న్యూఢిల్లీ: జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్(ఎన్‌జేడీజీ)తో సుప్రీంకోర్టు కేసుల వివరాలు అనుసంధానించారు. ఇకపై సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు కక్షిదారులుసహా అందరూ చూడొచ్చు. ఈ వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కోర్టురూమ్‌లో వెల్లడించారు.
తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులో ఎన్నెన్ని కేసుల విచారణ పూర్తయింది, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనేదంతా తెల్సిపోతుంది. ‘ ఇదో చిన్న ప్రకటనే. కానీ ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఎన్‌ఐసీ బృందం, సుప్రీంకోర్టు టీమ్ కలిసి ఈ వేదికను అభివృద్ధిచేశాయి. సంవత్సరాలవారీగా, రిజిస్ట్రర్ అయిన, రిజిస్టర్‌కాని, కోరమ్ వారీగా ఇలా భిన్న విధాలుగా కేసుల వివరాలు పొందొచ్చు.
62,946 సివిల్ కేసులు, 16,555 క్రిమినల్ కేసులు మొత్తంగా 80,501 పెండింగ్ కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు ఎదురుచూస్తున్నాయి. అన్ని వివరాలను వెబ్‌పేజీలు అందిస్తాయి. ఎన్‌జేడీజీలో సమాచారం అప్‌లోడ్ ద్వారా న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత ఇనుమడిస్తుంది’ అని సీజేఐ చెప్పారు. 585 కేసులను త్రిసభ్య ధర్మాసనాలకు అప్పజెప్పాల్సి ఉంది. త్వరలోనే ఆయా ధర్మాసనాలను ఏర్పాటుచేస్తానని సీజేఐ పేర్కొన్నారు.
‘స్వేచ్ఛా సమాచార పాలసీ’లో భాగంగానే ఇవన్నీ అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ఎన్‌జేడీజీలో 18,735 జిల్లా, సబార్డినేట్ కోర్టులు, హైకోర్టుల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ–కోర్ట్స్ ప్రాజెక్టు కింద దీనిని ఏర్పాటుచేశారు. కక్షిదారులకు వెబ్ సేవల ద్వారా అన్ని హైకోర్టులు ఎన్‌జేడీజీతో అనుసంధానమయ్యాయి. వేర్వేరు రకాల కేసులు సంవత్సరాలవారీగా ఈ పోర్టల్‌లో ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. కేసుల సంబంధ సమస్త సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా పొందొచ్చు.
పారదర్శకతలో పై మెట్టు: మోదీ
‘ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ వేసిన గొప్ప ముందడుగు ఇది. అధునాతన సాంకేతికతతో న్యాయవితరణలో, న్యాయవ్యవస్థలో పారదర్శకత మరో మెట్టు పైకి ఎక్కింది’ అంటూ ఎన్‌జేడీజీలో సుప్రీంకోర్టు అనుసంధానాన్ని ప్రధాని మోదీ శ్లాఘించారు.
Comments
Please login to add a commentAdd a comment