
సాక్షి, విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామంటూ ఆ పార్టీ నేతలు సుద్ధపూస మాటలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఇవే మాటలు వల్లిస్తున్నారు. అయితే, రాజీనామా చేయకుండానే మేయర్లను చేర్చుకున్న టీడీపీ.. నిసిగ్గు రాజకీయాలు మొదలుపెట్టింది.
ఏలూరు మేయర్, కార్పొరేటర్లను నారా లోకేష్ టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేటర్, మేయర్ పదవులకు రాజీనామా చేయకుండానే చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. ఒంగోలులో మేయర్‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేయకుండానే చేర్చుకోవడం ద్వారా తన వక్రబుద్ధిని చాటుకున్నారు.
మరోవైపు, విశాఖలో కూడా ఏడుగురు కార్పొరేటర్లను రాజీనామాలు చేయకుండానే పల్లా శ్రీనివాస్ టీడీపీలో చేర్చుకున్నారు. జనం ఓట్లేసే పదవులకు రాజీనామాలు చేయించని టీడీపీ ఎమ్మెల్యేలు.. మీడియా ముందు సుద్దపూస మాటలు చెబుతున్నారు. రాజీనామా చేస్తేనే చేర్చుకుంటామంటూ గంటా, బుచ్చయ్యచౌదరి ప్రగల్భాలు పలుకుతున్నారు. టీడీపీ నేతల మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment