పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు పొరుగు రాజకీయ పార్టీవారి ఎమ్మెల్యేలు అధికారపార్టీకి అంత రుచిగా ఎందుకుంటారు? సైకిల్ గుర్తుకు జనం ఓటేస్తే కమలం పూలు చెవిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? చేతికి చేయిచ్చి కారెందుకు ఎక్కుతున్నారు? ఫిరాయింపు ఇంత యింపుగా ఎందుకుంది? ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పచ్చ కండువాలు తీసేసి కాషాయం కప్పుకున్నారు నలుగురు రాజ్యసభ సభ్యులు. ఎమ్మెల్యేలు ఎటు పోవాలో అని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలామంది వైస్సార్‌సీపీలో చేరడానికి కూడా సిద్ధపడ్డారని, కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తేనే తలుపు తీస్తామని కొత్త సీఎం షరతు పెట్టడంతో గేట్లు బందైపోయి వారంతా ప్రజాసేవ చేయడానికి మార్గాలు కనబడక ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకుంటున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం గేట్లు బార్లా తెరిచి, ఎర్రతివాచీ పరిచి సిద్ధంగా ఉంది. ప్రధాన మంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ అధ్యక్షుడు తదితర పెద్దలతో గోడ దూకిన వారి ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు సిద్ధం చేసి ఉంచారు. ఆ నలుగురి తరువాత ఇంకా ఎవరూ రాలేదేమిటి చెప్మా? తెలంగాణా వెనుకబడి ఉందనుకుంటున్నారా? పన్నెండు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండాలు వదిలేసి గులాబీ కండువాలు కప్పుకున్నారు. చేయికి చేయిచ్చిన ఎమ్మెల్యేల వల్ల పాపం కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. పన్నెండుమంది ప్రజాసేవ చేయాలనుకున్న మహోన్నత లక్ష్యం ముందు ఒక్క నాయకుడి ప్రతిపక్ష హోదా ఉంటేనేం పోతేనేం.
ఎందుకు పార్టీలు మారతారో పిచ్చి జనానికి ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదు. జనం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కోపం రాదా? వచ్చింది. తమ వాక్ స్వాతంత్య్రాన్ని వారు కూడా వాడుకున్నారు. మేం గొర్రెలమా బర్రెలమా అమ్ముడు బోవడానికి? అని కళ్లెర్రజేసారు. ఒక్కొక్కళ్లమే టీఆర్‌ఎస్‌లో చేరికతో మమ్మల్ని అనాలె. పన్నెండో వాడు వచ్చేదాకా ఆగినం కదా. మేం భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా పాటిం చాం. తూట్లు పొడవలేదు తెలుసా అని రాజ్యాంగసూత్రపు అరటిపండు ఒలిచిపెట్టారు.
మా పరువు తీసే వ్యాఖ్యలపైన మేం పరువు నష్టం కేసులు పెడతాం అని కూడా ప్రకటించారు. ఎమ్మెల్యేలు పరువు పోతే బతకగలరా? ఏం వారేమయినా పార్టీని పెళ్లిచేసుకుని తాళి గట్టించుకున్నారా జీవితాంతం బానిసల్లా పడి ఉండడానికి? రాజ్యాంగం, చట్టం, కోర్టులు వీరి పరువును వీరి హక్కులను, బాధ్యతలను కాపాడటానికి లేవా? 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉంటేనేం. మా పరువు కేసులు ముఖ్యం కాదా అని వారన్నా అనగలరు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమకు టిక్కెట్ ఇచ్చిన పార్టీ పట్ల కృతఘ్నులుగా ఉన్నారని అనడానికి ఏ మాత్రం వీల్లేదు. ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీకి విలువైన సలహా ఇచ్చారు. కార్పొరేట్ కన్సల్టెన్సీ వారైతే లక్షడాలర్లు ఫీజు వసూలు చేసేవారు. కానీ ఉచితంగా అదీ ఎంతో పారదర్శకంగా ఇచ్చారు. ‘అసలు కాంగ్రెస్ 2014 నుంచి ప్రతి ఎన్నికలో ఎందుకు ఓడిపోతున్నదో’ అంతరాత్మను అడగాలట. ‘మరి ఈ పన్నెండు మంది గెలవడం కాంగ్రెస్ గెలుపు కాదా’ అని మీరడగొద్దు. బుద్ధిగా నోరుమూసుకుని అధికార పార్టీ ఎంఎల్యేలు చెప్పింది వినాలె మరి. ‘గెలిస్తే ఏమిటి. వారంతా టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయినట్టు కాదా?’ అంటారు. అదీ నిజమే.
ఏపీలో టీడీపీని చిత్తుగా ఓడించింది వైఎస్సార్‌సీపీ అయితే నేతలు బీజేపీలో ఎందుకు చేరుతున్నట్టు? గెలిచిన పార్టీలో చేరాలి కదా అని ఒకాయనకు ధర్మసందేహం వచ్చింది. అందువల్ల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల బలం పెరిగేది. చేరిన వారికేమో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అండదండలతో బోలెడంత ప్రజాసేవ చేసుకునే వీలు కలిగేది. అయితే ఆ పెద్దల దూరదృష్టి గొప్పది. ఎంపీలంటే కేంద్రంలో ఉండాలి. రాజ్యసభ డిల్లీలో ఉంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. మన రాష్ట్రంలో వారికి ఒక్కసీటు కూడా లేకపోతేనేం.
ఇప్పుడు నాలుగు రాజ్యసభ సీట్లిద్దాం అన్న విశాల భావన, దేశభక్తి ఉదయించినప్పుడు మనం తప్పు బట్టకూడదు. ఈడీ, సీబీఐ, ఐబీ, రిజర్వ్‌బ్యాంక్, తాము ఎగ్గొట్టిన కోట్లరూపాయల అప్పులిచ్చిన ఇతర బ్యాంకుల కన్సార్టియమ్‌లు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటాయని తెలియదా? అదీగాకుండా మన ప్రియ తమనేతను ఓడించిన రాష్ట్ర ప్రజల సేవకన్నా దేశ ప్రజలందరికీ సేవచేయడం ఇంకా గొప్ప పనికదా. అయినా వడ్డించేవాడు మనవాడయితే, సభాపతులు, చైర్మన్లు మనవాళ్లయితే ఏ పంక్తిలో ఉంటేనేం ఏ పార్టీలో తింటేనేం?
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment