
ఆ గోప్యత అవినీతికి దారి
ఒక విద్యార్థి పరీక్ష ఇచ్చిన తరువాత ఫలితం ఏదైనా ఆ వివరాలు వ్యక్తిగత సమాచారమే కాదు.
విశ్లేషణ
ఒక విద్యార్థి పరీక్ష ఇచ్చిన తరువాత ఫలితం ఏదైనా ఆ వివరాలు వ్యక్తిగత సమాచారమే కాదు. ఇది విశ్వవిద్యాలయమే తయారుచేసి ఇచ్చిన సమాచారం. కనుక విద్యార్థి మూడో వ్యక్తి అని, అది అతని సమాచారమని అనడానికి వీల్లేదు.
డిగ్రీ చదువుల సమాచారం అడిగితే చాలు, ఇవ్వకుండా ఉండటం ఎట్లా అని ఆలోచించే మనస్తత్వం మన వాళ్లతో ఉన్న సమస్య. విద్యార్థికి అతని డిగ్రీ గురించి వివరిస్తాం కాని, మరొక మాజీ విద్యార్థి వివ రాలు అడగడానికి వీల్లేదని అంతా అనడం లేదు. మామూ లుగానైతే ఎన్నో విశ్వవిద్యాలయాలు అడిగిన వారికి ఆ సమాచారం ఇస్తున్నాయి. కాని ప్రముఖుల డిగ్రీల గురించి అభ్యర్థనలు వస్తే.. ఇవ్వకుండటానికి మార్గాలు వెతుకుతుంటారు. ఇస్తే ఏ ఇబ్బందులు వస్తాయోనని ప్రజా సమాచార అధికారుల (పీఐఓ) ఆందోళన.
పదో తరగతి పరీక్షా ఫలితాలను, ఆ తరువాత ఏడో తరగతి ఫలితాలను పత్రికల్లో ప్రచురించడం తెలిసిందే. గ్రాడ్యుయేషన్ స్థాయి ఫలితాలను కూడా బహిరంగంగా ప్రకటిస్తారు. కాలేజీ నోటీసు బోర్డులో వేలాడదీస్తారు. అందులో విద్యార్థుల పేర్లు, వారి ప్రతిభ, వైఫల్యాలు రెండూ వెల్లడిస్తారు. కొన్ని డిగ్రీల ఫలితాలను పేర్లతో సహా ఇస్తారు. ఈ సమాచారాన్ని మూడో వ్యక్తికి చెంది నది అనే నెపంతో తిరస్కరించడం ఎంత వరకు సమం జసం? సీపీఐఓలు ఇవన్నీ గమనిస్తే ఇది మూడో వ్యక్తి సమాచారమో కాదో తెలుస్తుంది. ఒక విద్యార్థి డిగ్రీ పరీక్ష ఇచ్చిన తరువాత ఫలితం ఏదైనా ఆ వివరాలు వ్యక్తిగత సమాచారమయ్యే అవకాశమే లేదు. 10, 12 తరగతులు లేదా ఇంటర్మీడియట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవి కొన్ని అర్హతలు. ఆ అర్హతలు అవసరమైన చోట వాటి గురించి చర్చ తప్పదు. అర్హతలున్నాయో లేదో పరిశీ లించకా తప్పదు. ఇది విద్యార్థి విశ్వవిద్యాలయానికి ఇచ్చిన సమాచారం కాదు. విశ్వ విద్యాలయమే తయా రుచేసి ఇచ్చిన సమాచారం. కనుక విద్యార్థి మూడో వ్యక్తి అని, అది అతని సమాచారమని అనడానికి వీల్లేదు.
విశ్వవిద్యాలయం శాసనసభ చేసే ఒక చట్టం ద్వారా ఏర్పడుతుంది. అంటే విద్యాసంస్థను నెలకొల్పి డిగ్రీ ఇచ్చే అధికారాన్ని కొన్ని ప్రమాణాలతో ఆ సంస్థకు కట్టబెడతారు. రిజిస్టర్లో ఆ వివరాలు నమోదు చేస్తారు. ప్రయివేటు కాలేజీలు పెట్టుకోవచ్చు. కాని డిగ్రీ ఇచ్చే అధికారం చట్టపరమైన∙ఆమోదాన్ని పొందిన విశ్వవి ద్యాలయాలకే ఉంటుంది. డిగ్రీ అర్హతపై సందేహం లేదా ఆరోపణ వస్తే లేదా అభ్యర్థి తన డిగ్రీని కోల్పోతే ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆ రిజిస్టర్ ఉపయోగపడుతుంది. పై చదువులకు, ఉద్యోగాలకు అర్హత అయిన డిగ్రీల గురించి తెలుసుకోవాలనుకోవడం సహజం. ఉద్యోగం లేదా పై చదువుల్లో ప్రవేశం చాలా పోటీ ఉండే అంశాలు. కనుక అర్హతల ప్రమాణాలను చెçప్పుకోవలసిందే.
ఉదాహరణకు ఒక డాక్టరు తన డిగ్రీల గురించి, ప్రత్యేకతలున్నాయని బోర్డు మీద రాసుకుంటాడు. దాన్ని నమ్మి రోగి అతని దగ్గర చికిత్స చేయించు కుంటాడు. పొరబాటున వైద్యం వికటిస్తే ఆ డాక్టర్ అర్హత మీద అనుమానం వస్తుంది. అతని డాక్టర్ డిగ్రీని పరి శీలించే అధికారం ఉంటుంది.
పబ్లిక్ డాక్యుమెంట్ అంటే ఏమిటో సెక్షన్ 74 సాక్ష్య చట్టం నిర్వచించింది. దాని ప్రకారం యూనివర్సిటీ రిజిస్టర్ పబ్లిక్ డాక్యుమెంట్. ప్రభుత్వ సార్వభౌమాధి కారానికి సంబంధించిన పత్రాలు, అధికారిక సంస్థలు న్యాయ నిర్ణాయక సంస్థల పత్రాలు, భారత ప్రభుత్వ అధికారులు, శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థల పత్రాలు, కామన్‌వెల్త్ పత్రాలు, విదేశీ పత్రాలను ప్రభుత్వ పత్రాలుగా పరిగణిస్తారు. సెక్షన్ 76 ఈ పత్రాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. చట్ట ప్రకారం నిర్దేశించిన ఫీజును చెల్లించి, అవి కావాలని అభ్యర్థించిన వ్యక్తికి వాటిని పరిశీలించే హక్కు ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ అధికారి తన అధీనంలో ఉన్న ప్రభుత్వ పత్రాల నకలు కాపీలను... అవి నిజమైనవేనని ధృవీకరిస్తూ పేరు, హోదా, ముద్రతో సహా ఇవ్వాలి. ఆ కాపీలను «ధృవ ప్రతులని అంటారు.
అమెరికాలో డిగ్రీ సమాచారాన్ని డైరక్టరీ సమాచా రమనీ. అది అందరికీ తెలియవలసిందని అంటారు. అయితే అది అర్హత కాని సందర్భాల్లో ఆ డిగ్రీ తనకు ఉందని విద్యార్థి చెప్పుకోదలచుకోకపోతే... ఆ సమాచా రాన్ని ఇవ్వకుండా ఆపడం ప్రత్యేక పరిస్థితుల్లో జరుతుం టుంది. అంతేకానీ సాధారణంగా దాన్ని దాచడానికి వీల్లేదు. ఒక వ్యక్తి పదో తరగతి పది సార్లు ఫెయిలయ్యా రనుకుందాం. ఆ తరువాత అతను ఏదీ చదవదలచు కోలేదు. ఏదో వ్యాపారంలో స్థిరపడ్డాడు. అప్పుడు ఆయన పదో తరగతి పదిసార్లు ఫెయిలయ్యాడని పని గట్టుకుని ఎవరూ చెప్పనవసరం లేదు. ఆ సమాచారం ఎవరైనా అడిగితే ఇవ్వకుండా ఉండే హక్కు ప్రయివసీ హక్కు అవుతుంది. కాని పదో తరగతి అర్హతపై ఇంట ర్మీడియట్ చదవదలచుకున్నా, తన చదువు గురించి తానే చెçప్పుకున్నా... అడిగిన వారికి ఆ విషయం చెప్పక తప్పదు. చదువుల వివరాలు, పాస్ అయినా ఫెయిల్ అయినా సరే బహిర్గతం చేస్తే అది ప్రయివసీని భంగ పరిచే చర్యగా భావించడానికి వీల్లేదు. డిగ్రీల వివ రాలను రహస్యం అని నిర్ధారిస్తే, అది అవినీతికి గేట్లు తెరుస్తుంది. చదువు పది మందికి చెప్పుకోవలసిన అర్హత. చదువును దాచడం, చదువు వివరాలను దాచడం సమంజసం కాదు.
(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com)