నిర్లక్ష్యం కలిస్తే ఎందరు కృష్ణ ప్రసాద్‌లైనా నేలకొరుగు తారు. ఎందరు వెంకటేశ్వర్లయినా బుల్లెట్లకు బలవుతారు.

ముజీ బ్‌ను విడుదల చేసిన ప్రభుత్వ అధికారులకు శిక్షలు ఉండవు, ఉన్నా పడవు. ఆ టెర్రరిస్టులను ఎంతో ప్రేమతో ఆదరించిన లంచగొండి అధికారులెవరో తెలుసుకునేందుకు విచారణ కూడా జరపరు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమరులైపోయిన కృష్ణ ప్రసాద్‌ వంటి వీరులను పట్టించుకోరు, గుర్తించరు, సరైన అవార్డులు, పతకాలు ఇవ్వరు. భారత స్వతంత్ర సమరంలో మద్రాస్‌లో బ్రిటిష్‌ పోలీ సుల తుపాకీలకు ఛాతీ విప్పి ఎదుర్కొన్న టంగు టూరి ప్రకాశంగారిని మనం ఆంధ్ర కేసరి అని గౌర విస్తాం. కానీ ఏకే 56 బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన కృష్ణ ప్రసాద్‌ వంటి అమరవీరులను ఏవిధంగా గౌరవిస్తున్నాం?


మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement