సంపాదకీయం: కేసు విచారణలో ఎడతెగని జాప్యం జరిగితే శిక్ష విధింపులో కనికరం చూపవచ్చని సుప్రీంకోర్టు రెండురోజులక్రితం ఇచ్చిన తీర్పు ఎందరికో ఉపశమనం కలగ జేస్తుంది. ఓడిపోయినవాడు కోర్టులోనే ఏడిస్తే... కేసు నెగ్గినవాడు ఇంటికెళ్లి ఏడుస్తాడన్న నానుడి ఇప్పటిది కాదు. కాలదోషం పట్టిన నిబంధనలు కావొచ్చు... కావాలని విచారణను జాప్యం చేయడం కోసం ‘వేలికేస్తే కాలికి... కాలికేస్తే వేలికి’ అన్నట్టు వ్యవహరించే న్యాయవాదులవల్ల కావొచ్చు... తగిన సంఖ్యలో న్యాయమూర్తులను నియమించలేని మన పాలకుల చేతగానితనంవల్ల కావొచ్చు...మన దర్యాప్తు విభాగాల తీరుతెన్నులవల్ల కావొచ్చు పెండింగ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతున్నది.
సర్వోన్నత న్యాయస్థానంనుంచి కింది కోర్టు వరకూ దాదాపు మూడున్నర కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఒక అంచనా. సుప్రీంకోర్టులో 65,661 కేసులు, దేశంలోని 21 హైకోర్టుల్లో 44,34,191 కేసులు పెండింగ్‌లో ఉంటే కింది కోర్టుల్లో మరో మూడు కోట్ల కేసులు వాయిదాల్లో నడుస్తున్నాయి. ఇందులో క్రిమినల్ కేసుల వాటా కూడా తక్కువేమీ కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15, 20 సంవత్సరాల్లో పెండింగ్ కేసులు 15 కోట్లు దాటినా ఆశ్చర్యంలేదని నిపుణులు చెబుతారు. ఒక నేరానికి విచారణ జరిపి శిక్ష ఖరారుచేయాల్సి ఉండగా...అసలు విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా పరిణమించడం ఒక వైచిత్రి. ఇందుకు కారణాలు అనేకానేకం. అడపా దడపా ఇచ్చే తీర్పుల్లో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. లా కమిషన్ నివేదికల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు వెలువడుతూనే ఉంటాయి. కానీ, పరిస్థితి మాత్రం ‘ఎక్కడేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉంది.
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించడానికి ముందురోజు ఇటలీ మెరైన్ల కేసులో సాగుతున్న జాప్యంపై ఆ దేశం నిరసన వ్యక్తంచేసింది. రెండేళ్లుగా తమ మెరైన్లు ఇద్దరూ జైళ్లలో మగ్గుతున్నారని, ఇంతటి జాప్యం జరిగింది గనుక వారిద్దరినీ బేషరతుగా విడుదలచేయాలని మన సుప్రీంకోర్టును కోరింది. కేరళ తీరంలో సముద్ర దొంగలుగా భావించి ఇద్దరు జాలర్లను కాల్చిచంపిన కేసులో ముద్దాయిలైన ఈ మెరైన్లపై ఇంతవరకూ చార్జిషీటే దాఖలు చేయలేదంటే మన దర్యాప్తు విభాగాల తీరు ఎలా ఉన్నదో అర్ధమవుతుంది. ఎఫ్‌ఐఆర్ దాఖలుకు రెండేళ్ల సమయం పట్టడం విచిత్రమే అయినా మన వ్యవస్థలోని సంక్లిష్టత కారణంగా అది వేరే రకంగా ఉండటం సాధ్యంకాదని విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారంటే ఎంతటి నిస్సహాయత అలుముకొని ఉన్నదో అర్ధమవుతుంది.
ఏళ్లకేళ్లు సాగుతున్న విచారణలు నిరుపేదల మూల్గులు పీలుస్తున్నాయి. అసలు ఎలాంటి నేరమూ చేయనివారూ, కొన్ని సందర్భాల్లో తాము చేసిన నేరమేమిటో కూడా తెలియనివారూ సంవత్సరాలతరబడి జైళ్లలో మగ్గుతున్నారు. వారి కుటుంబసభ్యులు దుర్భరమైన జీవితం గడుపుతున్నారు.
కేవలం మూడు నెలల శిక్షపడే కేసుల్లో కూడా విచారణ తేలక పదేళ్లుగా జైల్లో మగ్గుతున్నవారున్నారు. ఒకవేళ ఏనాటికైనా విచారణ పూర్తయి అలాంటివారంతా నిర్దోషులుగా బయటపడితే వారు కోల్పోయిన స్వేచ్ఛాయుత జీవనానికి ప్రభుత్వాలు తగిన పరిహారం చెల్లిస్తాయా అంటే అదీ లేదు. అసలు మన జైళ్లలో ఉన్నవారిలో 70శాతంమంది విచారణలో ఉన్న ఖైదీలేనని ఒక సర్వేలో వెల్లడైంది. ఎప్పటికీ తేలని కేసులవల్ల పేదవర్గాలవారు సమస్యలు ఎదుర్కొంటుంటే... డబ్బూ, పలుకుబడీ ఉన్నవారికి అదొక వరంగా మారుతున్నది. విచారణ పెండింగ్‌లో ఉండటాన్ని చూపి అలాంటివారు బెయిల్ తెచ్చుకుని స్వేచ్ఛా జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారి బాధితులు యధావిధిగా బెదిరింపులను ఎదుర్కొంటున్నారు.
కేసుల విచారణకు అవసరమైనంతమంది న్యాయమూర్తులు కొరవడటం పెండింగ్ కేసులకు ముఖ్యమైన కార ణమనడంలో సందేహం లేదు.
మన జనాభాకు అనుగుణమైన రీతిలో న్యాయమూర్తుల సంఖ్య లేదు. పది లక్షలమంది జనాభాకు 14మంది న్యాయమూర్తులున్నారని ఒక అంచనా. సుప్రీంకోర్టులో 15శాతం, హైకోర్టుల్లో 30 శాతం, కింది కోర్టుల్లో దాదాపు 25 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే కేసుల వెనక మనుషులు, వారి విలువైన జీవితాలు ఉంటాయన్న ఎరుక లేనివారివల్ల కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. జవాబుదారీతనం ఉంటే దీన్ని చాలావరకూ సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఏదో కారణాన్ని చూపి వాయిదాలు కోరే న్యాయవాదులు, ఆ విషయంలో ఉదారంగా వ్యవహరించే న్యాయమూర్తులవల్ల కూడా జాప్యం జరుగుతుందని మరువరాదు. సకాలంలో సమకూడని న్యాయం అన్యాయం కిందే లెక్కని వేరే చెప్పనవసరంలేదు. సంస్థాగతంగా తమలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా న్యాయస్థానాలకుంటుంది.
నిజానికి ఆ దిశగా సుప్రీంకోర్టు ఇప్పటికే కొంత కృషి చేసింది. విచారణలో జాప్యాన్ని నివారించమని సందర్భం వచ్చినప్పుడల్లా కింది కోర్టులకు సూచిస్తూనే ఉంది. తాజా తీర్పు ఇవ్వడానికి కారణమైన కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు ఈ సంగతే చెప్పింది. ఒక సివిల్ తగాదా పరిష్కారానికి కింది కోర్టుల్లో సగటున 15 సంవత్సరాలు, క్రిమినల్ కేసు సగటున పదేళ్లు పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేసింది. ఆ కేసుల్ని సవాల్ చేసిన పక్షంలో వాటి పరిష్కారానికి మరో పదేళ్లు పడుతున్నదని కూడా తెలిపింది. నిర్దిష్ట కాలావధిలో దర్యాప్తు, విచారణ ప్రక్రియలు పూర్తికావాలన్న నిబంధన విధిస్తేతప్ప దీన్ని సరిదిద్దడం అసాధ్యం. కనుక ఆ దిశగా కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
‘పెండింగ్’ సమస్యలు!
Published Wed, Feb 19 2014 2:22 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement