సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కౌశిక్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న కౌశిక్ రెడ్డి ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా మాట్లాడారు.. ‘కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి నాకు చిరకాల మిత్రుడు. తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరారు. ప్రొఫెసర్ జయశంకర్ సలహాతో ఉద్యమాన్ని నడిపాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమం కొనసాగించాం. ప్రజాస్వామ్యంలో పార్టీలు ఓడడం.. గెలవడం నిరంతర ప్రక్రియ. శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండరు.. ఇది రాచరిక వ్యవస్థ కాదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment