
జమ్మికుంట (హుజూరాబాద్): కాషాయ జెండా చేతిలో పట్టుకొని ఎర్ర జెండా డైలాగులు కొడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రజలు నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ పత్తి మార్కెట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీయూసీ కార్మిక సంఘాలు, టీడీపీ నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
చదవండి: కాటేసిన అప్పులు.. ఇద్దరు రైతులు బలవన్మరణం
ప్రజల బాధను తన బాధగా భావించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, అందుకే వారి బాధలు దూరం చేసే అనేక పథకాలను తీసుకువచ్చారని, కానీ ఈటల రాజేందర్ మాత్రం తన బాధను ప్రజల బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ ఆరోపించారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ పరిధిలో ఒక్కరికైనా డబుల్ బెడ్‌రూం ఇచ్చారా అని ప్రశ్నించారు. జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లో కార్మికులు, ఇల్లు లేని పేదకుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం మంజూరు చేస్తామని, సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునేలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు బాటలో ఉన్నారని, బీజేపీని చిత్తుగా ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మిక, రైతు వ్యతిరేకత, వ్యవసాయ మార్కెట్ యార్డు బంద్ అనే పాలన చేస్తున్న బీజేపీకి కార్మికులు, రైతులు గుణపాఠం చెప్పాలని సూచించారు. సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పాడి కౌశిక్‌రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
చదవండి: హుజురాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం