
సాక్షి, హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవిపై గందరగోళం ముసురుకుంది. ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల 2వ తేదీనే తీర్మానం చేసి పంపినా.. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదించినట్టుగా ప్రకటనేదీ రాలేదు. వాస్తవానికి కేబినెట్ తీర్మానానికి సంబంధించిన ఫైలు సీఎం కార్యాలయంలోనే ఉందని.. కౌశిక్‌రెడ్డిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెండింగ్‌లో ఉండటమే దీనికి కారణమని విశ్వసనీయ సమాచారం. ఆయా కేసుల వివరాలను పూర్తిగా సేకరించాకే.. ఫైలును గవర్నర్ ఆమోదం కోసం పంపే అవకాశం ఉందని తెలిసింది.
చాలా పోలీస్‌స్టేషన్లలో..: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్‌రెడ్డిపై ఇల్లందకుంట, సుబేదారి పోలీస్‌స్టేషన్లలో కేసులు పెట్టారు. ఆ తర్వాత కూడా వీణవంక, హుజూరాబాద్ టౌన్, కరీంనగర్, జమ్మికుంట, సిరిసిల్ల తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వాహనం పార్కింగ్ విషయంలో తమ బంధువుపై కౌశిక్‌రెడ్డి దాడి చేశారని 2019 ఫిబ్రవరిలో సినీనటులు జీవిత, రాజశేఖర్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. మొత్తంగా ఆయా కేసులేమిటి, వాటి వెనుక ఉన్న కారణాలేమిటన్న దానిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ నివేదికను పూర్తిగా పరిశీలించాకే.. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
హడావుడి సిఫారసు నేపథ్యంలో..
టీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ నిష్క్రమణ నేపథ్యంలో.. అప్పటికి కాంగ్రెస్‌లోనే ఉన్న కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తానేనంటూ చేసిన ప్రకటన వివాదాస్పమైంది. కౌశిక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మొదట్లో భావించినా.. తర్వాత పునరాలోచనలో పడినట్టు సమాచారం. అయితే హుజూరాబాద్‌లో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌశిక్‌రెడ్డిని హడావుడిగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ తీర్మానించారు. సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో అనుభవమున్న వారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అధికారం రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కౌశిక్‌రెడ్డి.. తన తల్లి పేరిట కరీంనగర్ జిల్లాలో ‘పుష్పమాల దేవి మెమోరియల్ ట్రస్టు’ పెట్టి 2009 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మేరకు క్రీడా, సేవా రంగాల్లో చేసిన కృషి మేరకు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో పేర్కొంది. అయితే కౌశిక్‌రెడ్డికి పదవి ఇవ్వడంపై హుజూరాబాద్ టీఆర్‌ఎస్ శ్రేణులతోపాటు రాష్ట్ర నాయకుల్లోనూ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమైనట్టు తెలిసింది. ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసుల విషయంగా సీఎంకు ఫిర్యాదులు అందాయని, దానితో నివేదిక కోరారని సమాచారం.
ఆచితూచి నిర్ణయంపై..
మహారాష్ట్రలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నామినేట్ చేయడంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో నెలల తరబడి నలుగుతోంది. మన రాష్ట్రంలోనూ గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లను నామినేట్ చేయడంపై ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి్డ విషయంగా ఆచితూచి అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ వీడటంలోనూ వివాదం
పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లంచం ఇచ్చారని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment