సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 2,76,861 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 23,205, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 2,53,656, ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.145.07 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ పి. నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు.
హైకోర్టులో 233 కేసులు..
హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ. శ్రవణ్‌కుమార్, జస్టిస్ కె.శరత్‌లు పాల్గొన్నారు. హైకోర్టులో 233 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు.
‘వినియోగదారుల’కమిషన్ ఆధ్వర్యంలో..
పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం కోసం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిధిలోని 13 ఫోరంలలో ఈ కేసులను పరిష్కరించినట్లు రాష్ట్ర కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర కమిషన్‌తో పాటు 10 పాత జిల్లాల పరిధిలోని 12 జిల్లా ఫోరంలలో 355 కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేశారు. వీటిలో 248 కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వగా, 74 కేసులను ఒక్కరోజే పరిష్కరించారు. ఈ కేసుల విలువ రూ.2.11 కోట్లు ఉంటుందని కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా రాష్ట్ర కమిషన్ పరిధిలో 29 కేసులను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment